నైరుతి రుతుపవనాలు: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు, పలు చోట్ల అతి భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా దాదాపు ప్రతి రోజూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరికొన్ని రోజులపాటు వరుసగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో నైరుతి గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురు, శుక్ర, శనివారాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.

కోస్తాంధ్రలోని ఒకటి రెండు చోట్ల రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇక తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు బలంగా వీస్తున్నాయి. కింది స్థాయి నుంచి తెలంగాణ వైపు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.