విభజన నివేదిక: పల్లంరాజు లేఖతో జివోఎంకు బ్రేకులు?

మంగళవారంనాటి సమావేశానికి సుశీల్ కుమార్ షిండేసహా ఇంకా నారాయణ స్వామి, జై రాం రమేశ్, చిదంబరం, ఆంటొనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణాకు సంబంధించిన ముసాయిదా సిద్ధం కావడంతో ఇక దానిపై అందరూ సంతకాలు చేయడంతో ఈ సమావేశం ముగుస్తుందని భావించారు. కానీ అందుకు విరుద్ధమైన పరిణామం చోటు చేసుకుంది.
బుధవారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌కు ఆ ముసాయిదాను అందజేస్తారని అనుకున్నారు. కానీ రేపు మళ్లీ జీఓఎం సమావేశం జరగవచ్చునని ఆజాద్ చెప్పడంతో ఇది మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పల్లంరాజు రాసిన లేఖతో బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ఉరి వేసే ముందు కూడా నేరస్తునికి తన చివరి కోరికను చెప్పుకునే అవకాశం ఇస్తారని, తమకు ఆ మాత్రం అవకాశం ఇవ్వరా అని పల్లం రాజు ఆ లేఖలో అన్నట్లు తెలుస్తోంది. దాంతో సీమాంధ్ర మంత్రులకు తమ వాదనను వినిపించుకునే అవకాశం ఇచ్చారని అంటున్నారు.
అనంతరం సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజు, జేడీ శీలం కేంద్ర హోం మంత్రితో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత జీవోఎం సభ్యులు వీరప్ప మొయిలీ, జైరాం రమేష్‌లతో సమావేశమయ్యారు. జివోఎం సమావేశంలో ఈ రోజు చాలా విషయాలపై చర్చించామని, ఇంకా చర్చించాల్సిన విషయాలు ఉన్నాయని జివోఎం సమావేశంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. రేపు బుధవారం రాత్రి 8 గంటలకు జివోఎం మరోసారి సమావేశమవుతుందని ఆయన చెప్పారు.
కాగా, తెలంగాణ జెఎసి నేతలు రాయల తెలంగాణకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతును కోరుతున్నారు. ఢిల్లీలో తెలంగాణ జెఎసి నేతలు బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను, జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను కలిశారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని రాజ్‌నాథ్ సింగ్ తమతో చెప్పినట్లు తెలంగాణ జెఎసి నాయకులు చెప్పారు. తెలంగాణకు మద్దతు ఇస్తామని శరద్ యాదవ్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications