కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూ సూద్ సోదరి మాళవిక: గేమ్ ఛేంజర్ అంటూ సిద్ధూ
ఛండీగఢ్: కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో అనేక మంది వలస కార్మికులను, సాయం కోరిన వారిని ఆదుకుని రియల్ హీరోగా మారిన ప్రముఖ సినీనటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన స్వస్థలం పంజాబ్‌లోని మోగా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారు. మోగాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. స్వయంగా సోనూ సూద్ నివాసానికి వెళ్లారు. సోనూసూద్, మాళవికతో చర్చలు జరిపారు.
ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఒకే విడతలో ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న తన సోదరికి తన మద్దతు ఉంటుందని సోనూసూద్ ఇదివరకే ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మాళవిక సూద్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో మాళవిక సూద్ చేరికపై సిద్ధూ స్పందించారు. పంజాబ్ ఎన్నికల వేళ.. ఈ పరిణామం గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. 'పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్లడం చాలా అరుదైన ఘటన. మాళవిక సూద్ అందుకు అర్హురాలు ' అని సిద్ధూ వ్యాఖ్యానించారు.
'క్రికెట్ ప్రపంచంలో గేమ్ చేంజర్ అనే పదం తరుచుగా వాడతారు. అది పంజాబ్ పాలిటిక్స్ కు సెట్ అవుతుంది. మాళవికా సూద్ చాలా యంగ్. బాగా చదువుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్. భవిష్యత్తులో ముందుకు సాగడానికి ఆమెకు ఇవన్నీ తోడ్పడతాయి" అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు.
కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సోనూ సూద్‌ను పంజాబ్ ఐకాన్ గా తొలగించడం తెలిసిందే. సోనూ సూద్ సోదరి రాజకీయాల్లోకి వస్తుండడంతో ఎస్ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను గతంలో సోనూ సూద్ కు అప్పగించింది. పంజాబ్ ఐకాన్‌గా నియమించింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. సోనూ సూద్ కూడా తాను పంజాబ్ ఐకాన్ గా ఉండలేనని ఇటీవల తెలిపారు.
The future of Punjab is ready! #SonuSoodWithCongress pic.twitter.com/qxyJ2yCXeT
— Punjab Youth Congress (@IYCPunjab) January 10, 2022
తన సోదరి మాళవిక.. రాజకీయాల్లో చేరనున్నారని, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని గతేడాది నవంబర్ లో సోనూసూద్ ప్రకటించారు. తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హర్భజన్ ను నవజ్యోత్ సింగ్ సిద్ధూ కలిసిన విషయం తెలిసిందే.