India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టెల్తింగ్: సెక్స్‌లో కండోమ్‌ను భాగస్వామికి తెలియకుండా తీసేయడంపై కాలిఫోర్నియా నిషేధం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కండోమ్ తీయడంపై నిషేధం

దాదాపు 30 ఏళ్ల క్రితం మాక్సీన్ డూగన్ వేశ్యావృత్తిలోకి దిగిన నెలకే గర్భం ధరించారు.

అలాస్కాలోని రేవు దగ్గర ఒక మసాజ్ పార్లర్‌లో ఆమె కొత్త వ్యక్తిని కలిశారు. సెక్స్ సమయంలో అతడు రహస్యంగా తన కండోమ్‌ తీసేశాడని తెలుసుకుని ఆమె షాక్ అయ్యారు. వెంటనే బాత్రూంలోకి పరిగెత్తారు. మాక్సీన్ తిరిగొచ్చేసరికే ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

డూగన్ అప్పుడు 20ల మధ్యలో ఉన్నారు. దగ్గర్లో ఉన్న ఒక ఆస్పత్రికి వెళ్లిన ఆమె తనకు లైంగిక వ్యాధులు ఏవైనా సంక్రమించాయేమో తెలుసుకోడానికి పరీక్షలు చేయించుకున్నారు. అన్నిటిలో నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కానీ, డూగన్ ఆరు వారాల తర్వాత గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది. దానికి ఆమెకు దాదాపు 300 డాలర్లు ఖర్చయ్యాయి.

ఆ తర్వాత ఆమె ఒక నెలపాటు పనిలోకి వెళ్లలేకపోయారు. ఆమె పట్ల క్లైంట్ తప్పు చేసాడు. కానీ, ఆమెకు తెలిసినంతవరకూ అలా చేయడం నేరం కాదు. అలా జరిగినప్పుడు "సాయం అందించడానికి అక్కడ ఏదీ లేదు" అని ఆమె చెప్పారు.

కానీ, ఇప్పుడు అమెరికాలోని ఒక రాష్ట్రంలో ఇలాంటి బాధితులకు సాయం చేసేలా చట్టం వచ్చింది.

కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ గత గురువారం (అక్టోబర్ 7న) ఒక బైపార్టిసాన్‌ బిల్లుపై సంతకాలు చేశారు. స్టెల్తింగ్... అంటే ఏకాభిప్రాయం లేకుండా రహస్యంగా కండోమ్ తీసేయడాన్ని నిషేధించే బిల్లును ఆమోదించారు.

రాష్ట్రంలోని సెక్సువల్ బాటరీ అనే చట్టానికి ఈ కొత్త చట్టాన్ని జోడిస్తారు. దీంతో ఇప్పుడు సంభోగం మధ్యలో సమ్మతి లేకుండా కండోమ్ తీసేయడం చట్టవిరుద్ధంగా చేసిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియా అయ్యింది.

దశాబ్దాల క్రితం ఇదే పరిస్థితి ఎదుర్కుని ప్రస్తుతం శాన్‌ఫ్రానిస్కోలో ఉంటున్న డూగన్ లాంటి వారికి ఈ చట్టం కచ్చితంగాన్యాయ పరిహారం అందిస్తుంది.

డూగన్‌కే కాకుండా ఇలాంటి పరిస్థితే ఎదుర్కున్న మిగతా బాధితుల విషయంలో కూడా ఇది ఒక గణనీయమైన మార్పును తీసుకొస్తుందని లాయర్లు చెబుతున్నారు.

"ఇది అనైతికమే కాదు, చట్టవిరుద్ధం అని కూడా మేం చెప్పాలనుకుంటున్నాం" అని ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన కాలిఫోర్నియా అసెంబ్లీ మెంబర్ క్రిస్టినా గార్సియా అన్నారు.

గార్సియా గత కొన్నేళ్లుగా ఈ చట్టంలో ఒక వెర్షన్ మీద పనిచేశారు. 2017, 2018లో ఆమె స్టెల్తింగ్‌ను నేరంగా పరిగణించే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. నేరస్థులకు జైలు శిక్ష పడేలా చూడాలని వాదించారు. కానీ ఈ బిల్లుకు అప్పుడు సభలో ఆమోదం లభించలేదు.

సివిల్ కోడ్‌ను మాత్రమే సవరించేలా ఉండే ఈ కొత్త వెర్షన్ బిల్లును కాలిఫోర్నియా సభ ఎలాంటి వ్యతిరేకతా లేకుండా ఆమోదించింది. దీనికి గురైనవారు నష్ట పరిహారం కోసం నేరస్థులపై కేసు వేయవచ్చు, కానీ వారిపై ఎలాంటి నేరారోపణా చేయలేరు.

"ఇది పీనల్ కోడ్‌లో ఉండాలని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. సమ్మతిని ఉల్లంఘించినప్పుడు అది అత్యాచారం లేదా లైంగిక దాడి చేసినట్లు కాదా?" అని గార్సియా ప్రశ్నించారు.

క్రిమినల్ కోడ్‌లో స్పష్టంగా పేర్కొనకపోయినా స్టెల్తింగ్‌ను రాష్ట్ర సెక్సువల్ బాటరీలో ఒక నేరంగా పరిగణిస్తారని చట్ట నిపుణులు చెప్పారు.

కానీ పౌరులు వేసిన కేసుల్లో ఏదైనా అస్పష్టత ఉంటే గార్సియా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం దానిని తొలగిస్తుంది. మిగిలిన బాధితులు తమ కేసులను ముందుకు తీసుకెళ్లడం ఈ చట్టంతో సులభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

"అన్ని అంశాల్లాగే దీనిపై కూడా మనం ఇక చర్చించుకోవచ్చు" అంటున్నారు గార్సియా.

2017లో అలెగ్జాండ్రియా బ్రాడ్‌స్కీ అనే లా విద్యార్థి రీసెర్చ్ పేపర్ చదివిన తర్వాతే స్టెల్తింగ్ అంశాన్ని చట్టంగా మార్చాలనే ఒక ప్రేరణ లభించిందని గార్సియా చెప్పారు. బ్రాడ్‌స్కీ ప్రస్తుతం పౌర హక్కుల లాయర్‌గా పనిచేస్తున్నారు.

లైంగిక దాడులకు గురైతే న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలను తన 'సెక్సువల్ జస్టిస్' అనే పేపర్‌లో బ్రాడ్‌స్కీ వివరించారు.

సమ్మతితో చేసిన సెక్స్, లేదా లైంగిక బంధాల సమయంలో స్టెల్తింగ్‌కు గురైన ఎంతోమంది చెప్పిన వివరాలను ఆమె తన పేపర్‌లో ప్రస్తావించారు.

"ఇది అత్యాచారం అని నాకు తెలీదు..." అంటూ తరచూ వారి వాదన ఒకేలా మొదలయ్యేదని ఆమె అందులో ఆమె రాశారు.

తమకు లైంగిక వ్యాధులు సంక్రమిస్తాయని, గర్భం వస్తుందేమోనని వాళ్లందరూ భయపడ్డారు. మోసపోయినట్లు అనిపించిందని బాధపడ్డారు.

కానీ బ్రాడ్‌స్కీతో మాట్లాడిన వారిలో చాలా మంది తాము గతంలో అత్యాచారానికి గురయ్యామని, స్టెల్తింగ్‌ను అత్యాచారంతో సమానంగా చెప్పలేమని అన్నారు.

"జనం దానిని ఇంకా అత్యాచారంగా భావించడం లేదు. అలా తమకు మాత్రమే జరిగిందని వాళ్లలో చాలామంది అనుకోవడమే ఈ సమస్యకు ఒక ముఖ్యమైన కారణం అని నాకు అనిపిస్తోంది" అంటారు బ్రాడ్‌స్కీ.

కానీ, స్టెల్తింగ్‌ అనేది సర్వ సాధారణంగా జరుగుతున్నట్లు కాలిఫోర్నియా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ అధ్యయనంలో తేలింది.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్ 2019లో ఒక పేపర్ ప్రచురించింది. 21- 30 ఏళ్ల మధ్యలో ఉన్న 12 శాతం మంది మహిళలకు స్టెల్తింగ్ అనుభవం ఎదురైనట్లు 2019లో చెప్పారు.

పురుషులతో సెక్స్‌లో పాల్గొనే ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక మహిళ, ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒక పురుషుడు దీనికి గురవుతున్నారని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా గుర్తించారు.

దాదాపు 10 శాతం పురుషులు సంభోగ సమయంలో సమ్మతి లేకుండానే కండోమ్ తీసేస్తున్నట్లు 2019లో జరిగిన మరో అధ్యయనంలో తేలింది.

బ్రాడ్‌స్కీ తన పేపరులో ఒక ప్రముఖ స్టెల్తింగ్ బ్లాగర్‌ గురించి కూడా చెప్పారు. సెక్స్ సమయంలో అవతలివారికి తెలీకుండా కండోమ్‌ను రహస్యంగా ఎలా తీసేయవచ్చో ప్రస్తుతం పనిచేయని ఒక వెబ్ సైట్‌లో ఆయన మిగతా పురుషులకు సలహాలు ఇచ్చారు.

"కాళ్లను విప్పార్చడం మహిళ విధి, తన వీర్యం వదలడం మగాడి హక్కు" అని ఆ బ్లాగ్‌లో ఒకరు కామెంట్ కూడా చేశారు.

ఇప్పుడు స్టెల్తింగ్ మీద అవగాహన పెరిగింది. కానీ, దానికి స్పందించడానికి చట్టసభలు వెనకాడుతున్నాయి.

స్టెల్తింగ్‌ను లైంగిక దాడిగా పరిగణిస్తున్న బ్రిటన్, న్యూజీలాండ్, జర్మనీ లాంటి దేశాల్లో కూడా, దాని వెనుక ఉద్దేశాన్ని నిరూపించడంలో సమస్యలు ఎదురవడంతో అలాంటి కేసులు అరుదుగా విచారణ వరకూ వస్తున్నాయి.

సివిల్ కేసుల్లో ఉండే ప్రయోజనం అదే. ఈ కేసుల్లో రుజువులు చూపాల్సిన భారం క్రిమినల్ కేసుల కంటే తక్కువగా ఉంటుంది. ఈ కేసులు కొనసాగించాలా వద్దా అనేది కూడా బాధితుల మీదే ఉంటుంది.

స్టెల్తింగ్‌ చట్టవిరుద్ధం అని అధికారికంగా చెప్పడం ద్వారా అంతర్గత ప్రయోజనం కలుగుతుందని బ్రాడ్‌స్కీ, గార్సియా ఇద్దరూ అంటున్నారు.

"వాళ్లు అలా ప్రవర్తించడం సరికాదు. అది న్యాయపరమైన పరిష్కారానికి తగినదే.. అని కాలిఫోర్నియా నిర్ణయం తీసుకున్న సమయంలో బాధితులకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి" అంటారు బ్రాడ్‌స్కీ.

డూగాన్ స్థాపించిన లా సంస్థ ఎరోటిక్ సర్వీస్ ప్రొవైడర్స్ లీగల్ ఎడుకేషనల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్(ఈఎస్‌పీఎల్ఈఆర్‌పీ) ఈ బిల్లుకు మద్దతిచ్చింది.

సంభోగం సమయంలో కండోమ్ తొలగించిన క్లయింట్లపై సెక్స్ వర్కర్లు కేసులు పెట్టడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో సాధారణంగా అట్టడుగున ఉన్న సెక్స్ వర్కర్లు, మిగతా వారికి చట్టపరంగా మరింత రక్షణ అందించడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది.

"ఇది (స్టెల్తింగ్) ఎవరికైనా జరగవచ్చు" అంటారు గార్సియా డూగాన్.

లైంగిక వేధింపుల కేసుల విచారణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ కేసులు పెట్టేవారు తరచూ పరీక్షలు, సందేహాలు ఎదుర్కుంటారు.

ఇక స్టెల్తింగ్ విషయానికి వస్తే దీనిపై స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే నిర్వచనం ప్రకారం వారు సెక్స్‌కు సిద్ధమైన తర్వాత ఈ ముప్పు ఎదురవుతుంది.

కానీ, ఇది చట్టం కావడం, ముఖ్యంగా న్యూయార్క్, విస్కాన్సిన్‌లో ఇటీవల ఇలాంటి చట్టం తెచ్చే ప్రయత్నాలు విఫలమైన తరుణంలో కాలిఫోర్నియాలో స్టెల్తింగ్‌ను చట్టవిరుద్ధంగా భావించడం ఒక ముఖ్యమైన మొదటి అడుగుగా భావిస్తున్నారు.

"దేశంలో కాలిఫోర్నియా మొదట దీన్ని తీసుకొచ్చినందుకు గర్వంగా ఉంది. కానీ దీనిని మీరు వెంటనే అనుసరించగలరా అని నేను మిగతా రాష్ట్రాల శాసనసభ్యులను సవాలు చేస్తున్నా. ఒకటి అయ్యింది. ఇంకా 49 ఉన్నాయి అంటారు" గార్సియా.

గ్రాఫిక్స్- ఏంజెలికా కాసస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Stelthing: California bans unintentional removal of condom during sex
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X