వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుప్రీంకోర్టు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై స్టాండప్ కమేడియన్ కుణాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి తెరతీశాయి.

కుణాల్‌పై ''కోర్టు ధిక్కరణ'' చర్యలు తీసుకునేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆమోదం తెలిపారు. దీంతో కోర్టు ధిక్కరణ ప్రక్రియపై చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రక్రియలను ఓ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపణలతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడాన్ని కూడా కోర్టు ధిక్కరణ కిందే పరిగణలోకి తీసుకోవాలని అటార్నీ జనరల్‌ను ఇటీవల ఓ న్యాయవాది కోరారు. అయితే ఆ అభ్యర్థనను అటార్నీ జనరల్ తిరస్కరించారు.

ఇంతకీ కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) అంటే ఏమిటి? దీని కింద ఎప్పుడు చర్యలు తీసుకోవచ్చు? ఎలాంటి శిక్షలు విధిస్తారు?

కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? దీనికి సంబంధించిన చట్టాలు ఏం చెబుతున్నాయి?

తాజా వివాదం ఏమిటి?

2018లో ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఇటీవల అర్ణబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అర్ణబ్‌కు బెయిల్ జారీచేసేందుకు బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అర్ణబ్ అభ్యర్థనపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం ఆయనకు మధ్యంతర బెయిలును మంజూరు చేసింది.

ఈ విషయంలో సుప్రీం కోర్టు న్యాయూర్తులు, న్యాయవాదులను విమర్శిస్తూ బుధవారం సాయంత్రం స్టాండప్ కమేడియన్ కుణాల్ కామ్రా వరుస ట్వీట్లు చేశారు. కొన్ని అభ్యంతర చిత్రాలనూ ఆయన పోస్ట్‌చేశారు.

కుణాల్ కామ్రా ట్వీట్లపై దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ చర్యలుగా పరిగణించాలంటూ కొందరు న్యాయవాదులు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను గోపాల్‌ను కోరారు.

''దేనికైనా హద్దు ఉంటుంది''

కుణాల్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని వేణుగోపాల్ చెప్పారు. ఇవి క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయని వివరించారు.

''ఇవి తీవ్రమైన వ్యాఖ్యలు మాత్రమే కాదు. వినోదం పేరుతో ఆయన హద్దుల్ని మీరారు. ఈ వ్యాఖ్యలు క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తాయని నేను భావిస్తున్నాను''అని వేణుగోపాల్ వివరించారు.

''ఇది సుప్రీం కోర్టు సమగ్రత, స్వతంత్రత, నిస్పక్షపాతాన్ని తప్పపట్టడం. న్యాయమూర్తులకూ ఆరోపణలు ఆపాదించడం. కేవలం ఒక పార్టీ కోసం కోర్టు పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించడం''.

''వాక్ స్వాతంత్ర్యం పేరుతో సుప్రీం కోర్టును, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను ఇష్టమొచ్చినట్లు, నిస్సంకోచంగా విమర్శించొచ్చని నేడు చాలామంది భావిస్తున్నారు. అయితే, వాక్ స్వాతంత్ర్యం అనేది రాజ్యాంగంలోని కోర్టు ధిక్కరణ చర్యలకు లోబడి ఉంటుంది. సుప్రీం కోర్టును నిస్సంకోచంగా విమర్శిస్తే శిక్షలు తప్పవని ప్రజలు నేడు తెలుసుకొనే సమయం వచ్చింది''అని వేణుగోపాల్ తెలిపారు.

కుణాల్‌పై కోర్టు ధిక్కరణ కింద కేసులు మోపేందుకు అనుమతి కోరిన ఎనిమిది మంది న్యాయవాదులకు వేణుగోపాల్ ఆమోదం తెలుపుతూ ఒక లేఖ విడుదల చేశారు.

కోర్టు ధిక్కరణ

ఇంతకీ కోర్టు ధిక్కరణ అంటే?

కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ -1971 ప్రకారం.. కోర్టు ధిక్కరణ రెండు రకాలు. వీటిలో మొదటిది సివిల్ కంటెంప్ట్. రెండోది క్రిమినల్ కంటెంప్ట్.

ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలకు ఉద్దేశపూర్వకంగానే అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం లేదా మాటను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడం కూడా దీని కిందకే వస్తుంది.

రెండోది క్రిమినల్ కంటెంప్ట్. దీనిలో మూడు రకాలున్నాయి. ఈ నిబంధనలను ప్రచురణ రూపంలో లేదా వ్యాఖ్యలు చేయడం, లేదా సంజ్ఞల రూపంలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఆ నింధనలు ఏమిటంటే..

  • ఏదైనా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలా చేయడం లేదా దూషణలకు పాల్పడటం
  • కోర్టు ప్రక్రయల్లో జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నించడం లేదా పక్షపాతం చూపించడం
  • ఏదైనా చర్యల ద్వారా న్యాయ పరిపాలన ప్రక్రియలకు అడ్డు తగలడం

ప్రస్తుతం కుణాల్‌పై క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రక్రియల కింద కేసు నమోదు చేసేందుకు వేణుగోపాల్ ఆమోదం తెలిపారు.

క్రిమినల్ కంటెంప్ట్‌తో పోలిస్తే సివిల్ కేసులు ఎక్కువగా వస్తాయని నల్సార్ లా యూనివర్సిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ చెప్పారు.

''కోర్టు ఆదేశాలను అనుసరించకపోతే.. సివిల్ కంటెంప్ట్ కిందకు వచ్చేస్తుంది. క్రిమినల్ కేసు అవ్వాలంటే.. తీర్పును తప్పుపట్టడం లేదా ప్రతిష్ఠను మసకబార్చేలా వ్యాఖ్యలు లేదా ప్రచురణలు చేయాల్సి ఉంటుంది. అందుకే క్రిమినల్ కంటెంప్ట్‌తో పోలిస్తే.. సివిల్ కేసులు ఎక్కువ''అని ఆయన చెప్పారు.

ప్రశాంత్ భూషణ్

అటార్నీ జనరల్ అనుమతి అవసరమా?

కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లోని సెక్షన్ 1(15) ప్రకారం.. క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. లేదా అటార్నీ జనరల్ లేదా అటార్నీ జనరల్ సమ్మతితో మరెవరైనా కేసులు నమోదు చేయొచ్చు.

''సాధాణంగా సుప్రీం, లేదా హైకోర్టులు తమకు తాముగానే కేసులను పరిగణలోకి తీసుకుంటాయి. అదే సాధారణ పౌరులు లేదా న్యాయవాదుల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కేసు నమోదు చేయాలంటే... సుప్రీం కోర్టు విషయానికి వస్తే అటార్నీ జనరల్ అనుమతి తీసుకోవాలి. అదే హైకోర్టు విషయంలో అడ్వొకేట్ జనరల్ అనుమతి తీసుకోవాలి''అని శ్రీధర్ వివరించారు.

గత ఆగస్టులో సుప్రీం కోర్టుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ నటి స్వరా భాస్కర్‌పై క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చర్యలు తీసుకోనేందుకు అనుమతి ఇవ్వాలంటూ అటార్నీ జనరల్‌ను అంజు సక్సేనా అనే న్యాయవాది కోరారు. అయితే, ఈ అభ్యర్థనను వేణుగోపాల్ తిరస్కరించారు.

శిక్షలు ఏమిటి?

కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా విధించొచ్చు. లేదా కొన్నిసార్లు రెండూ విధిస్తారు.

అయితే, ఒక్కోసారి క్షమాణలు చెప్పడం ద్వారా ఈ శిక్షలను కోర్టులు మాఫీ చేస్తాయి. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ విషయంలో ఇలానే జరిగింది. ఆయన క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో రూ.1 జరిమానాను కోర్టు విధించింది.

''ప్రముఖులపై కూడా ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన దాఖలాలు ఉన్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన పుంజల శివ శంకరే దీనికి ఉదాహరణ. అయితే, ఆయనకు కోర్టు ఎలాంటి శిక్షా విధించలేదు. తాజాగా అయితే, ప్రశాంత్ భూషణ్ కేసునూ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు''అని శ్రీధర్ వివరించారు.

''ప్రశాంత్ భూషన్ తాజాగా చేసిన వ్యాఖ్యల విషయంలో వెంటనే సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. అయితే, 10ఏళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో మరో కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ కేసుల విచారణను ఇన్ని నెలల్లో పూర్తి చేయాలని నిబంధన ఏమీలేదు''అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the punishment given for contempt of court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X