తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు: ఏపీలోనూ అదే పరిస్థితి
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల కదలికలతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తాయని.. దీంతో రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ మినహా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమలోని ఒకటి రెండు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడకకడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాయలసీమలోని శ్రీబాలాజీ తిరుపతి జిల్లాలోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బయటకి వెళ్లేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వాహణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కిందికి వెళ్లకూడదని సూచించారు.
రుతుపవనాల ప్రభావంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అస్సాంలో వర్షం, వరదల కారణంగా వందమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.