ఎస్పీ బాలు గాత్రం అజరామరం అన్న చంద్రబాబు .. మిస్ అవుతున్నానంటూ రజనీకాంత్ .. మమతా బెనర్జీ కూడా ..
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి సినీ ప్రపంచాన్ని , అలాగే యావత్ దేశాన్ని ఆవేదనకు గురి చేస్తుంది . గాన గంధర్వుడు , సంగీత ప్రపంచంలో రారాజు , బాల చంద్రుడు అని పేరు పొందిన ఎస్పీ బాలు మృతి ఎవరూ జీర్ణించుకోలేని విషాదం . ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు. సూపర్ స్టార్ రజనీకాంత్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాలు మృతిపై తమ స్పందన తెలియజేశారు .
ఎస్పీ బాలుకి ప్రముఖుల నివాళి .. ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పాటు తెలుగురాష్ట్రాల సీఎంలు

వేడుకున్నా దేవుడు కరుణించలేదని చంద్రబాబు ఆవేదన
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం కోట్లాది హృదయాల వేడుకున్నా దేవుడు కరుణించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో ఓ అద్భుత సినీ శకం ముగిసిందని పేర్కొన్నారు.తన గానంతో ప్రజల గుండెల్లో బాలు అజరామరంగా ఉంటారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు .ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం భారత చలన చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కళాకారులకు యావత్ సంగీత ప్రపంచానికి తీరనిలోటని అభివర్ణించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వచ్చి మళ్ళీ తన పాటలతో పరవశింపజేస్తారని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన మృతి వార్త అశనిపాతంగా మారిందని ఆవేదనవ్యక్తం చేశారు చంద్రబాబు.

బహుముఖ ప్రజ్ఞా శాలిగా అందరి హృదయాలపై ఆయనది చెరగని ముద్ర
గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా ,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల మనసులో పై చెరగని ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డును సాధించి తెలుగు జాతి ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి చేశారని చంద్రబాబు కొనియాడారు .పద్మశ్రీ, పద్మభూషణ్ తో పాటు ఆయన సాధించిన అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు బాలసుబ్రమణ్యం ప్రతిభకు కొలమానం అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా జన్మభూమి పథకం సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలతో పార్టీ కార్యకర్తలలో నూతనోత్తేజం వచ్చిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
మీ జ్ఞాపకాలు, మీ స్వరం నాతో ఎప్పటికీ ఉంటాయి: రజనీకాంత్
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికీ రజనీకాంత్ కు గాత్రం ఇచ్చేది బాల సుబ్రహ్మణ్యం కావటంతో ఆయన మృతి పట్ల రజనీ కాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు . బాలు సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు. గత కొన్నేళ్లుగా బాలు మీరే నా స్వరం అయ్యారు. మీ జ్ఞాపకాలు, మీ స్వరం నాతో ఎప్పటికీ ఉంటాయి. నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ రజనీకాంత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఆవేదనకు గురయ్యా ... ఆయన అద్భుతమైన గొంతు తరాలు ఉంటుంది : మమతా బెనర్జీ
లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరని తెలిసి ఆవేదనకు గురయ్యాను అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆయన అద్భుతమైన గొంతు తరాలపాటు నిలిచిపోతుందన్నారు .ఆయన కుటుంబ సభ్యులు ,అభిమానులకు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కు అభిమానులు ఉన్నారు. వారంతా ఇప్పుడు ఆయన మృతితో తీవ్ర ఆవేదనలో ఉన్నారు . తీరని శోకంలో ఉన్నారు.