వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నాట్లు వేస్తున్న మహిళ

తెలంగాణ రాష్ర్టంలో నియంత్రిత సాగు విధానం ఈ ఖరీఫ్‌ సీజన్ నుంచి అమలు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అంటే ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలి.

రాష్ర్టంలోని సుమారు 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు విధానం అమలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

మొక్కజొన్న సాగును తగ్గించి పత్తి, వరి, కందులు, సోయాబీన్ వేసుకోవాలని ప్రభుత్వం సూచించిది.

ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు ఈ వానాకాలంలో 60,16,079 ఎకరాల్లో పత్తిని, 41,76,778 ఎకరాల్లో వరి పంటను, 12,31,284 ఎకరాల్లో కందులను, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్ ను, 1,53,565 ఎకరాల్లో మొక్కజొన్నలను, 1,88,466 ఎకరాల్లో పెసర్లను, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరుకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తున్నట్లు అధికారులు వివరించారు.

దీని ప్రకారమే ఇప్పటి వరకు 55 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు చెప్పారు.

జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిని జూన్ 15న జరిగిన సమావేశంలో సీఎం సమీక్షించారు.

పొలం పనులు

రైతుల మేలు కోసమేనా ఈ నూతన వ్యవసాయ విధానం?

"సంప్రదాయ వ్యవసాయం లాభసాటి కాదు. కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానం మారాలి. డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాల"ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే నెలలో వెల్లడించారు.

''రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడం. మార్కెట్ డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలి. పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి అనేక మార్లు చెప్పాను. ఇంతకు మించిన గత్యంతరం లేదు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది మా అభిమతం'' అన్నారు సీఎం.

నియంత్రిత సాగు విధానానికి అమలుకు రైతుబంధు పథకానికి ముడి పెట్టింది ప్రభుత్వం.

ప్రభుత్వం సూచించిన విధానం అనుసరంచికపోతే రైతుబంధు డబ్బులు రావని వ్యవసాయాధికారులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. రైతులకు మరో దారి లేకపోయింది.

మొక్కజొన్న

మొక్కజొన్న బంద్

వర్షకాలంలో మొక్కజొన్న సాగు లాభసాటి కాదు కాబట్టి, ఆ పంట వేయొద్దని ప్రభుత్వం సూచించింది.

దీంతో పలు జిల్లాలలో మొక్కజొన్న విత్తనాల కొనుగోలుకూ అవకాశం లేదని కొందరు రైతులు తెలిపారు.

వరంగల్ జిల్లా శ్యాంపేట కు చెందిన రైతు ఒకరు బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ, రైతుబంధు రాదన్న భయంతో తన మూడు ఎకరాల పొలంలో మక్కల(మొక్కజొన్న)కు బదులు పత్తి వేసినట్టు తెలిపారు.

ఏటా వర్షాకాలంలో మొక్క జొన్న సాగు చేసేవారమని ఆయన చెప్పారు.

"మక్కలు వేయొద్దని చెప్పారు. ఈ సారి పత్తి పెట్టాను. మక్కలు ఎకరానికి ౩౦ క్వింటాల్ దిగుబడి వస్తది. క్వింటాల్‌ మక్కలకు మార్కెట్లో వచ్చే ధర రూ.1800. ఎక్కువగా పౌల్ట్రీ ఫీడ్ కోసం విక్రయించే సంస్థలతో టై అప్ ఉండటంతో వారికే అమ్మేస్తాను. అదే పత్తి అయితే, ఎకరానికి 15 క్వింటాల్ దిగుబడి వస్తది. పత్తిపై కనీస మద్దతు ధర ఈ సారి రూ.5515 అని నిర్ణయించింది కేంద్రం. కాని మార్కెట్ ధర రూ.3676 ఉండొచ్చని అంచనా. మరి కనీస మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తే గిట్టుబాట్టు అవుతది. లేక పోతే, ప్రతిసారిలా మార్కెట్ ధరకే అమ్మవలసి వస్తే నష్ట పోతాము." అంటున్నారు వరంగల్ జిల్లా శ్యాంపేట కు చెందిన ఆ రైతు.

జగిత్యాల జిల్లాలోనూ ఈసారి మక్కల సాగు మానుకోవాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయంగా కందులు, సోయా సాగు చేయాలని చెప్పారు.

జగిత్యాల జిల్లాలో గత ఖరీఫ్ కాలంలో 2,31,229 ఎకరాలలో వరి సాగు చేశారు రైతులు. అదీ దొడ్డు రకం వరి సాగు చేసేవారు.

ఈసారి 2,28,378 ఎకరాలలో వరి సాగు చేయాలని సూచించారు. అందులోని 50 శాతం సోనా రకం వరి వేయాలని సూచించారు.

కిందటి ఖరీఫ్ లో మక్కలు ఒకే పంటగా 17,000 ఎకరాలలో సాగు చేశారు. ఈ వానాకాలం సాగులో అసలు మక్కలు సాగు చేయొద్దని సూచించారు. దాని బదులు పత్తి, సోయా, కందులు సాగు చేయమని సూచించారు. కిందటి ఖరీఫ్ లో 28,223 ఎకరాలలో పత్తి పెడితే ఈ సారి 38,000 ఎకరాలలో పత్తి వేస్తున్నారు.

