హిందువులకు మైనార్టీ హోదా ఇవ్వలేం.. దీన్ని దేశ పరిధిలో చూడాలి.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
జనాభా పరంగా ముస్లింలు ఎక్కువగా ఉన్న జమ్ము కశ్మీర్, పంజాబ్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో హిందువులకు మైనార్టీ హోదా కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. బీజేపీ నేత, ప్రముఖ అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ వేశారు. గతంలోనూ ఓసారి ఇదే తరహా పిటిషన్ ను సుప్రీం బెంచ్ తిరస్కరించింది.
మతాలను రాష్ట్రాల పరిధిలో చూడొద్దు
హిందువులకు మైనార్టీ హోదా పిల్ ను కొట్టేస్తూ.. సీజేఐ ఎస్ ఏ బోబ్డే నేతత్వంలోని బెంచ్ కీలక కామెంట్లు చేసింది. ఒక మతానికి చెందినవాళ్ల జనాభాను రాష్ట్రాల డేటా ఆధారంగా చూడొద్దని, మైనార్టీలకు హక్కులు అనేదాన్ని దేశ పరిధిలో విస్తృతంగా పరిశీలించాల్సిన అంశమని బెంచ్ పేర్కొంది. ''మతానికి పొలిటికల్ బోర్డర్ అంటూ ఉండదు. మత పరమైన అంశాల్ని పాన్ ఇండియా పరిధిలోనే చూడాలి తప్ప రాష్ట్రాలవారీగా కాదు. ముస్లింల జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లోనూ అక్కడి జనం హిందూ చట్టాలనే ఫాలో అవుతున్నారని గుర్తుంచుకోవాలి''అని సీజేఐ బోబ్డే అన్నారు.

హిందువుల్ని ఎందుకు గుర్తించరు?
1993లో కేంద్ర సర్కార్ నోటిఫికేషన్ ద్వారా మన దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలను మైనార్టీలుగా గుర్తించారు. 2014లో జైనులను కూడా ఈ జాబితాలో చేర్చారు. అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో హిందువుల జనాభా కేవలం 2.5 శాతంగా ఉంది. అలాగే మిజోరాంలో 2.75 శాతం, నాగాలాండ్ 8.75 శాతం, మేఘాలయ 11.53 శాతం, జమ్మూ కశ్మీర్ 28.44 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 29 శాతం, పంజాబ్ 38.40 శాతంగా హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఈ ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో హిందువులను మైనార్టీలుగా గుర్తించనట్లయితే, 1993 నాటి భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైనదిగా భావించాల్సి ఉంటుందని పిటిషనర్ అశ్వనీ కుమార్ వాదించారు. ఆయన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.