ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక భేటీలు.. అందుకోసమేనా?
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బుధవారం(జూన్ 10) నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. జూన్ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయ్ బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రత్యేక చార్టర్డ్ విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దేశ రాజధానికి రావడం ఇది రెండోసారి.
ఇంతకుముందు మే 27న విజయ్ తన తొలి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి పలు రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించి మరుసటి రోజే చెన్నై తిరిగి వచ్చారు. అయితే ఈ సారి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కూడా విజయ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. గత పర్యటనలో షెడ్యూల్ కుదరకపోవడంతో కలవలేకపోయిన అగ్రనేతలతో ఈ సారి ఆయన కీలక చర్చలు జరపనున్నారు.

ఈ అదనపు భేటీల కారణంగా తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటన మూడు రోజుల పాటు(జూన్ 12 వరకు) పొడిగించబడే అవకాశం ఉంది. అన్ని అధికారిక సమావేశాలు ముగిసిన తర్వాత జూన్ 12 సాయంత్రం 6 గంటలకు ఆయన తిరిగి చెన్నై చేరుకుంటారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోయే ఈ నీతి ఆయోగ్ సమావేశంలో సహకార సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల అభివృద్ధి ప్రాధాన్యతలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి చర్చించనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా జూన్ 10 నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ఎన్డీయే, నీతి ఆయోగ్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.














Click it and Unblock the Notifications