• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ: కరోనా కష్టకాలంలో యువ డాక్టర్లు ముందుకు రావాలన్న కేసీఆర్ - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

యువ డాక్టర్లకు ఆహ్వానం

కరోనా కాలంలో వైద్యులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యువ డాక్టర్లకు ఆహ్వానం పలుకుతున్నట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కరోనా వైరస్‌ సుదీర్ఘ కాలం పాటు ఉంటుందని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని, వారికి కొంత వెసులుబాటు కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వేలమంది యువ వైద్యుల సేవలను వినియోగించుకోనున్నారు.

రాష్ట్రంలో కరోనా చికిత్సలపై ముఖ్యమంత్రి ఆదివారం 4 గంటలపాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వైద్యులున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో సేవలందించేందుకు వీరిలో అర్హులైన, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించబోతున్నారు.

అంతేకాదు, పారామెడికల్‌ శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లను కూడా ప్రభుత్వ దవాఖానల్లో సేవల కోసం నియమించనున్నారు.

వచ్చే రెండు, మూడు నెలల కాలానికి పనిచేసేలా డాక్టర్లు, నర్సులు, లాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని వైద్యాధికారులను కేసీఆర్‌ ఆదేశించారు.

ఇలా సేవలందించడానికి ముందుకు వచ్చే వారికి గౌరవప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు.

అంతేకాకుండా కరోనా వంటి సంక్షోభ సమయంలో రాష్ట్రం కోసం పని చేసేందుకు ముందుకు వచ్చే వారికి సరైన గుర్తింపునివ్వాలని ఆయన సూచించారని నమస్తే తెలంగాణ రాసింది.

భవిష్యత్తులో ప్రభుత్వం జరిపే ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మారులను కలపాలని ఆదేశించారు.

యువ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కష్టకాలంలో మన ప్రజలకు సేవచేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం తెలిపారు.

ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నవారు https://odls.telangana. gov.in/ medicalrecruitment/Home.aspx.. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందని నమస్తే తెలంగాణ వివరించింది.

తెలంగాణకు రానున్న టీకా డోసులు

తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన టీకా డోసులు నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి రానున్నట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా టీకాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. వ్యాక్సీన్‌ ఉత్పత్తిదారులైన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు ఇండెంట్‌ పెట్టింది.

కొవిషీల్డ్‌ ఒక్కో డోసును రూ.300 చొప్పున, కొవాగ్జిన్‌ ఒక్కో డోసును రూ. 400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించనున్నాయి. డబ్బు చెల్లించిన వారంలోగా టీకాలు పంపుతామని వెల్లడించాయని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఈ మేరకు నాలుగైదు రోజుల్లోనే 3.66 లక్షల కొవిషీల్డ్‌ డోసులు, 75 వేల కొవాగ్జిన్‌ డోసులు కలిపి మొత్తంగా 4.41 లక్షల డోసులు రాష్ట్రానికి రానున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ప్రతి నెలా కొవిషీల్డ్‌ డోసులు 6 కోట్లు, కొవాగ్జిన్‌ డోసులు కోటి ఉత్పత్తి అవుతున్నాయి.

సగం కేంద్రం తీసుకోగా, మిగిలినవాటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు 30 శాతం, ప్రైవేటు ఆస్పత్రులకు 20 శాతం ఇవ్వాలన్న నిబంధన ఉంది.

అంటే 2.10 కోట్ల డోసులను దేశంలోని అన్ని రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే యూపీ, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, ఝార్ఖండ్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోగా.. తెలంగాణ సైతం ఆ జాబితాలో చేరిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఏపీలో అందుబాటులోకి ఈ-పాస్

ఏపీలో కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ-పాస్ అందించనున్నట్లు సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.

కరోనా కారణంగా అంతర్రాష్ట్ర కదలికలపై పోలీస్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయని, అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ-పాస్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు.

విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద డీజీపీ మీడియాతో మాట్లాడారు.

అన్ని జిల్లాల్లో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతివ్వాలని, 12 గంటల తర్వాత కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సీఎం సూచించారన్నారు.

ప్రతి జిల్లా నుంచి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు కర్ఫ్యూపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు.

అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే వారి కోసం సోమవారం నుంచి ఈ-పాస్‌ విధానాన్ని సీఎం ఆదేశాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

ప్రస్తుత కరోనా సమయంలో బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్‌ సేవ అప్లికేషన్‌ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.

శుభకార్యాలకు సంబంధించి స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు.

తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు, ఆయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు. ప్రజలందరూ పోలీస్‌ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారని సాక్షి వివరించింది.

పోలవరం ప్రాజెక్ట్

పోలవరం టెండర్లకు పోటీ అంతంతే

పోలవరం పనులకు పిలిచిన టెండర్లకు పెద్దగా స్పందన రాలేదని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

పోలవరం ప్రాజెక్టులో కొత్తగా చేపట్టబోయే అదనపు పనులకు జలవనరులశాఖ అధికారులు ఏప్రిల్‌లో టెండర్లు పిలవగా స్పందన అంతంత మాత్రమే వచ్చింది.

కేవలం ఇద్దరు గుత్తేదారులే పాల్గొన్నారు. వారు సమర్పించిన బిడ్లు కూడా డాక్యుమెంటేషన్‌ పరంగా ఇబ్బందులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆ టెండరు రద్దు చేయాల్సి వచ్చిందని ఈనాడు రాసింది.

తిరిగి రెండోసారి జలవనరులశాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాంలో కొత్తగా అదనపు పనులు చేపట్టవలసి వచ్చింది.

స్పిల్‌ వే తర్వాత నది నీళ్లు ప్రవహించే స్పిల్‌ ఛానల్‌ వద్ద చివర్లో దాదాపు 1,354 మీటర్ల పొడవునా కటాఫ్‌ డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.

మరోవైపు ప్రధానంగా రాతిమట్టి కట్ట మూడు భాగాలుగా ఉంది. ఇందులో మూడో భాగంలో 140 మీటర్ల పొడవునా కాంక్రీటు డ్యాం నిర్మాణానికి నిర్ణయించారు.

రెండో భాగంలో కొంత మేర డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌, ఇతర పనులు చేయాలి. మొదటి భాగంలోనూ 586 మీటర్ల పొడవునా సాయిల్‌ మిక్సింగ్‌ పనులు చేయాల్సి ఉంది.

స్పిల్‌ ఛానల్‌లో కుడి వైపున ఉన్న కొండవాలు రక్షణ పనులు చేస్తున్నారు. వీటన్నింటికీ కలిపి రూ.683 కోట్ల అంచనాతో ఎల్‌ఎస్‌ పద్ధతిలో టెండర్లు పిలిచారు.

ఈ పనులకు రెండే సంస్థలు బిడ్‌ దాఖలు చేశాయి. మొదట జలవనరులశాఖ అధికారులు ఈ పనులను నామినేషన్‌ పద్ధతిపై అప్పగించేందుకు ప్రయత్నించారని పత్రిక చెప్పింది.

ఇప్పటికే పోలవరం ప్రధాన పనులు చేస్తున్న మేఘా సంస్థకు అవే టెండర్‌ డిస్కౌంట్‌ ధరలకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సమర్పించినా ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో జ్యుడిషియల్‌ కమిషన్‌ వద్దకు వెళ్లి టెండరు నోటీసులు ఇచ్చారు.

పోలవరంలో ఇప్పటికే వేరే సంస్థ ప్రధాన పనులు చేస్తుండటం, కరోనా కాలం, బిల్లులు అందడంలో ఎదురవుతున్న సమస్యలు, ఇప్పటికిప్పుడు మిషనరీ సమకూర్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు ఇలాంటి అనేక అంశాలు కలిసి టెండరుకు పోటీ తగ్గిపోయిందని చెబుతున్నారు.

ప్రస్తుతం రెండో సారి టెండర్లకు మే 10 నుంచి మే 17వరకు బిడ్లు సమర్పించేందుకు గడువు ఇచ్చారు. మే 18న సాంకేతిక బిడ్‌ తెరవడంతో పాటు మే 20న కమర్షియల్‌ బిడ్‌ తెరుస్తారు.

ఆ మర్నాడు మే 21న రివర్సు టెండర్లు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారని ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Young doctors should come forward and do service says KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X