పెళ్లి చేసుకోమని సుప్రీం కోర్టు చెప్పలేదు... అత్యాచార కేసులో వివాదాస్పద వ్యాఖ్యలపై సీజేఐ వివరణ...
ఇటీవల ఓ అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ చాలామంది సీజేఐ వ్యాఖ్యలను తప్పు పట్టారు. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా అని సీజేఐ బోబ్డే కోర్టులో నిందితుడిని ఆరా తీయడమే ఈ వివాదానికి కారణం. తాజాగా ఈ వివాదంపై బోబ్డే స్వయంగా వివరణ ఇచ్చారు.

సీజేఐ బోబ్డే ఏమన్నారు...
నిజానికి తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని... బాధితురాలిని పెళ్లి చేసుకోమని తాను నిందితుడిని కోరలేదని బోబ్డే అన్నారు. 'బాధితురాలిని పెళ్లి చేసుకోమని మేము నిందితుడిని కోరలేదు... నువ్వు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నావా అని మాత్రమే అడిగాం.' అని చెప్పారు. అంతే,తప్ప నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిందితుడితో తాము చెప్పలేదన్నారు. సుప్రీంకోర్టు మహిళలకు ఎప్పుడూ అత్యున్నత గౌరవం ఇచ్చిందన్నారు.

సెక్షన్ 165 ప్రకారం...
'సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సీజేఐ వ్యాఖ్యలతో ఏకీభవించారు. నిజానికి చీఫ్ జస్టిస్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరుగా ఉందన్నారు. సీజేఐ వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించి సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది బిజూ పేర్కొన్నారు. సెక్షన్ 165 ప్రకారం కేసుకు సంబంధించిన ఆధారాలు రాబట్టేందుకు నిందితుడిని ఎటువంటి ప్రశ్నలైనా అడగవచ్చునని చెప్పారు.సీజేఐ ఆదేశాల మేరకు తుషార్ మెహాతా సెక్షన్ 165లోని అంశాలను కోర్టులో చదివి వినిపించారు.

అసలేంటీ కేసు...
మహారాష్ట్ర విద్యుత్తు శాఖ ఉద్యోగి మోహిత్ సుభాష్ చవాన్ కొన్నేళ్ల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బెయిల్ కోరుతూ అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ సందర్భంగా సీజేఐ బోబ్డే... 'నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మేం మీకు హెల్ప్ చేస్తాం, లేదంటే నువ్వు నీ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. జైలు శిక్ష కూడా పడుతుంది.' అని వ్యాఖ్యానించినట్లుగా కథనాలు వచ్చాయి. అత్యాచారానికి పాల్పడిన ఒక నేరస్తుడిని పట్టుకుని బాధితురాలిని పెళ్లి చేసుకోమని అడగడమేంటని చాలామంది ప్రశ్నించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. సీజేఐ రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. దీంతో సీజేఐ బోబ్డే దీనిపై వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

అబార్షన్ కేసు విచారణ సందర్భంగా...
అత్యాచారానికి గురై గర్భవతి అయిన ఓ మైనర్ బాలిక అబార్షన్ కోసం అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం(మార్చి 8) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్ఏ బోబ్డే ఇటీవలి తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై స్పందించారు. ఈ సందర్భంగా న్యాయవాది బిజూ... సుప్రీం ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను డీల్ చేసేందుకు ఒక యంత్రాంగం ఉండాలని అభిప్రాయపడ్డారు. దానికి సీజేఐ స్పందిస్తూ.. 'మన ప్రతిష్ఠ ఎప్పుడూ బార్ చేతుల్లోనే ఉంటుంది.' అని అభిప్రాయపడ్డారు. ఇక తాజా కేసుకు సంబంధించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడాలనుకుంటున్నట్లు సీజేఐ చెప్పారు. కేసును మార్చి 12కి వాయిదా వేశారు.