
భారత్ లో కరోనా విలయతాండవం: వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించిన రాష్ట్రాలివే!!
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యక్తి నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలను తీసుకుంటున్నాయి. కోవిడ్-19 కేసుల పెరుగుదల భారతదేశం అంతటా అధికారులను వారాంతపు లాక్డౌన్ మరియు రాత్రి కర్ఫ్యూలను విధించేలా ప్రేరేపించింది. తద్వారా సామూహిక సమావేశాలు, సూపర్ స్ప్రెడర్ గా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగే సమయంలో ప్రజల కదలికలను పరిమితం చేసింది. 224 రోజుల తర్వాత మళ్లీ భారత్‌లో రెండు లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 27 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నాలుగు వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వారాంతపు కర్ఫ్యూ లను విధించాయి. కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించి కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ .. ఆంక్షలు ఇవే
ఢిల్లీ ఇప్పటికే వారాంతపు లాక్డౌన్ విధించింది. కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి 10 నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ విధించేలా చేసింది. ఢిల్లీ నగరంలో వారాంతపు కర్ఫ్యూ విధించిన క్రమంలో వారాంతపు కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం గా పని చేస్తారు.
ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. బస్సులు స్టాప్‌లు మరియు స్టేషన్లలో రద్దీని నివారించడానికి బస్సులు మరియు మెట్రోలలో సీటింగ్ క్యాప్ 100 శాతానికి పెంచబడుతుంది. అయితే మాస్కులు లేకుండా ప్రవేశం ఉండదు.

తమిళనాడులో నైట్ కర్ఫ్యూ .. ఆదివారం లాక్ డౌన్
పెరుగుతున్న కోవిడ్-19 కేసులకు వ్యతిరేకంగా పోరాడటానికి తమిళనాడు ప్రభుత్వం గత బుధవారం రాత్రి కర్ఫ్యూలను ప్రకటించింది. ఆదివారం కూడా లాక్ డౌన్ అమలు చేసింది. రాత్రి కర్ఫ్యూ సమయం రాత్రి 10 నుండి ఉదయం 5 వరకు విధించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం, ఆదివారాలు మొత్తం లాక్డౌన్ విధించబడుతుంది.
అంతేకాకుండా, శుక్రవారం నుండి ఆదివారం వరకు ప్రజలను ప్రార్థనా స్థలాలలోకి అనుమతించరు. ప్రజా రవాణా 50 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తుంది. ఆదివారం లాక్డౌన్ కారణంగా, జనవరి 9న జరగాల్సిన సామూహిక కొవిడ్-19 టీకా శిబిరం జనవరి 8 శనివారానికి మార్చి నిర్వహించారు.

కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూ ,.. కఠిన ఆంక్షలు ఇవే
కర్ణాటకలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాల పాటు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం ప్రకటించారు. రాత్రిపూట కర్ఫ్యూ పొడిగించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నారు.
రాష్ట్ర సెక్రటేరియట్ అండర్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువ స్థాయి అధికారులతో 50 శాతం మందితో నడుస్తుంది. వారాంతపు కర్ఫ్యూ సమయంలో, ప్రజా రవాణా (బెంగళూరు మెట్రోతో సహా) నిర్దిష్ట సంస్థ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. జనవరి 6 నుండి, బెంగళూరు అర్బన్ జిల్లాలో 10, 11 మరియు మరియు 12 తరగతులు మినహా అన్ని పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడ్డాయి.
మెడికల్, పారామెడికల్ కాలేజీలు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్లు, బార్లు మొదలైనవి 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నిర్వహించబడతాయి. కోవిడ్ 19 నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటేనే అనుమతిస్తారు.
పూర్తిగా టీకాలు వేసిన వారిని మాత్రమే ప్రాంగణంలోకి అనుమతిస్తారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, ఆడిటోరియంలు మొదలైనవి 50 శాతం సీటింగ్ కెపాసిటీతో పనిచేస్తాయి కానీ పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు.

మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ .. కఠిన ఆంక్షలు
మహారాష్ట్రలో కరోనా కేసులు పంజా విసురుతున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ వీకెండ్ లాక్ డౌన్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సినిమా హాళ్లు, థియేటర్లు, కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లు మొదలైన మూసివున్న స్థలాల విషయంలో 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడుతుందని, అయితే బహిరంగ ప్రదేశాలు 25 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సామాజిక దూరం మరియు మాస్క్‌లు ధరించడం వంటి కోవిడ్ -తగిన ప్రవర్తనను ప్రజలు అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది.

పంజాబ్ లో నైట్ కర్ఫ్యూ .. ఆంక్షలు ఇవే
పంజాబ్ ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో పాఠశాలలు మరియు కళాశాలలను మూసివేయాలని ఆదేశించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరగడంతో ప్రజల కదలికలను నియంత్రించడానికి రాత్రిపూట కర్ఫ్యూ విధించబడింది. కొత్త ఆంక్షలను ప్రకటించిన పంజాబ్ ఆరోగ్య మంత్రి OP సోనీ, మూడవ వేవ్ వచ్చిందని మరియు ప్రతి ఒక్కరికీ ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి అని అన్నారు.
ఆర్డర్ ప్రకారం, పంజాబ్‌లోని అన్ని నగరాలు మరియు పట్టణాల మునిసిపల్ పరిమితుల్లో రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించబడింది. అంతేకాదు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కోచింగ్ సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థలు మూసివేయబడతాయని పేర్కొంది.
బార్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, స్పాలు, మ్యూజియంలు మరియు జంతుప్రదర్శనశాలలు తమ కెపాసిటీలో 50 శాతంతో పనిచేసేందుకు అనుమతించబడతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

హర్యానా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ
ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో హర్యానా రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించింది. హర్యానా రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఎంటర్టైన్మెంట్ పార్కులను మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మరియు స్విమ్మింగ్ పూల్స్ ప్మూ కూడా మూసివేయబడ్డాయి. అయితే పోటీలకు శిక్షణ పొందే క్రీడాకారులు ఈ సేవలను పొందవచ్చు. కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేయాలని సూచించింది.