మూలధనంపై ఫోకస్ లేకుంటే ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం: శక్తికాంతదాస్ వార్నింగ్
ఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక రంగం కుదుపునకు గురైంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ పాలనను మెరుగుపర్చుకోవడంతో పాటు నైపుణ్యతకు పదను పెట్టి తద్వారా మూలధనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇలా చేయడం వల్ల కరోనావైరస్తో చిధ్రమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొని మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. నైపుణ్యతకు పదను పెట్టి మూలధనంను సమకూర్చుకోవడం ఈ సమయంలో చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల రుణ ప్రవాహము పెరగడమే కాకుండా స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు అవుతుందని చెప్పారు.

బ్యాంకులకు శక్తికాంత దాస్ హెచ్చరిక
కోవిడ్-19 ఆయా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్ షీట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోందో విశ్లేషణ చేసి ఒక నివేదిక తయారు చేయాలని ఆర్బీఐ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. లిక్విడిటీ, అస్సెట్ క్వాలిటీ, లాభాలు, 2020-21 మరియు 2021-22 సంవత్సరాలకు మూలధనం వంటి వాటిపై దృష్టి సారించాలని సూచనలు చేసింది. ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ పనిని పూర్తి చేశాయి. ఇక ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ఆర్బీఐ బ్యాంకులకు, ఎన్ఎఫ్బీసీలకు కోరింది. ఇప్పటికే చాలా ప్రైవేట్ బ్యాంకులు మూలధనం పై ఒక అవగాహనకు వచ్చేశాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు మాత్రం ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.

ఆర్బీఐ ఫోకస్ ఎక్కడ?
ప్రస్తుతం వృద్ధిరేటు పెరుగుదల, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, బ్యాంకుల్లో ధన ప్రవాహం ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఆర్బీఐ ఫోకస్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేసిన ప్రస్తుత బ్యాంకుల పనితీరు గణాంకాలు తాత్కాలికమైనప్పటికీ అస్సెట్ క్వాలిటీ మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది. 2019-20వ సంవత్సరానికి గాను మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్థక ఆస్తులు 8.3 శాతం ఉండగా.. అదే నికర నిరర్థక ఆస్తులు 2.2 శాతంగా ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి స్థూల నిరర్థక ఆస్తులు 9.1శాతం ఉండగా...అదే నికర నిరర్థక ఆస్తులు 3.7 శాతంగా ఉన్నాయి.

ఎన్పీఏల పరిస్థితి ఏంటి..?
ఇక నిరర్థక ఆస్తుల నిష్పత్తి కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలో 60.5శాతం ఉండగా అది 2019-20 సంవత్సరానికి 65.4శాతానికి పెరిగింది. ఇక ఎన్బీఎఫ్సీలను పరిశీలించినట్లయితే స్థూల నిరర్థక ఆస్తులు 2019-20లో 6.4శాతం ఉండగా నికర నిరర్థక ఆస్తులు 3.2శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐల్ మరియు ఎఫ్‌ఎస్‌లో స్వల్ప అంతరాయం కారణంగా ఈ సంఖ్యలో క్షీణత కనిపించింది. అయితే త్వరలోనే అంటే 2020-21కల్లా ఈ సంఖ్యలో భారీ మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. దీనికి కారణం తీసుకున్న రుణాలకు ఆరునెలల పాటు మారిటోరియం ఉన్నందున ఈ గణాంకాలు తక్కువగా కనిపిస్తున్నాయని ఇదే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎన్పీఏలు పుంజుకుంటే కథ మరోలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కష్టసమయంలో ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నాం
ఇదిలా ఉంటే కోవిడ్-19 పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ఆర్బీఐ క్రమంగా నియంతృత్వ చర్యలు చేపడుతుందని పరోక్షంగా చెప్పారు. ఇప్పటికే ఆర్బీఐ చాలా అంశాల్లో ఊరట కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని అన్నారు ఆర్బీఐ గవర్నర్. ఈ కష్ట సమయాల్లో ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని అవి సంతృప్తినిచ్చినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. కరోనావైరస్ ప్రభావం దేశంపై పడకముందు ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్ల మేరా రెపోరేట్‌ను తగ్గించి మందగమనం దిశగా పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకొందని గుర్తు చేశారు. ఇక కరోనా వైరస్ దేశంపై ప్రభావం చూపినప్పటి నుంచి 250 బేసిస్ పాయంట్లకు రెపోరేట్‌ను తగ్గించినట్లు చెప్పారు. ప్రస్తుతం రెపో రేట్ 4శాతంగా ఉందని చెప్పారు శక్తికాంత దాస్. కరోనావైరస్ తర్వాత వ్యవస్థలో నగదు ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రూ.9.7 లక్షల కోట్లు నగదును వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇదంతా దేశ జీడీపీలో 4.7శాతం వంతుకు సమానమని గుర్తు చేశారు.