ncp sharad pawar rafale deal rafale narendra modi ఎన్సీపీ శరద్ పవార్ రాఫెల్ డీల్ రాఫెల్ ఒప్పందం నరేంద్ర మోడీ
రాఫెల్‌పై శరద్ పవార్ వ్యాఖ్యల ఎఫెక్ట్: ఎన్సీపీకి సీనియర్ ఎంపీ రాజీనామా

పాట్నా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి బీహార్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఏకైక ఎంపీ తారీఖ్ అన్వర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
అంతేగాక, ఎన్సీపీలోని అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో తమ పార్టీ అధినేత శరద్ పవార్ వైఖరి నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తారీఖ్ తెలిపారు.

రాఫెల్ ఒప్పందం గురించి ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేవంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పవార్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తారీఖ్ తెలిపారు.
'రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది కాదా. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఈ ఒప్పందం విషయంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ, శరద్ పవార్ మాత్రమే మోడీకి అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది' అని తారీఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరతాననే విషయంపై ప్రకటన చేస్తానని తెలిపారు.