వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని రకాల కరోనావైరస్‌లపై పనిచేసే 'సూపర్ వ్యాక్సీన్'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్

సార్స్‌, మెర్స్‌, సార్స్‌-కొవ్‌-2.. ఇలా రకరకాల రూపాల్లో మానవాళిపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌లన్నింటిపైనా పనిచేసే 'యూనివర్సల్‌ టీకా'ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది.

దాని ప్రకారం.. యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరొలినా వర్సిటీ శాస్త్రజ్ఞులు ఈ టీకా తయారీకి శ్రీకారం చుట్టారు.

సూపర్‌ వ్యాక్సీన్‌ తయారీకోసం శాస్త్రజ్ఞులు సరికొత్త పరిజ్ఞానమైన ఎంఆర్‌ఎన్‌ఏ విధానాన్నే ఆశ్రయించారు. అంటే.. ఫైజర్‌, మోడెర్నా టీకాల తయారీకి వాడిన టెక్నాలజీ. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో ఉండే సింథటిక్‌ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏలు.. టీకాలు వేయించుకున్నవారి శరీరాల్లోకి వెళ్లి, కరోనా స్పైక్‌ ప్రొటీన్‌ను వారి శరీర కణాలే తయారుచేసేలా ప్రేరేపిస్తాయి.

అయితే.. ఆ టీకాల తయారీలో కొవిడ్‌-19ను కట్టడి చేసే జన్యుకోడ్‌ను మాత్రమే చొప్పించారు. వాటికి భిన్నంగా సూపర్‌ టీకా కోసం... శాస్త్రజ్ఞులు రకరకాల కరోనా వైర్‌సలకు సంబంధించిన జన్యుకోడ్‌ను మెసెంజెర్‌ ఆర్‌ఎన్‌ఏల్లోకి చొప్పించారు.

అలా అభివృద్ధి చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను ఎలుకలకు ఇవ్వగా రకరకాల వైరస్‌లకు సంబంధించిన స్పైక్‌ ప్రొటీన్లను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు వాటిలో ఉత్పత్తి అయ్యాయి.

దక్షిణాఫ్రికా వేరియంట్‌పై సైతం ఈ సూపర్‌వ్యాక్సిన్‌ బాగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు.

వచ్చే ఏడాది హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ (మానవులపై ప్రయోగాలు) చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు.

విద్యార్థులు

ఫస్టియర్‌ మార్కులే.. సెకండియర్‌లో

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఫస్టియర్‌లో పొందిన మార్కులనే సెకండియర్‌లోనూ కేటాయించనున్నట్టు ప్రకటించినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం రాసింది.

ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం విధివిధానాలను ఖరారుచేశారు. వీటి ప్రకారం ఫలితాలు ప్రకటించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శిని ఆదేశిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. ప్రీ డిటర్‌మైన్డ్‌ ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా శుక్రవారం లేదా శనివారం ఫలితాలను విడుదలచేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.

2020లో ఫస్టియర్‌లో (జనరల్‌, వొకేషనల్‌, బ్రిడ్జి) విద్యార్థులు పొందిన మార్కులనే సెకండియర్‌లో కేటాయిస్తారు. ఉదాహరణకు.. ఫస్టియర్‌ జీవశాస్త్రంలో 48 మార్కులు పొందితే.. సెకండియర్‌ జీవశాస్త్రంలోనూ 48 మార్కులనే కేటాయిస్తారు.

ఫస్టియర్‌లో ఫెయిల్‌అయి పరీక్షఫీజు చెల్లించిన సెకండియర్‌ విద్యార్థులను 35% మార్కులతో పాస్‌చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 15న ఉత్తర్వులిచ్చారు. తాజాఉత్తర్వుల నేపథ్యంలో సెకండియర్‌లోనూ వీరిని 35% మార్కులతో పాస్‌ చేస్తారు.

రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్‌ జరగనందున ఆయా విద్యార్థులకు 100% మార్కులు ఇవ్వనున్నారు.

ప్రైవేట్‌ విద్యార్థులతోపాటు గతంలో ఫెయిలైనవారికి సబ్జెక్ట్‌లవారీగా 35 శాతం మార్కులు ఇస్తారు. ఫస్టియర్‌లో ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ల్లో ఫెయిలైనవారికి 35% మార్కులిస్తారు. వీటిపై సంతృప్తిచెందకుంటే పరిస్థితులు కుదుటపడ్డాక పరీక్షలను నిర్వహిస్తారు.

