‘బ్రహ్మోస్ మిషన్’ సతీమణికి అంకితం: సుఖోయ్ పైలట్ మనోగతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ మిషన్‌ను ఓ పైలట్ తన భార్యకు అంకితం చేశారు. నాసిక్ నుంచి వింగ్ కమాండర్ ప్రశాంత్ నాయర్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. 'ఈ మిషన్‌ను నా భార్యకు అంకితం చేస్తున్నా. ఆమె నాకు ఎంతో సంతోషకరమైన భాగస్వామి. నేను ఇంత సాధించడం ఆమె సహకారం వల్లే సాధ్యమైంది. ఈ రోజు నాకు ప్రత్యేకం' అని నాయర్ వెల్లడించారు.
39ఏళ్ల ప్రశాంత్.. క్యాన్సర్ కారణంగా తన భార్య డాక్టర్ రేఖను 2014లో కోల్పోయారు. పెళ్లైన తొమ్మిది సంవత్సరాలకే భార్య అర్ధాంతరంగా మరణించడంతో నాయర్ ఆవేదనకు గురయ్యారు. వీరికి ప్రశాంతి అనే ఏడేళ్ల కూతురు ఉంది.
కాగా, జూన్ 25న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్‌ను బిగించిన ఫ్రంట్‌లైన్ ఫైటర్ సుఖోయ్(ఎస్‌యూ-3ఎంకెఐ) విమానాన్ని విజయవంతంగా నడిపి మిలిటరీ ఏవియేషన్లొ చరిత్ర సృష్టించారు ప్రశాంత్ నాయర్. ఆయనకు వింగ్ కమాండర్ రాజు కో-పైలట్‌గా సహకరించారు. అంతేగాక, ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్‌గా వ్యవహరించారు. కాగా, బెంగళూరులోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రధాన విభాగమైన ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్(ఏఎస్టిఈ)లో వీరిద్దరూ నియమించబడ్డారు.

ఇంట్లో విషాదాన్ని పక్కన పెట్టి మిషన్‌కే ప్రాముఖ్యం
భార్య మరణించినప్పటికీ తన బాధ్యతలను నిర్వర్తించేందుకే ప్రశాంత్ నాయర్ మొగ్గు చూపారని అని కుటుంబ స్నేహితుడు, వ్యాపారవేత్త ఆర్ రాజేష్ కుమార్ తెలిపారు. 'మేము ఆన్లైన్, వార్తా పేపర్లలో చూసే వరకు నాయర్ మిషన్ ఏమిటో మాకు తెలియదు. అతను పైలట్ అని మాత్రమే మాకు తెలుసు. కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకున్నప్పటికీ కుంగుబాటుకు గురికాకుండా తన బాధ్యత పట్ల నిబద్ధతను చాటుకున్నారు. పైలట్లు అంటే ఇలాగే ఉండాలేమో' అని రాజేష్ ప్రశాంత్ గురించి తెలిపారు.
పాఠశాల రోజుల నుంచే ప్రశాంత్ నాయర్‌కు ఐఏఎఫ్ అంటే ఇష్టమని తెలిపారు. అతని ఫ్యామిలీ నుంచి ప్రశాంత్ ఒక్కడే ఎయిర్‌ఫోర్స్ లో చేరారని చెప్పారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం సమీపంలోని డొమ్లూరు వీధుల్లో నాయర్‌తో కలిసి ఫుట్‌బాల్, క్రికెట్ ఆడుకునే వాళ్లమని చెప్పారు. ఆ సమయంలో తన తలపై నుంచి వెళ్తున్న విమానాలను నాయర్ ఆసక్తిగా గమనించేవాడని తెలిపారు. అప్పట్నుంచి విమానానికి అతడు బానిస అయిపోయాడు. 10వ తరగతిలోనే అతడు ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని నిశ్చయించుకున్నాడని చెప్పారు.
నాయర్‌ను సన్మానించేందుకు స్కూల్‌మేట్స్ ప్లాన్
ఈస్ట్‌వుడ్ స్కూల్ నుంచి ప్రశాంత్ 1993లో ఉత్తీర్ణుడిగా బయటికి వచ్చాడు. ఆ సమయంలో అతని స్నేహితుడిగా ఉన్న సి భువనేశ్.. ప్రశాంత్ సాధించిన ఘనతపై ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో ప్రశాంత్ ఎంతో క్రమ శిక్షణతో ఉండేవాడని, అతను ఇప్పుడు సాధించిన ఘనతను చూసి తాము గర్విస్తున్నామని చెప్పారు. స్నేహితులమంతా కలిసి అతడ్ని సన్మానించే కార్యక్రమానికి ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు.

త్రిజు అనే మరో ప్రశాంత్ స్నేహితుడు అతని గురించి మాట్లాడుతూ.. 'నాయర్ ఏది సాధించినా.. అది తన తల్లిదండ్రులు, సోదరుడికే దక్కుతుందని చెప్పేవాడు. అతను పూర్తి కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి' అని తెలిపారు. భారతదేశంలోని ఎంతోమంది యువతకు నాయర్ స్ఫూర్తిగా నిలిచారని మరో స్నేహితుడు, ఫైనాన్షియల్ అనలిస్ట్ సాయిశంకర్ తెలిపారు.
అతడు సాధించిన ఈ ఘనత గర్వించేలా చేసిందని, బెంగళూరులో అతడ్ని కలుసుకునేందుకు తామేంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మధ్యతరగతి నుంచి విజయం వైపు
ప్రశాంత్ తండ్రి నారాయణ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేవారు. ఆయన తల్లి పద్మజ గృహిణి. అతని సోదరుడు న్యాయవాది. కాగా, మొదటి భార్య మరణించడంతో ప్రశాంత్ గత ఏప్రిల్‌లో సునీత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ ఇండియా పీవీటీ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తోంది.

ఐఏఎఫ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. వింగ్ కమాండర్ ప్రశాంత్ గత 17ఏళ్లుగా ఐఏఎఫ్‌లో పని చేస్తున్నారు. సుఖోయ్ కాకుండా మిగ్-21, మిగ్-23లను కూడా నాయర్ నడిపాడు. ఐదేళ్ల క్రితం ఏఎస్టిఈగా నియమితులయ్యారు. కాగా, గత నాలుగేళ్ల నుంచి బ్రహ్మోస్ ప్రాజెక్టు కోసం ఆయన పనిచేస్తున్నారు.
ఈ పైలట్లు గర్వకారణం: బ్రహ్మోస్ సీఈఓ
ఈ పైలట్లు తొలిసారి ఈ విమానాన్ని నడిపేందుకు చాలా శ్రమించారని
బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ ఎస్కే మిశ్రా వన్ఇండియాకు తెలిపారు. 'పని పట్ల ఈ పైలట్ల శ్రద్ధను చూసి చాలా స్ఫూర్తి పొందా. ప్రతీ టీంకు ఈ ఘనతలో భాగస్వామ్యం ఉంది. పైలట్లు ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. విజయం సాధించామని బొటనవేలు చూపుతూ ప్రశాంత్ విమానాన్ని నడిపినప్పుడు చాలా ఆనందం వేసింది. వారు చేసిందేమేటితో మాకు తెలుసు. పైలట్లు మాకు గర్వకారణం' అని మిశ్రా పేర్కొన్నారు.