• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆలయ’ రాజకీయాలు... అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి?

By BBC News తెలుగు
|
అంతర్వేది ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

విగ్రహాలకు అపచారం జరిగిందంటూ వివిధ పార్టీల నేతల పర్యటనల పరంపర సాగుతోంది.

అదే సమయంలో తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అధికార పక్షం వైసీపీ ఎదురుదాడి చేస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతున్న తరుణంలో గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల్లో జరిగిన వివిధ ఘటనలు, తదనంతర పరిణామాలు, వాటి విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై బీబీసీ అందిస్తున్న వివరాలు ఇవి.

పిఠాపురం ఆలయం

గుంటూరు దుర్గగుడి నుంచి పిఠాపురం ఆలయాల వరకూ....

గతంలో రాజకీయ, జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యవహారాలు పెను వివాదాలకు దారితీసేవి. కానీ, కొన్నేళ్లుగా ఆలయాలు వివాదాలకు కేంద్ర స్థానం అవుతున్నాయి.

గత రెండేళ్లలో చూస్తే తొలుత 2019 నవంబర్ 14న గుంటూరులో దుర్గ గుడి ధ్వంసం అయ్యిందనే ప్రచారం సాగింది. రోడ్డు విస్తరణ కోసం గుడిని తొలగించి, మరోచోట ఏర్పాటు చేస్తుంటే ఆ విషయాన్ని గుడి కూల్చారనే రీతిలో ప్రచారం చేశారంటూ అప్పట్లో అధికారులు వివరణ ఇచ్చారు.

తర్వాత 2020 జనవరి 21న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని వివిధ ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడం పెద్ద దుమారం రేపింది. వివిధ సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి.

చివరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి అడపా మధుకర్ అనే వ్యక్తిని దోషిగా తేల్చారు. సీసీ కెమెరాల సహాయంతో అతడిని గుర్తించి, రిమాండ్‌కు పంపించామని, ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ సాగుతోందని పిఠాపురం పోలీసులు బీబీసీతో చెప్పారు. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశామని అన్నారు.

ఆ తర్వాత 20 రోజులకు, అంటే నిరుడు ఫిబ్రవరి 11న గుంటూరు జిల్లా రొంపిచెర్లలో వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అదే రీతిలో 13వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారవు పాలెంలో అమ్మవారి గుడి ముఖ ద్వారం ధ్వంసమైంది.

ఫిబ్రవరి 14నాడు నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం మంటల్లో దగ్దం కావడం పెను వివాదంగా మారింది. ఈ కేసులో ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐ‌ఆర్ నెంబర్ 12/2020 గా కేసు నమోదయ్యింది.

ఐపీసీ 436 కింద కట్టా ఫకీరయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసు కూడా కోర్టు పరిధిలో ఉందని బిట్రగుంట పోలీసులు బీబీసీకి వివరించారు.

అంతర్వేది ఆలయం

అంతర్వేది రథం కాలిపోయిన ఘటనతో రాజుకున్న వివాదం

ఆలయాల చుట్టూ రాజకీయ ప్రకంపనలకు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం కాలిపోయిన ఘటన ఆజ్యం పోసింది. గత ఏడాది సెప్టెంబర్ 7న జరిగింది.

దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థానం రథం అర్థరాత్రి పూట కాలిపోవడం సంచలనంగా మారింది.

ఆలయ ప్రాంగణంలో ఉన్న రథానికి రక్షణ కరువైన తీరుపై వివిధ పార్టీలు నిరసనలకు పూనుకున్నాయి.

చివరకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, నేటికీ సీబీఐ మాత్రం ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు.

కేసు విచారణ విషయంలో సీబీఐ ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని విశాఖ సీబీఐ అధికారులు బీబీసీతో చెప్పారు.

అంతర్వేదిలో రథం కోసం ఆందోళన చేస్తున్న కొందరు విద్వేష చర్యలకు పూనుకున్న ఘటన చర్చనీయాంశమయ్యింది. మంత్రులను నిలదీయడం, ఇతర మతాలకు చెందిన ప్రార్థనామందిరాలపై రాళ్లురువ్వడం వంటి చర్యలకు పాల్పడిన 36మందిపై కేసులు నమోదయ్యాయి.

వారిని అరెస్ట్ కూడా చేశారు. కొందరిని రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉందని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు బీబీసీతో చెప్పారు.

మరోవైపు కాలిపోయిన రథం స్థానంలో కొత్త రథాన్ని ప్రభుత్వం దేవాదాయ శాఖ నిధులతో సిద్ధం చేసింది. ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు.

ఫిబ్రవరిలో జరగబోయే రథోత్సవానికి ఎటువంటి ఆటంకం లేకుండా కొత్త రథంతో కార్యక్రమం కొనసాగిస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు.

