• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో వారసురాళ్లొస్తున్నారు: రాజకీయ కుటుంబాల్లో కూతుళ్లు, కోడళ్లకు పెరుగుతున్న ప్రోత్సాహం...

By BBC News తెలుగు
|

కోలగట్ల శ్రావణి

తెలుగు నాట రాజకీయాల్లో మహిళలకు తగిన అవకాశం రావడం లేదనే వాదన ఉంది. చట్ట సభలకు ఎన్నికవుతున్న వారిలో మహిళల సంఖ్యను దానికి ఉదాహరణగా చెబుతుంటారు.

స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దాంతో సగం వాటా దక్కుతోంది. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో కూడా సగం సీట్లు మహిళలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో సాధారణ పదవుల్లో మహిళల వాటా పెరుగుతోంది.

అయితే అసెంబ్లీ, పార్లమెంట్ వరకూ వచ్చేసరికి ఆశించిన స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం కనిపించడం లేదు. అయితే, ఇటీవల పరిస్థితి మారుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు రాజకీయ నేతలు వారసురాళ్లను ప్రోత్సహించడం ఎక్కువైంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే యువతుల సంఖ్య పెరుగుతోంది.

మహిళా ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పమే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది సభ్యులకు గానూ మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 14 మాత్రమే. అంటే మహిళల ప్రాతినిధ్యం 10 శాతం లోపుగా ఉంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 14 మంది మహిళల్లో 13 మంది వైసీపీ తరుపున విజయం సాధించారు. టీడీపీ ఎమ్మెల్యేగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీ గెలిచారు.

ఇక ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో నలుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్సీలున్నారు. ఇటీవల మండలిలో ఏర్పడిన ఖాళీ స్థానానికి జరిగిన పోటీలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఏకగ్రీవంగా గెలిచారు. దాంతో ఆ సంఖ్య అయిదుకు చేరింది.

ఏమైనా, మొత్తం 58 మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో మహిళలు 10 శాతం లోపే ఉన్నట్లు భావించవచ్చు.

ఇక రాష్ట్రం నుంచి 2019 ఎన్నికల్లో 25 లోక్ సభ స్థానాల్లో నాలుగు చోట్ల మహిళలు గెలిచారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం నియోజకవర్గాల నుంచి వైసీపీ తరుపున ఈ నలుగురు గెలిచారు.

అయితే రాజ్యసభ సభ్యుల్లో రాష్ట్రం నుంచి ఒక్క మహిళ కూడా లేరు.

మహిళలకు చట్ట సభల్లో తగిన స్థానం కల్పించేందుకు పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదనడానికి ఈ పరిస్థితి నిదర్శనమని మహిళా శక్తి సంస్థ ప్రతినిధి బోళ్ల సత్యవతి బీబీసీతో అన్నారు.

పూసపాటి సంచయిత

గెలిచిన వారిలో వారసురాళ్లే ఎక్కువ

ఏపీ నుంచి శాసనసభ, మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న 19 మంది మహిళా నేతల్లో అత్యధికులు రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. పుట్టినింటి లేదా మెట్టినింటి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని విజయం సాధించారు.

రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాల నుంచి వచ్చి విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేలు కూడా కొందరు ఉన్నారు.

అవకాశాలు ఇస్తే ఎవరైనా విజయాలు సాధించగలరనే విషయం అనేక మార్లు రుజువయ్యిందని సీనియర్ రాజకీయ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు.''రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగాలి. ముఖ్యంగా చట్ట సభల్లో తగిన అవకాశాలు రావాలి. 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకి దాదాపు అన్ని పార్టీలు అంగీకరిస్తున్నట్టు చెప్పడమే తప్ప మూడు దశాబ్దాలుగా మోక్షం లేదు. పార్టీలు గెలుపు గుర్రాల పేరుతో ఎక్కువ మంది పురుషులకే ఛాన్స్‌లు ఇస్తుంటాయి. మహిళలకు కూడా తగిన మోతాదులో సీట్లు కేటాయించాలి. అప్పుడే మహిళా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ప్రస్తుతం యువతులు చాలా మంది ఉత్సాహంగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. గతంలో ఉన్న పలు ఆటంకాలు వారికి తొలిగాయి. అయినా చేదోడు అందిస్తేనే రాజకీయ వ్యవహారాల్లో వారు రాణించడానికి ఆస్కారం ఉంటుంది’’ అని రాజకుమారి బీబీసీతో అన్నారు.

'ఉత్తరాంధ్రలో వారసురాళ్ల పాత్ర పెరుగుతోంది’

దాదాపుగా అన్ని పార్టీలూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారికి పెద్ద పీట వేస్తున్నాయి. వారి వారసులకు ఎక్కువగా అవకాశాలు కల్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి.

అయితే వారసురాళ్ల పాత్ర మాత్రం ఈ మధ్యే బాగా పెరుగుతోంది. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు తమ వారసురాళ్లను తెరమీదకు తెచ్చారు. కొడుకులు లేని వారు కొందరయితే, కూతుర్ల ఆసక్తి గమనించి వారిని ప్రోత్సహించే నేతలు కూడా ఇంకొందరు ఉన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ వారసురాళ్ల పాత్ర ఇంకా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మొన్నటి సాధారణ ఎన్నికల్లో అలాంటి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చి బరిలో దిగిన కొందరు మహిళా నేతలు ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో మరోసారి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఏపీ అసెంబ్లీకి అత్యధిక మార్లు ఎన్నికయిన ఎమ్మెల్యేలలో ఒకరైన గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె శిరీష మొన్నటి ఎన్నికల్లో టెక్కలి స్థానంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా కూడా ఉన్న ఆమె క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

మరో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా వారి కుటుంబాల రాజకీయ నేపథ్యం తోడ్పడిందనే చెప్పవచ్చు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తో పాటుగా పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి కూడా గడిచిన పదేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు.

కళావతి వరుసగా రెండు సార్లు అసెంబ్లీ స్థానానికి ఎన్నికవ్వగా, రెడ్డి శాంతి మాత్రం 2014లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగి విజయం దక్కించుకున్నారు. విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి కూడా తన వారసురాలిగా కూతురు శ్రావణిని తెరమీదకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె విజయనగరంలో అధికార పార్టీ కార్యకలాపాలతో పాటుగా వివిధ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇప్పటికే విజయనగరం సంస్థానాధీశుల వారసురాలు సంచయిత గజపతి రాజు కూడా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్ పర్సన్ హోదాలో రాజకీయంగా నిత్యం వార్తల్లో ఉంటున్నారు.

ఇక అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు గత ఎన్నికల్లోనే పోటీ చేయాలని ఆసక్తి చూపినట్లు కథనాలు వచ్చాయి. కానీ ఆమె పోటీకి దూరంగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి ఈ వారసురాళ్ల పోటీతో విజయనగరం జిల్లా కేంద్ర రాజకీయాలు ఆసక్తిగా మారే అవకాశం ఉంది.

జిల్లాలో ఇప్పటికే మెట్టినింటి రాజకీయాలతో అసెంబ్లీ బరిలో దిగి వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన పాముల పుష్ప శ్రీ వాణి ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.విశాఖలో కూడా మాజీ ఎమ్మెల్యే జి దేముడు కుమార్తె మాధవి ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్నారు. పాడేరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కే భాగ్యలక్ష్మికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది.

ఏపీ సీఎం జగన్‌తో మోపిదేవి వెంకట రమణ, ఆయన కుమార్తె

కృష్ణా, గోదావరి తీరాల్లో...

ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రస్తుతం ఇద్దరు మహిళా ఎంపీలు, ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలున్నారు. వారిలో కొవ్వూరు నుంచి రెండోసారి గెలిచిన తానేటి వనిత ఏపీ క్యాబినెట్ లో ఉన్నారు. తండ్రి రాజకీయ వారసురాలిగా ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు.

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తండ్రి , సోదరుడితో పాటుగా కుటుంబమంతా శ్రీకాకుళం రాజకీయాల్లో కీలకమైన కింజరాపు కుటుంబీకులు. అయితే ఆమె మాత్రం మెట్టినింట మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వారసురాలిగా బరిలో దిగి విజయం సాధించారు.

రంపచోడవరం ఎమ్మెల్యే ఎన్ ధనలక్ష్మి మాత్రం ఉపాధ్యయ వృత్తిని వీడి రాజకీయాల్లోకి వచ్చి ఎస్టీ రిజర్వుడు సీటులో గెలిచారు.కృష్ణా జిల్లాలో రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలలో రాజకీయ వారసురాళ్లు అవకాశాలు కోసం చూస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ జిల్లా నుంచి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో మహిళలు ఎవరూ లేరు.

గుంటూరు నుంచి ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో హోం మంత్రి మేకతోటి సుచరిత సీనియర్ నేత. మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, జగన్ క్యాబినెట్‌లో ఆమె అవకాశం దక్కించుకున్నారు. మండల స్థాయి రాజకీయ నేతగా ప్రస్థానం ప్రారంభించి మంత్రి హోదా వరకూ ఎదిగారు.

అమెరికా నుంచి వచ్చి రాజకీయ ఎంట్రీ ఇచ్చిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, వైద్యురాలిగా ప్రస్థానం ప్రారంభించి తాడికొండ ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి మాత్రం రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండానే ముందుకు సాగుతున్నారు.మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ తన వారసురాలిగా కుమార్తెను రంగంలో తీసుకొచ్చారు. ఇటీవల నేరుగా సీఎం జగన్ దగ్గరకి కుమార్తె కలిసి వెళ్లిన మోపిదేవి వచ్చే ఎన్నికల నాటికి రేపల్లెలో కుమార్తెను రంగంలో దింపాలని యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఏపీ రాజకీయాల్లో ఎంపీటీసీ స్థాయి నుంచి మత్స్యకార కుటుంబం నుంచి తొలి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టే స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానంలో ఇప్పుడు వారసురాలి పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశం అవుతోంది.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నామమాత్రమే

ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో మహిళా నేతలకు అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల నుంచి ఒక్కరు కూడా మహిళలు చట్ట సభల్లో లేరు.

చీరాలకు చెందిన పోతుల సునీత రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె మరోసారి మండలి బరిలో ఉన్నారు. ఈసారి వైసీపీ తరుపున పోటీ చేస్తున్న ఆమెకు ఎమ్మెల్సీ హోదా దాదాపు ఖాయమని చెబుతున్నారు.ఇతర నేతలు కూడా వారసులనే తప్ప వారసురాళ్లకు పెద్దగా ప్రాధాన్యతనిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

రాయలసీమలో ఎక్కువ...

రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నలుగురు మహిళా ఎమ్మెల్యేలున్నారు. మరో ఇద్దరు మహిళా ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.

వీరంతా దాదాపుగా రాజకీయ కుటుంబాల నుంచే వచ్చిన వారు కావడం విశేషం. మరోవైపు కొత్తగా వారసురాళ్లను ప్రోత్సహించే పనిలో పలువురు సీమ నేతలు కనిపిస్తున్నారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రా రెడ్డి కాళహస్తి రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. తండ్రి బాటలో రాజకీయ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు.

కర్నూలు జిల్లా నంధ్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో భూమా అఖిలప్రియ తల్లి,తండ్రి వారసత్వం అందిపుచ్చుకుని మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల పలు వివాదాల్లో ఆమె పేరు నానుతున్న తరుణంలో ఆమె సోదరి భూమా మౌనికా రెడ్డి తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే సమయంలో ఒకనాటి భూమా అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జాహ్నవి కూడా రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మరో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ఇటీవల బీజేపీ రాజకీయాల్లో జోరుగా పాల్గొంటున్నారు. పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఆమె తండ్రి రాజకీయ వారసత్వంతో ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి కొత్త నేతలు?

ప్రస్తుతం పలువురు సీనియర్ నేతల నుంచి సాధారణ నేతల వరకూ తమ కుటుంబాల నుంచి మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పలువురు మహిళలకు పోటీ చేసే అవకాశం దక్కవచ్చనే అంచనాలున్నాయి.

ఇప్పటికే ముందుకొచ్చిన నేతలతో పాటుగా సామాజిక సమీకరణాలతో మరికొందరి పేర్లు కూడా తెరమీదకు వచ్చే అవకాశాలు ఉంటాయని మహిళా సంఘం నాయకురాలు ఎస్ రమాదేవి అంటున్నారు.

''రాజకీయాల్లో మహిళల పాత్ర పెరుగుతోంది. అనివార్యంగా రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితిని తీసుకొస్తోంది. అయితే కొన్ని ఆటంకాలున్నాయి. కుటుంబీకులు ప్రోత్సహిస్తే మరింత మెరుగ్గా యువతులు రాణిస్తారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ మహిళా నేతలను వేధించే పని జరుగుతోంది. ఇలాంటివి అడ్డుకుంటే రాజకీయ కుటుంబాలతో పాటుగా నవతరం కూడా ముందుకొస్తారు. వచ్చే ఎన్నికల నాటికి మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందనే ఆశాభావం అందరిలో ఉంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Growing encouragement for daughters and sons in political families in AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X