కిందటి ఖరీఫ్ లో 4,095 ఎకరాలలో కందులు సాగు చేస్తే దాన్ని పెంచి 21,850 ఎకరాలలో సాగు చేయాలని సూచించారు. కిందటి ఖరీఫ్ లో 1700 ఎకరాలలో సోయా సాగు జరిగింది. ఈ ఖరీఫ్ లో ఇప్పటికే 4,000 ఎకరాలలో సోయా సాగు అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

పొలంలో నాట్లు వేస్తున్న మహిళలు

వరితో మార్పు ప్రారంభం

ఈ వానాకాలంలో వరి పంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ యాసంగిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా 1.15 కోట్ల టన్నుల ధాన్యం సేకరించిందని తెలిపారు అధికారులు.

ఇందులో 64 లక్షల టన్నులు ఒక్క తెలంగాణ నుంచే సేకరించిందని చెప్పారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు . అంటే దేశం మొత్తంలో 55శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేకరించింది.

వరి సాగు వీలైనంత తంగిచాలని నిర్ణయించి ఆ దిశగా రైతులకు పత్తి సాగు పెంచాలని సూచించింది ప్రభుత్వం.

"వరి సాగు చేయాలి అనేది ప్రతి తెలంగాణ రైతుకి ఉండే ఒక కల. సాగునీటి వసతి పెరగడంతో గత ఐదు సంవత్సరాలలో వరి సాగు క్రమంగా పరుగుతూ వచ్చింది. ధాన్యం ఉత్పత్తి పెరిగి మిగులు రాష్ట్రంగా మారాం.

గత యాసంగిలో తెలంగాణలో 17 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈ యాసంగిలో 39.5 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది.

కాళేశ్వరం నీరు కూడా అందుబాటులోకి వచ్చే సరికి ఈ వానాకాలంలోనూ వరి సాగు చేయాలనే అనుకుంటారు రైతులు.

కానీ అధిక ఉత్పత్తితో డిమాండ్ తగ్గిపోతుంది. అందులో తెలంగాణలో దొడ్డు రకం ఎక్కువ శాతం. తెలంగాణ సోనాకు డిమాండ్ ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలు వేసుకోవాలి." అంటున్నారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి.

ఇందులో భాగంగా 60 శాతం సన్న రకం 40 శాతం దొడ్డు రకం సాగు చేయాలని ఇప్పటికే అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

క్షేత్రస్థాయిలో సన్నరకం వరి పంట సాగు చేయడానికి రైతులు సిద్దమవుతున్నారు. కానీ సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గతంలో లేకపోవడంతో, ఇప్పుడు ఏర్పాటు చేస్తారా లేదా అని రైతులు ఆందోళనలో ఉన్నారు.

అంతేకాకుండా సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు.

"సన్నరకం వరి పంట దిగుబడి తక్కువ. దొడ్డురకం ధాన్యం ఎకరానికి ౩౦ క్వింటాల్లు దిగుబడి. సన్నరకం వరి పంట దిగుబడి 15 క్వింటాల్లు దిగుబడి ఉంటది. అంతేకాకుండా సన్నరకం పంటకి తెగుళ్లు ఎక్కువ. పంట పండిన తరువాత ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆందోళన కలుగుతుంది.

సన్నరకం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామి ఇస్తే బాగుంటుంది." అంటున్నారు వరంగల్ రూరల్ జిల్లా రైతు రాజయ్య.

పత్తి పొలం

వరితో పోల్చుకుంటే పత్తి చాలా లాభదాయకంగా ఉంది అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.

"తెలంగాణలో గతంలో పత్తి పంటను వర్షాధారంగా సాగు చేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి వసతి పెరిగింది. కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. నాణ్యమైన పత్తి వస్తుంది.

వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం.

పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి, రైతులకు ఎంతో మేలు కలుగుతుంది అని అన్నారు నిపుణులు. అందుకే వరి సాగు తగ్గించి పత్తి సాగు పెంచాలని సూచించాం" అన్నారు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

వరి

కౌలు రైతుల కష్టాలు

ప్రభుత్వం సూచించిన పంటలను వేయకపోతే రైతుబంధు రాదని, మద్దతు ధర ఇవ్వబోమని గ్రామాలలో అధికారులు ప్రచారం చేశారు. దీంతో ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేస్తేనే భూ యజమానులు తమ భూమి కౌలుకు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.

"నా సొంత భూమి ఒక ఎకరం ఉంది. మూడు ఎకరాలు కౌలుకు పట్టుకున్న. ప్రతి సారి మక్కలు సాగు వేస్తాను. ఈ సారి మక్కలు వేస్తే కౌలుకు ఇయ్యనన్నారు యజమాని. ఇక ఏదైతే అది అని పత్తి వేశాను. గతంలో మా గ్రామంలో పత్తి వేసిన వారికి ధర రాలేదు. నాకు ఇంకో గతి లేక పత్తి వేశాను. ఏమైతదో చూడాలే." అంటున్నారు జనగామకు చెందిన కౌలు రైతు ఒకరు.

నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు ఉన్నప్పటికి ఇంత హడావిడిగా అమలు చేయడం వల్ల మొదటికే నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. "భూసార పరీక్షలు చేసి ఎక్కడ ఏ పంట వేస్తే లాభదాయకం అన్నది రైతులకు అవగాహన కల్పించాలి. కనీస మద్దతు ధర పై స్పష్టత ఇవ్వాలి. కౌలు రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని విధానాల రూపకల్పన చేయాలి." అంటున్నారు రైతు స్వరాజ్య వేదికకు చెందిన కిరణ్ విస్సా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Controlled cultivation will begin in Telangana in this Kharif season
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X