తెహల్కా దాడి కేసులో పార్టీల జోక్యం వద్దు: విక్టిమ్
పనాజి: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన బాధితురాలు, వేధింపుల కేసు విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల కేసుకు దూరంగా ఉండాలని, కేసులో జోక్యం వద్దని బాధితురాలు భారతీయ జనతా పార్టీతోపాటు పలు రాజకీయ పార్టీలను కోరారు.
బాధితురాలు శుక్రవారం మాట్లాడుతూ.. తేజ్పాల్ లైంగిక వేధింపుల కేసు విషయంలో రాజకీయ పార్టీల జోక్యం కారణంగా కేసు హింసాత్మకంగా మారే అవకాశం ఉందని అన్నారు. తనపై తరుణ్ తేజ్పాల్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. న్యాయ పరిభాషలో అత్యాచారం అంటే ఎంటో చెప్పాలని ఆమె తేజ్పాల్ను ప్రశ్నించారు. కాగా పోలీసులు అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో తరుణ్ తేజ్పాల్ గోవా విడిచి వెళ్లినట్లు సమాచారం. తనపై రాజకీయంగా కుట్ర పన్ని కేసులో ఇరికించారని ఇటీవల తరుణ్ తేజ్పాల్ ఆరోపించారు.

భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలపై గతంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం తనపై ఇలాంటి చర్యలకు పూనుకున్నట్లు తరుణ్ తేజ్పాల్ ఆరోపించారు. కాగా తరుణ్ తేజ్పాల్ చేసిన ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కొట్టిపారేశారు. తన ఆరోపణలను నిరూపించుకోవాలని తరుణ్ తేజ్పాల్కు ఆయన సవాల్ విసిరారు. తరుణ్ తేజ్పాల్పై లైంగిక ఆరోపణల కేసు వెలుగుచూసినప్పటి నుంచి తరుణ్ తేజ్పాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు గోవా రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
గోవా పోలీసులు గురువారం తరుణ్ తేజ్పాల్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం తనకు సమయం కావాలని తరుణ్ తేజ్పాల్ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును జారీ చేశారు. కాగా నవంబర్ మొదటివారంలో గోవాలోని ఓ హోటల్లోని లిఫ్టులో మహిళా జర్నలిస్టును తేజ్పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు నవంబర్ 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.