ఆకాశానంటిన ఉల్లి ధరలు.. ఇబ్బందుల్లో పడిన సర్కార్.. ఏం చేయబోతుందంటే
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఉల్లి ధరలు కూడా ఘాటెక్కుతూ నషాలాన్ని తాకుతున్నాయి. కొనకముందే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఉల్లి లేనిదే ఏ కూరకైనా రుచి ఉండదు. ఇప్పుడు అలాంటి ఉల్లి సామాన్యుడికి అందని ద్రాక్షాలా తయారైంది.

అధిక వర్షాలే కారణమా..?
ఉల్లిపాయ ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఉల్లి ధరలు దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ.70 నుంచి రూ.80గా ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.60కి పైగానే పలుకుతోంది. ఇక ఉల్లి ధరలు అంతలా పెరగడం వెనక కారణం అధిక వర్షాలు కురవడమే అని నిపుణులు చెబుతున్నారు. అధిక వర్షాలు కురవడంతో పంటకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.

వివిధ నగరాల్లో ఉల్లి ధరల వివరాలు
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలో రీటెయిల్లో ఉల్లిపాయల ధర కిలో రూ.57 గా ఉండగా, ముంబైలో రూ.56గా ఉంది. కోల్‌కతాలో రూ. 48 ఉండగా... చెన్నైలో రూ. 34గా ఉంది. ఇక గుర్గావ్, జమ్మూల్లో అయితే కిలో రూ. 60గా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన రీటెయిల్ ధరలు ఇలా ఉంటే... వాణిజ్యపరమైన సమాచారం ప్రకారం కిలో ఉల్లి ధర రూ.70 నుంచి రూ.80 మధ్య ఉంది. సప్లైని పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఉల్లి ధర మాత్రం పెరుగుకుంటూనే పోతోంది.

స్టాక్‌లపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం..?
ఉల్లి పంటను అధికంగా పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున పంట దెబ్బతినింది. ఇక అప్పటికే చేతికొచ్చిన పంటను రవాణా చేయాలంటే వర్షం అడ్డంకిగా మారుతోంది. దీంతో సప్లై తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో పరిస్థితి చక్కబడకపోతే ఉల్లి వ్యాపారులు నిర్వహిస్తున్న ఉల్లి స్టాక్‌లపై కేంద్రం ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉల్లి రవాణాకు అడ్డంకిగా మారిన వర్షం
ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ఇస్తున్న నివేదిక ప్రకారం ఉల్లి అధికంగా పండించే మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో అధిక వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం ఇప్పటికే నిల్వలో ఉన్న ఉల్లిపాయలను అమ్మడం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.గతేడాది చేతికి వచ్చిన ఉల్లి ఇంకా నిల్వలోనే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.అయితే వాటిని రవాణా చేయాలంటే వర్షం అడ్డంకిగా మారుతోందని చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉల్లిపాయలను ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడం కుదరడం లేదని చెబుతున్నారు.

ఏజెన్సీల ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తున్న కేంద్రం
ఆసియా ఖండంలో మహారాష్ట్రలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఉంది. ఇక ఉల్లి ధరలు పెరగకుండా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. కేంద్రమే నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లాంటి ఏజెన్సీల ద్వారా కిలో ఉల్లిని రూ. 22కు కొనుగోలు చేస్తోంది. సెంట్రల్ బఫర్ స్టాక్‌ను ఎత్తివేస్తూ తమ రాష్ట్రాల్లో సరఫరాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర కోరింది. ఢిల్లీ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటివరకు ఆసక్తి చూపించాయి. కేంద్రం వద్ద 56వేల టన్నుల ఉల్లిపాయలు బఫర్‌స్టాక్ కింద ఉంది. అయితే ఇందులో 16వేల టన్నుల ఇప్పటి వరకు మార్కెట్లకు తరలించింది. ఢిల్లీలో రోజుకు 200 టన్నుల ఉల్లిపాయలను కేంద్రం మార్కెట్లకు తరలిస్తోంది.