Super Pink Moon 2020: తేదీ, టైమ్ ఇదే, ఇండియాలో ఈ అద్భుతం ఎలా చూడాలంటే?
న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఆవరణలోనే ఒక ఆసక్తికర అంశాన్ని చూడవచ్చు. అదే సూపర్ పింక్ మూన్(గులాబీ రంగు చంద్రుడు)ను చూసే అవకాశం మనకు వచ్చింది. ఈ ఏప్రిల్ నెలలోనే సంభవించే ఈ అద్భుత దృశ్యాన్ని మీ ఇంటి నుంచే కుటుంబసభ్యులతో వీక్షించవచ్చు.

సూపర్ పింక్ మూన్ అంటే?
సూపర్ మూన్ అంటే భూమికి దగ్గరగా కక్షలోకి వచ్చినప్పుడు కనిపించే అద్భుతమైన చంద్రుడు. ఈ సమయంలో చంద్రుడు చాలా పెద్దగా, ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. భూమికి చంద్రుడుకి సాధారణంగా 384,400 కిలోమీటర్లు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ దూరం 356,907 కిలోమీటర్లకు తగ్గనుంది.

ఇక సూపర్ పింక్ మూన్ అంటే..?
తూర్పు ఉత్తర అమెరికాలో ఫ్లక్స్ సుబులాట(గులాబీ రంగు పూలు) పూస్తాయి. ఈ పూల పేరు మీదుగానే సూపర్ మూన్‌కు సూపర్ పింక్ మూన్ అని పేరు వచ్చింది. ఈ పూల రంగులోకి చంద్రుడు వస్తాడు కాబట్టి సూపర్ పింక్ మూన్ అని పిలవడం జరుగుతుంది. అంతేగాక, మొలకెత్తిన గడ్డి చంద్రుడు, గుడ్డు చంద్రుడు, ఫిష్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇవన్ని ఈ ప్రాంతం, భూమిపై ఉన్న కాలానికి సంబంధించిన సూచనలు.

సూపర్ పింక్ మూన్: తేదీ, సమయాలు..
ఏప్రిల్‌లోనే వచ్చే ఈ సూపర్ పింక్ మూన్‌ను భూమిపైన ఉన్న ప్రజలు వారి వారి టైమ్ జోన్లను బట్టి వేర్వేరు సమయాల్లో చూసే అవకాశం ఉంది. తూర్పు హరిజోన్ వారికి ఈ చంద్రుడు బాగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక భారతదేశంలో అయితే మంగళవారం రాత్రి నుంచి (ఈ ఏప్రిల్ 8) బుధవారం ఉదయం 8.05 గంటల వరకు సూపర్ పింక్ మూన్‌ను చూడవచ్చు. ఎంతో కాంతివంతంగా, పెద్దగా కనిపించి ఆహ్లాదపరుస్తాడు.

సూపర్ పింక్ మూన్‌ను భారతదేశంలో ఎలా చూడాలి?
అంతరిక్ష ఔత్సాహికులు వివిధ ఆన్లైన్ ఛానళ్లలో ఈ ఖగోళ సంఘటనలను చూడవచ్చు. వాటిలో కొన్ని స్లోష్, వర్చువల్ టెలిస్కోప్ కూడా ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా కాలుష్యం కూడా భారీస్థాయిలో తగ్గడంతో చంద్రుడిని స్పష్టంగా చూసే అవకాశం లభించినట్లయింది. కాగా, చివరిసారిగా మార్చి 9, 2020లో సూపర్ వోర్మ్ మూన్ దర్శనమిచ్చాడు.