జ్ఞానవాపి మసీదు కేసులో ట్విస్ట్- వారణాసి జిల్లా జడ్జికి అప్పగించిన సుప్రీంకోర్టు..
యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వారణాసి కోర్టుకు సర్వే నివేదిక కూడా అందిన నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు కేసుపై వేగంగా విచారణ జరిగే అవకాశముంది.
వారణాసి కోర్టు జారీ చేసిన జ్ఞాన్వాపి మసీదు సముదాయానికి సంబంధించిన సర్వే ఆర్డర్‌పై సవాల్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. సర్వే నివేదికను ప్రజలకు 'సెలెక్టివ్‌గా లీక్' చేసిందని తెలిపింది. ముస్లిం పక్షాన హాజరైన హుజెఫా అహ్మదీ, లీక్ అయిన సమాచారం విస్తృతంగా షేర్ చేయబడుతోందని, పిటిషనర్ అందించిన సమాచారం కథనాన్ని మార్చిందని వాదించారు. సర్వేకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన సుప్రీంకోర్టుకు వివరాలు అందించారు.

అనంంతరం హిందువుల పక్షాన నియమించిన న్యాయవాది వైద్యనాథన్.. ఈ వాదనలను కొట్టిపారేశారు. ముస్లిం పక్షం చేసిన అభ్యర్థన అసంబద్ధమని అన్నారు. కమిషన్ నివేదికను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే సముచితంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ లీకేజీపై తీవ్ర స్థాయిలో స్పందించిన జస్టిస్ డివై చంద్రచూడ్, కమిషన్ నివేదికను లీక్ చేయరాదని, న్యాయమూర్తి ముందు మాత్రమే సమర్పించాలని అన్నారు.
ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ప్రస్తుతం ఈ కేసు స్ధానిక జిల్లా కోర్టు విచారణలో ఉన్నందున ముందు దాన్ని పూర్తి కానివ్వాలని సూచించింది. దీనిపై తాము ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. తాము రెండు పక్షాల్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ఇది ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వెల్లడించింది. తాము కొన్ని ఏర్పాట్లు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని, మెయింటెనబిలిటీ సమస్యను పరిష్కరించే వరకు ఆ ఆర్డర్ కొనసాగుతుందని తెలిపింది. ఈ వివాదాన్ని జిల్లా జడ్జి విచారించాలనే అభిప్రాయంతో ఉన్నామని సుప్రీం న్యాయమూర్తి తెలిపారు. ఇది న్యాయపరమైన సూక్ష్మభేదం అయినందున సీనియర్ జ్యుడీషియల్ అధికారి నిర్ణయాన్ని తెలుసుకోవాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు.