నిర్లక్ష్యం వల్లే ‘భారతీయుడు-2’ క్రేన్ ప్రమాదం.. కమల్ మెడకు కేసుల ఉచ్చు.. శంకర్, నిర్మాతలకూ నోటీసులు

చిన్న తప్పేకదాని వదిలేస్తే.. అలాంటి చిన్నతప్పులన్నీ కలిసి ఒక మెగా తప్పులా మారి.. దేశాన్ని నాశనం చేసేస్తుందని.. అందుకే తప్పును మొగ్గలోనే తుంచేయాలన్న ఫిలాసఫీతో 1996లో 'భారతీయుడు' సినిమా వచ్చింది. కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం 'భారతీయుడు 2' రూపుదిద్దుకుంటోంది. కాగా,
రెండ్రోజుల కిందట భారతీయుడు 2 సెట్ లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి కూడా నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. క్రేన్ ప్రమాద ఘటనపై ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి హీరో కమల్ హాసస్, దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థకు శుక్రవారం నోటీసులు జారీచేశారు.

ఆరోజు ఏం జరిగిందంటే..
భారతీయుడు 2 రెండో షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా.. 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ కుప్పకూలిపడింది. అది నేరుగా షూటింగ్ స్పాట్ లోని టెంటుపై కూలడంతో యూనిట్ లోని ముగ్గురు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో దర్శకుడు శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు(29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), మరో అసిస్టెంట్ చంద్రన్ ఉన్నారు.

పోలీసులే సుమోటోగా...
భారతీయుడు 2 సినిమా సెట్ లో క్రేన్ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురి కుటుంబాలకు తలో కోటి రూపాయల చొప్పున మొత్తం రూ.3కోట్లు అందజేస్తామని హీరో కమల్ హాసన్ ప్రకటించారు. దీంతో బాధిత కుటుంబాలు కేసుల జోలికి పోలేదు. కానీ ప్రమాదానికి సంబంధించి వార్తలు దేశమంతటా వైరల్ కావడం, రకరకాల ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో చెన్నై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నిర్లక్ష్యం వల్లే..
ఈవీపీ ఫిలిం సిటీలో క్రేన్ ప్రమాద ఘటనపై చెన్నై పోలీసులు.. ఐపీసీలోని 287, 337, 338, 304ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్రేన్ ఆపరేటర్‌తో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తోపాటు యూనిట్ లోని ఇతర ముఖ్యులకు కూడా పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈనెల 25లోగా స్టేషన్ కు వచ్చి అన్ని వివరాలు వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కమల్ కు కష్టాలు తప్పవా?
చాలా ఏళ్లుగా బీజేపీ వ్యతిరేక వాణిని వినిపిస్తోన్న కమల్ హాసన్.. ‘మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం)' పార్టీ స్థాపించిన తర్వాత జోరు మరింత పెంచారు. మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా పలు సిటీల్లో జరిగిన కార్యక్రమాల్లో కమల్ భాగం పంచుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఎన్డీఏలో అధికారికంగా చేరకుండానే బీజేపీతో అంటకాగుతోన్న సంగతి తెలిసిందే. క్రేన్ ప్రమాద ఘటనలో కమల్ ప్రమేయం లేనప్పటికీ.. కేసుల ద్వారా సినిమాకు ఇబ్బందులు తప్పవనే వాదన వినబడుతోంది. పోలీసుల నోటీసులపై కమల్, శంకర్ స్పందించాల్సిఉంది.