జయ‘అమ్మా’నన్ను క్షమించు: ఎంపీ శశికళ పుష్ప
చెన్నై: అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మళ్లీ అమ్మ జయలలితకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఆగ్రహానికి గురైన శశికళ పుష్ప మీద కేసులు నమోదు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని శశికళ పుష్ప వాట్సాప్ ద్వారా ప్రజలకు మనవి చేశారు. రాజ్యసభలో ఆమె అన్నాడీఎంకే పార్టీ, జయలలితకు విరుద్దంగా బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
తరువాత జయలలిత, ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ కుటుంబ సభ్యుల మీద మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో శశికళ పుష్ప ను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి జయలలిత మీద వీలుచిక్కినప్పుడు మీడియా మీద పలు ఆరోపణలు చేశారు.
అయితే హఠాత్తుగా తమిళనాడులోని అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరకుండ్రం, పుదుచ్చేరిలోని నియోజక వర్గాల్లో ప్రజలు అన్నాడీఎంకే కి ఓటు వేసి గెలిపించాలని శశికళ పుష్ప సోషల్ మీడియాలో ఓటర్లకు మనవి చేశారు.
జయలలితకు కళంకం తీసుకు వచ్చి, ఆమె పదవికి ముప్పు వాటిల్లజేసేందుకు ఓ ముఠా కుట్రపన్నుతుందని, అన్నాడీఎంకే ఎంపీ హోదాలో తాను దానిని అడ్డుకున్నానని శశికళ పుష్ప చెప్పారు. అదే విధంగా ఆమె ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకున్నారు.

రాజ్యంగం ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి సమస్య రాకుండా కాపాడి, ప్రజల మనోభావాలు గౌరవించి స్నేహానికి గౌరవం చేకూర్చిన ప్రధాని నరేంద్ర మోడీకి సర్వదా రుణపడి ఉంటానని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ట్విట్టర్ లో తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్ రావు, సీఎం సలహాదారు షీలా బాలకృష్ణన్, కార్యదర్శి కేఎల్ వెంకట్రామన్ లకు లేఖ రాసిన శశికళ పుష్ప తాను రాసిన లేఖ సారాంశాన్ని ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై అన్నాడీఎంకే సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలు ఇలా చెప్పారు. అన్నాడీఎంకే మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి డీఎంపీ పార్టీ నాయకురాలు కనిమొళి సహాయంతో ఆ పార్టీలో చేరడానికి శశికళ పుష్ప ప్రయత్నించారని అన్నారు.
అయితే డీఎంకే కోశాధికారి స్టాలిన్ శశికళ పుష్పకు అడ్డుకట్ట వేశారని, తరువాత ఢిల్లీలో మకాం వేసిన శశికళ పుష్ప బీజేపీ, కాంగ్రెస్ లో చేరడానికి విఫలయత్నం చేశారని, అది కుదరలేదని అన్నారు.
ఇప్పుడు అన్ని పార్టీలు తలుపులు మూసివేయడంతో ఏమి చెయ్యాలో తెలీక మళ్లీ మా పార్టీలో చేరడానికికి శశికళ పుష్ప ప్రయత్నిస్తున్నారని, అయితే అన్నాడీఎంకే సుప్రీం జయలలిత మాత్రం ఆమెను క్షమించరని ఆ పార్టీ నాయకులు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications