కరోనా వ్యాక్సినేషన్- కేంద్రానికి షాకిచ్చిన రాష్టాలు- టార్గెట్‌కు ఆమడదూరంలో- ఎందుకంటే ?
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా కేంద్రం అందుబాటులోకి తెచ్చిన టీకాను రాష్ట్రాలు క్షేత్రస్దాయిలో హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు ముందుగా అందిస్తున్నాయి. అయితే రెండు రోజుల వ్యాక్సినేషన్ డ్రైవ్ తర్వాత అందుతున్న ఫలితాలు కేంద్రానికి షాకిచ్చేలా ఉన్నాయి. పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్రం విధించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయినట్లు తేలింది. దీంతో టీకాల పంపిణీ కార్యక్రమంలో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా టీకాల పంపిణీలో ఇబ్బందులకు కొన్ని కారణాలను కేంద్రం గుర్తించింది.

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ నెల 16న ప్రారంభమైంది. ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సింది మాత్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే. అయితే కేంద్రం సూచనల మేరకు డ్రైవ్ ప్రారంభించిన రాష్ట్రాలకు వ్యాక్సినేషన్లో కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ అంటే ఇప్పటివరకూ ఇస్తున్న పల్స్ పోలియో తరహాలోనే ప్రశాంతంగా సాగిపోతుందని భావించిన రాష్ట్రాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ లక్ష్యాలకు దూరంగా ఉండిపోతున్నట్లు ఈ రెండు రోజుల గణాంకాలు చెబుతున్నాయి.

టార్గెట్ అందుకోవడంలో రాష్ట్రాలు విఫలం
ఈ రెండు రోజుల్లో మొత్తం 2.24 లక్షల మందికి టీకా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. వీరిలో 447 మందికి మాత్రం టీకా ప్రతికూల ప్రభావం చూపినట్లు తేల్చింది. తమిళనాడులో ఈ రెండు రోజుల్లో 30 వేల డోసులు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 6156 డోసులు మాత్రమే ఇవ్వగలిగారు. ఆరోగ్యశాఖ వేచి చూసే ధోరణే ఇందుకు కారణం. కేవలం కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఏపీలోనూ 32 వేల డోసులు ఇవ్వాల్సి ఉండగా.. రెండురోజుల్లో కేవలం 13వేలు మాత్రమే ఇచ్చారు. ఏపీలో సాంకేతిక ఇబ్బందులతో వ్యాక్సినేషన్ ఆలస్యమవుతోంది. కేరళలో 70 శాతానికి పైగా మాత్రమే డోసులు ఇవ్వగలిగారు. మహారాష్ట్రలో అయితే సాంకేతిక ఇబ్బందులతో సోమవారం వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపేశారు. తెలంగాణలోనూ కొందరు హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్ధాన్‌లోనూ నిర్ణీత లక్ష్యాల మేరకు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాలేదు.

టీకాపై వేచి చూసే ధోరణిలో రాష్ట్రాలు, జనం
కేంద్రం పంపిన కరోనా టీకాను హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పంపిణీ చేసే విషయంలో రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ రెండు రోజుల్లో టీకా ఇచ్చిన వారిపై అది ఎలా పనిచేస్తుందో చూసి, ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మరింత మందికి ఇవ్వొచ్చని పలు రాష్ట్రాల్లో ఆరోగ్యశాఖలు భావిస్తున్నాయి. ఈ విషయం నేరుగా బయటకి చెప్పకపోయినా త్వరలోనే మీకు వ్యాక్సిన్ ఇస్తామంటూ ఆరోగ్యసిబ్బందికి ఉన్నతాధికారులు చెప్పడాన్ని బట్టి ఈ విషయం స్ఫష్టమవుతోంది. అలాగే జనం కూడా ఇప్పటికే టీకా వేసిన వారిపై ప్రభావం చూశాకే తాము కూడా టీకా తీసుకుంటామని చెప్తున్నారు. దీంతో రాష్ట్రాలు టీకా టార్గెట్లను అందుకోలేకపోతున్నాయి.

వ్యాక్సినేషన్లో సాంకేతిక సమస్యలు
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా కేంద్రం ప్రారంభించిన కోవిన్ యాప్‌తో పాటు సర్వర్లలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలు చోట్ల టీకా కార్యక్రమంపై ప్రభావం పడుతోంది. కోవిన్ యాప్‌లో పేర్ల నమోదు చేసుకోకుండా టీకా తీసుకోవడం సాధ్యం కాదు. కానీ కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకునేందుకు సర్వర్లు సహకరించడం లేదు. దీంతో సాంకేతిక సమస్యల ప్రభావం కూడా వ్యాక్సినేషన్‌పై కనిపిస్తోంది. అలాగే దేశంలో పలు రాష్ట్రాల్లో భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ కంటే సీరం ఇన్స్టిట్యూట్ పంపిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులే అందుబాటులోకి వచ్చాయి. వీటిపైనా జనంలో ఉన్న అపోహలు కూడా వ్యాక్సినేషన్‌పై ప్రభావం చూపుతున్నాయి.