ఏపీ పోలీసులు

వారిక మహిళా పోలీసులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇక నుంచి 'మహిళా పోలీసులు'గా వ్యవహరించాలని నిర్ణయించిందని సాక్షి పత్రిక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై పోలీస్‌ శాఖలో అంతర్భాగమని ప్రకటిస్తూ వారికి 'కానిస్టేబుల్‌' హోదా కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టులకు గాను ప్రస్తుతం 14,313 మంది ఉన్నారు. త్వరలోనే వీరికి రెండేళ్ల ప్రొబెషన్‌ సర్వీసు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. 'మహిళా పోలీస్‌'గా పేర్కొంటూ కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు ప్రకటించడంతోవీరికి మరింత ప్రయోజనం కలగనుంది. మహిళా పోలీసులకు సంబంధించిన విధివిధానాలపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుళ్లు వినియోగిస్తున్న యూనిఫాంను వీరికి కూడా ఇస్తారు.

వివిధ చట్టాల ప్రకారం కానిస్టేబుళ్లకు ఉన్న అధికారాలు, బాధ్యతలు కూడా మహిళా పోలీసులకు కల్పిస్తారు.

మహిళా పోలీసులు తమ గ్రామ, వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు.

వీరికి పదోన్నతి కోసం అదనపు హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను సృష్టిస్తారు.

మహిళా పోలీసులుగా తగిన అధికారాలు, విధుల కల్పనకు చట్టంలో అవసరమైన మార్పులు చేస్తారు.

డబ్బు

జ్యోతిష్యుడి ఇంట్లో రూ.17 కోట్ల నకిలీ నోట్లు

తన ఇంట్లో 30 లక్షల విలువైన రంగు రాళ్లు చోరీకి గురయ్యాయంటూ ఫిర్యాదు చేసిన హైదరాబాద్ జ్యోతిషుడి ఇంట్లో నకిలీ నోట్లు బయటపడ్డాయని ఈనాడు ఒక కథనం రాసింది.

ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. అతడు పిల్లలు ఆడుకునే రూ.2వేల నకిలీ నోట్లను అసలు నోట్లుగా చూపించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అతనితో పాటు అతడి ఇంట్లో చోరీకి పాల్పడిన మరో ఆరుగుర్ని అరెస్ట్ చేశారు.

17.72 కోట్ల విలువైన రూ.2వేల నకిలీ నోట్లు, 6.32 లక్షల అసలు నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ క్రైమ్స్ డీసీపీ యాదగిరి, ఎల్బీనగర్ ఏసీపీ పి శ్రీధర్ రెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బెల్లం కొండ మురళీకృష్ణ శర్మ విజయవాడ సూర్యారావుపేటలో స్థిరపడ్డాడు. జీవనోపాధి కోసం రంగురాళ్లు అమ్మేవాడు.

భక్తినిధి పేరిట ఓ వెబ్‌సైట్ ప్రారంభించి ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించాడు. పలు టీవీ ఛానళ్లలో జ్యోతిషం, రంగురాళ్లపై షోలు నిర్వహించేవాడు.

గతేడాది విశాఖ సీబీఐ అధికారులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్‌పై విడుదలైన మురళీకృష్ణ తన మకాంను హైదరాబాద్‌కు మార్చాడు.

జ్యోతిషం కోసం వచ్చేవారికి తన వద్ద సూట్‌కేసుల్లో ఉన్న నకిలీ నోట్లను చూపించి అవి అసలువేనని నమ్మించేవాడు. తనకు మరికొంత డబ్బు అవసరం ఉందని చేబదుళ్లు తీసుకునేవాడు.

మురళీకృష్ణ దగ్గర ఉన్న డబ్బును తస్కరించాలని అతడి బంధువు నాగేంద్రప్రసాద్ శర్మ, వేల్పూరి పవన్ కుమార్ శర్మ పథకం రచించారు. మరో ఇద్దరి సహకారంతో ఈ నెల 15న సూట్‌కేసులను తస్కరించారు.

కానీ అందులో 16 నోట్ల తప్ప మిగిలినవన్నీ నకిలీవని గుర్తించారు. పోలీసులకు భయపడి వాటిని కాల్చేశారు.

తన ఇంట్లో చోరీ జరిగిందని, 30 లక్షల విలువైన రంగురాళ్లు పోయాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా కూపీ లాగితే ఈ వ్యవహారమంతా బయటపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus, Covid 19 news in telugu, super vaccine works for all types of virus,కరోనావైరస్, తెలుగులో కోవిడ్ వార్తలు, డెల్టా ప్లస్ వేరియంట్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X