రుతుపవనాలు ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో ఇక విస్తారంగా వర్షాలు, అంతర్వేదిలో రాకాసి అలలు
హైదరాబాద్/అమరావతి: దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవుల్లో సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే ఒకటి రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, మొత్త అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనుకూల పరిస్తితులు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు, విదర్భ, మధ్య కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి .9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్రత-దక్షిణ ద్రోణ విస్తరించింది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వాతావరణం చల్లబడుతోంది.

కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అస్సాంలో బీభత్సం
లక్షద్వీప్, ఉత్తర తమిళనాడు తీరం వెంట సైక్లోనిక్ సర్కులేషన్ కారణంగా కేరళ, కర్ణాటక తీర ప్రాంతాలు, దక్షిణ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే అస్సాంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ప్రభావంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేకమంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. భారీ వర్షాలతో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లు కోతలకు గురయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక బృందాలు సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సహాయం అందించాలని ప్రభుత్వం యంత్రాంగాన్ని ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాల రాకతో ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, సాధారణంగా జూన్ 1 వరకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి మాత్రం మే 27న కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది.
అంతర్వేదిలో రాకసి అలలు.. ఇళ్లల్లోకి సముద్రపు నీరు
ఇది ఇలావుండగా, కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం అటుపోట్లకు గురై భారీ అలలతో విరుచుకుపడుతోంది. తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుండటం, మరోవైపు పౌర్ణమి కావడంతో అంతర్వేది దీరం వద్ద సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం కిలో మీటర్ మేర ముందుకు రావడం, రాకాసి అలలు విరుచుకుపడటంతో సముద్రపు నీరు రోడ్లపైకి, ఇళ్లల్లోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.