రజినీకాంత్ భేటీ ఆరంభం: తీవ్ర ఉత్కంఠత: బీజేపీకి వ్యతిరేకంగా ఫ్యాన్స్ నినాదాలు: ఏం చెబుతారు?
చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ హుటహుటిన పార్టీ నేతలు, పదాధికారులు, జిల్లా కార్యదర్శులతో భేటీ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన రాజకీయ భవిష్యత్ గురించి చర్చించడానికి రజినీకాంత్ ఈ సమవేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే రజినీ మక్కళ్ మండ్రమ్ పేరుతో పార్టీని నెలకొల్పిన ఆయన.. ఇక క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారనే వార్తలు తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.

ఇంకొన్ని గంటల్లో క్లియర్..
చెన్నై కోడంబాక్కంలోని శక్తినగర్లో ఉన్న రాఘవేంద్ర కల్యాణ మండపం ఈ సమావేశానికి వేదికగా మారింది. రజినీ మక్కళ్ మండ్రమ్ పార్టీకి చెందిన అన్ని జిల్లాల కార్యదర్శులు, అభిమానా సంఘాల ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం తన రాజకీయ రంగ ప్రవేశంపై రజినీకాంత్ విస్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అది ఎలాంటిదనేది ఆసక్తి రేపుతోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమా? లేక.. విరమించుకోవడమా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
సన్యాసమా?..రంగ ప్రవేశమా?: తేలేది రేపే: రజినీకాంత్ కీలక భేటీ: బీజేపీ వైపేనా?

అభిమానుల కోలాహలం..
ఈ సమావేశాన్ని పురస్కరించుకుని.. రాఘవేంద్ర కల్యాణ మండపం వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడే గుమికూడారు. వివిధ జిల్లాల నుంచి రజినీకాంత్ అభిమానులు ఈ తెల్లవారు జాము నుంచే చెన్నైకి చేరుకోవడం కనిపించింది. వారంతా రజినీకాంత్ ఫొటోలను ముద్రించిన టీ షర్టులను ధరించారు. ప్లకార్డులను తమ వెంట తెచ్చుకున్నారు. రాఘవేంద్ర కల్యాణ మండపానికి దారి తీసే మార్గం పొడవునా రజినీకాంత్కు మద్దతుగా అభిమానులు బ్యానర్లు కట్టారు. పోస్టర్లను అంటించారు.

బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు..
తన నివాసం నుంచి బయలుదేరిన రజినీకాంత్.. రాఘవేంద్ర కల్యాణ మండపం వద్దకు చేరుకున్న వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు జైకొట్టారు. పూలు చల్లుతూ స్వాగతం పలికారు. వారికి అభివాదం చేసిన అనంతరం రజినీకాంత్.. కల్యాణ మండపంలోకి ప్రవేశించే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వినిపించింది. దీనితో ఆయన వారిని వారించారు. అయినప్పటికీ.. బీజేపీకి వ్యతిరేక నినాదాలను కొనసాగించారు అభిమానులు. మీడియా ప్రతినిధులు భారీ ఎత్తున కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం మొత్తం కోలాహలంతో నిండిపోయింది.

రజినీకాంత్ సొంతంగా పార్టీ పెడతారనే ఆశిస్తున్నాం..
తాము దైవంగా భావించే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తాము ఎప్పటి నుంచో కోరుకుంటున్నామని అభిమానులు.. స్థానిక మీడియాతో చెప్పారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇక ఏ మాత్రం జాప్యం చేయొద్దని సూచిస్తున్నారు. రజినీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీని పెడితే.. తాము ఆయనకే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. మరే ఇతర రాజకీయ పార్టీకి రజినీ మద్దతు ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆయన మద్దతు ప్రకటించిన పార్టీ వెంట నడవడానికి తాము సిద్ధంగా లేమని కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో తాను సూచించిన పార్టీకి ఓటు వేయమని అడగడం కంటే సొంతంగా పార్టీని పెట్టడమే ఉత్తమం అని వ్యాఖ్యానిస్తున్నారు.