ముందడుగు: బ్యాంకాక్‌లో భారత్-పాక్ రహస్య భేటీ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా మళ్లీ చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. ఇరు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు (ఎన్ఎస్ఏ) ఆదివారం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సమావేశమయ్యారు.
భారత జాతీయ వ్యవహారాల సలహాదారు అజీత్ దోవల్, పాకిస్తాన్ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు నసీర్‌ఖాన్ జంజువా బ్యాంకాక్‌లో రహస్య చర్చలు జరిపారు. నాలుగు గంటలపాటు జరిగిన చర్చల్లో పలు కీలకాంశాలపై దృష్టి కేంద్రీకరించటంతోపాటు, ఈ ప్రక్రియను ఇకమీదట కూడా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ సమావేశానికి భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్, పాక్ ఎన్ఎస్ఏ నాసిర్ ఖాన్ జంజువా, విదేశాంగ కార్యదర్శి అహ్మద్ చౌధురీలు మంతనాల్లో పాల్గొన్నారు. చర్చలను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించినట్టు తెలుస్తోంది.
రెండు దేశాల జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుల సమావేశం భారత్, పాకిస్తాన్ దేశాల్లోకాకుండా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరగటం గమనార్హం. భారతదేశం లేదా పాకిస్తాన్లో చర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం లేనందున బ్యాంకాక్‌లో చర్చలు జరిగినట్టు అధికారులు తెలిపారు.
ఎన్ఎస్ఏల భేటీ తర్వాత ఇరు దేశాల సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల గ్లోబల్ వార్మింగ్ సదస్సుకు హాజరయ్యేందుకు పారిస్ వెళ్లినప్పుడు అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలుసుకున్న సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలతోపాటు ఉగ్రవాదుల దాడులు, జమ్ముకాశ్మీర్ తదితర సమస్యల గురించి చర్చించారు.

సరిహద్దుల్లో శాంతిని కాపాడటం గురించి కూడా ఇరువురు సలహాదారులు మాట్లాడినట్టు విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది.
సమావేశంలో భారత్ లేవనెత్తిన ప్రధాన అంశాలు:
* జమాత్ ఉద్ దవా చీఫ్, హఫీజ్ సయీద్ అప్పగింత
* 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీర్ రహమాన్ లఖ్వీ అప్పగింత
* 26/11 ముంబై దాడుల విచారణలో పారదర్శకత
* జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అణచివేత
* దావూద్ ఇబ్రహీం అప్పగింత
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!