ఎస్పీ ఆరోపణలు: వారణాసి ఏడీఎంతోపాటు ఇద్దరు అధికారులను తొలగించిన ఈసీ
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారని ఆరోపించిన క్రమంలో వారణాసి అడిషన్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(ఏడీఎం)ను ఈవీఎంల రవాణాలో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై సస్పెండ్ చేశారు. ఈవీఎం రవాణాలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఏడీఎం నళినీ కాంత్ సింగ్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించినట్లు వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు.
కౌంటింగ్ స్పాట్‌కు వెళ్లకుండా కూడా ఆమెపై నిషేధించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఆర్థిక, రెవెన్యూ) సంజయ్ కుమార్‌ను ఈవీఎంల నోడల్ అధికారిగా నియమించారు" అని డీఎం శర్మ చెప్పారు. మరో ఇద్దరు అధికారులు--సోన్‌భద్ర జిల్లాలో రిటర్నింగ్ అధికారి (RO), బరేలీ జిల్లాలో అదనపు ఎన్నికల అధికారిని కూడా ఎన్నికల విధుల నుంచి తొలగించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులను మార్చారు. కాగా, బహేరీ ప్రాంతంలోని స్థానిక మున్సిపాలిటీకి చెందిన చెత్త సేకరణ డబ్బాలో బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల వస్తువులు కనిపించడంతో అదనపు ఎన్నికల అధికారి వీకే సింగ్‌ను బరేలీలో ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించారు.
సోన్‌భద్ర జిల్లాలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఘోరావాల్ వాహనంలోని పెట్టెలో బ్యాలెట్ స్లిప్పులు లభించడంతో రిటర్నింగ్ అధికారి రమేష్ కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు.
నిబంధనలను ఉల్లంఘించినందుకు వారణాసి ADMపై చర్యకు EC ఆదేశాలు
శిక్షణ EVMల రవాణా సమయంలో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై వారణాసి ADMపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘం UP చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (CEO)ని కోరిన కొన్ని గంటల తర్వాత సస్పెన్షన్ జరిగింది.
వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈవీఎంలను రవాణా చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ మంగళవారం ఆరోపిస్తూ... ఈసీని పరిశీలించాలని కోరారు. ఈవీఎంలను ఈ విధంగా రవాణా చేస్తుంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇది దొంగతనం. మన ఓట్లను మనం కాపాడుకోవాలి. దానికి వ్యతిరేకంగా మనం కోర్టుకు వెళ్లవచ్చు కానీ అంతకు ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను అని అఖిలేష్ వ్యాఖ్యానించారు.
ఈవీఎంలను ట్రక్కుల్లో రవాణా చేస్తున్నట్లు మంగళవారం సోషల్ మీడియాలో వీడియోలు వెలువడిన తర్వాత యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఎస్పీ చీఫ్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఇతర వాహనాల్లో తరలించిన ఈవీఎంలు శిక్షణ కోసం తెచ్చిన ఈవీఎంలని, అవి పోలింగ్ కోసం వినియోగించినవి కావని స్పష్టం చేసింది.
మంగళవారం అర్థరాత్రి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో యూపీ సీఈవో కార్యాలయం స్పందిస్తూ... "'వాహనాన్ని ఆపి ఎన్నికలలో ఈ ఈవీఎంలను ఉపయోగించారని ఆరోపించడం ద్వారా కొన్ని రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు పుకారు పుట్టించారు' అని పేర్కొంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ఎస్పీ నేతలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే ఎస్పీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.