సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్.. డ్రగ్స్ కేసు.. రకుల్, సారా అలీ ఖాన్ పేర్లు చెప్పిన రియా
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు దర్యాప్తు విషాదకరమైన మలుపు తిరిగింది. రియా చక్రవర్తి తొలగించిన వాట్సాప్ చాట్ నుండి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ ఇచ్చినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో విచారణ జరుపుతున్నాయి. రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ , సారా అలీ ఖాన్ వంటి బాలీవుడ్ తారల పేర్లు వినిపిస్తున్నాయి .

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణతో తెరమీదకు కొత్త పేర్లు
రియా ను, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి ని, సుశాంత్ హౌస్ మేనేజర్ దీపేశ్ సావంత్ తో పాటుగా మరికొంత మంది డ్రగ్ పెడలర్స్ అంతా కలిసి సుశాంత్ మరణానికి కారణమయ్యారన్న కోణంలో ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ వ్యవహారంపై వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తాజాగా రియా చెప్పిన అంశాలతో ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. మాదకద్రవ్యాల సంబంధిత కోణంలో తాజా విచారణలో రియా చక్రవర్తి నటి సారా అలీ ఖాన్ మరియు టాలీవుడ్ సెలబ్రిటీ రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ మాజీ మేనేజర్ రోహిణి అయ్యర్ మరియు చిత్రనిర్మాత ముఖేష్ ఛబ్రా ల పేర్లు బయట పెట్టారు.

రియా విచారణలో సుశాంత్ లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర కోణాలు
సైఫ్ అలీ ఖాన్ మరియు అమృత సింగ్ ల కుమార్తె సారా 2018 లో 'కేదార్నాథ్' చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరియు ఇతర స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌కు సారా వెళ్ళినట్లు రియా తన విచారణలో ఎన్‌సిబికి తెలిపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన జీవితాన్ని కింగ్ సైజు లా గడిపేవాడని థాయ్‌లాండ్ ట్రిప్ కోసం 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారని చెప్పింది రియా .

80 శాతం బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పిన రియా
విచారణలో మాదకద్రవ్యాలను వినియోగించే మరియు సేకరించే బాలీవుడ్ ప్రముఖుల పేర్లను కూడా రియా వెల్లడించారని తెలుస్తుంది. ఇప్పుడు 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఈ కేసులో వినిపిస్తున్నాయి. 80 శాతం మంది బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆసక్తికర విషయాలను రియా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక డ్రగ్స్ కేసులో 25మంది ప్రముఖ బాలీవుడ్ తారలను విచారించనున్నట్లుగా సమాచారం. సుశాంత్ సింగ్ రాజపుత్ కోసం డ్రగ్స్ తీసుకోవడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంలో రియా పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ విషయాన్ని రియా కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

బెయిల్ కోసం రియా ప్రయత్నాలు .. తిరస్కరించిన ముంబై కోర్టు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మరియు డ్రగ్స్ ఆరోపణలతో అరెస్టయిన రియా చక్రవర్తి కి ముంబై కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి మరియు ఇతర నిందితుల బెయిల్ అభ్యర్థనను కూడా ముంబై కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 22వ తేదీ వరకు రియా చక్రవర్తి జైలులోనే ఉండనున్నారు. ఇక తాజాగా మరో కొత్త బెయిల్ పిటీషన్ ను దాఖలు చేసి బెయిల్ కోసం రియా ప్రయత్నిస్తుంది.