పిఠాపురం ఆలయం

నేటికీ కొనసాగుతున్న ఘటనలు

వరుసగా ఆలయాలకు సంబంధించిన వివాదాలు తెరమీదకు వస్తున్న తరుణంలో అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకూ 20 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

వివిధ ఆలయాల వద్ద భద్రత పెంచుతున్నట్టు ఏపీ పోలీసులు ప్రకటించారు. కానీ, వాటి ఫలితాలు అరకొరగానే ఉన్నాయనడానికి కొనసాగుతున్న ఘటనలు ఆధారంగా ఉన్నాయి.

అంతర్వేది అనంతరం కొద్దిరోజులకే సెప్టెంబర్ 25న నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో తుమ్మూరు ఆంజనేయస్వామి విగ్రహం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై కూడా కేసు నమోదయ్యింది.

తర్వాత అక్టోబర్ 5వ తేదీన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఉన్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో శేషపడగలపంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో కూడా ఎఫ్‌ఐ‌ఆర్ నమోదయ్యింది.

కేసుకి సంబంధించి ఆధారాలు సేకరించామని, విచారణ సాగుతోందని మంత్రాలయం పోలీసులు బీబీసీతో చెప్పారు.

అక్టోబర్ 16న తుర్లపాడు గ్రామంలో శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో తమకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదని పోలీసులు చెబుతున్నారు.

తిరుమల తిరుపతి

తొలి నుంచి తిరుమల చుట్టూ వివాదాలే..

జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే తిరుమల బస్సు టికెట్లపై జెరుసలేం యాత్రకు సంబంధించిన ప్రచారం చేస్తున్నారంటూ వివాదం జరిగింది. ఆ తర్వాత ఆ టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్టు టీటీడీ ప్రకటించింది.

ఆ తర్వాత కొద్దిరోజులకే తిరుమల కొండల్లో శిలువను ప్రతిష్టించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగింది. దానిపై టీటీడీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

కరెంటు స్తంభాన్ని శిలువగా చిత్రీకరించి, ఈ ప్రచారం చేసిన కొందరిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఈ కేసు కూడా విచారణలో ఉందని అలిపిరి పోలీసులు తెలిపారు.

తాజాగా తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన లైటింగ్ విషయంపై వివాదం మొదలుకావడంతో టీటీడీ అధికారులు స్పందించారు. అనుమానం రేకెత్తించిన అంశాలపై వివరణ ఇచ్చారు.

పూర్ణకుంభం ఏర్పాటు చేసిన దానిని శిలువ అంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రచారంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

విజయవాడ సీతాదేవి విగ్రహం ధ్వంసం

గత ప్రభుత్వ హయంలో కూడా ఇదే తీరు..

ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఏపీ పోలీసులు చెబుతున్నప్పటికీ అనేక చోట్ల వరుస ఘటనలు జరుగుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సందేహాలు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

అయితే ఇలాంటి ఘటనలు చాలాకాలంగా జరుగుతున్నాయని ఏపీ పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఊరికి దూరంగా ఉన్న చోట, తగిన రక్షణ సదుపాయాలు లేని చోట దొంగతనాల కోసం గానీ, ఇతర విషయాల్లో గానీ ప్రయత్నాలు చేసే కొందరు ఆలయాలను, విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలు చాలా ఉన్నాయని ఏపీ డీజీపీ ప్రకటించారు.

ఏపీ పోలీసుల లెక్కల ప్రకారం 2015లో 290, 2016లో 322, 2017లో 318, 2018లో 267 ఘటనలు ఆలయాలకు సంబంధించిన కేసులున్నాయి. వీటిలో రథం దగ్థమయిన కేసులు కూడా ఉన్నాయి.

ఇక 2019లో 305 ఘటనలు జరగ్గా, 2020లో సెప్టెంబర్ నాటికి 228 కేసులు నమోదైనట్లు ప్రకటించారు.

ఆలయాలపై దాడులు జరగడం కొత్త కాకపోయినప్పటికీ ప్రస్తుతం వరుసగా ఇవి జరుగుతున్న తీరు అనుమానాలకు తావిస్తోందని హైందవ ప్రచార సంఘటన ప్రతినిధి ఎం కేశవాచార్యులు బీబీసీతో అన్నారు.

"ప్రస్తుతం ఏపీలో ఆలయాలకు రక్షణ లేదనే అభిప్రాయం ఉంది. దానికి ప్రభుత్వానిదే బాధ్యత. ఇప్పటి వరకూ రెండేళ్ళుగా జరిగిన ఘటనల్లో ఒక్క కేసులోనూ నిందితులకు శిక్ష పడలేదు. ఎక్కువ సందర్భాల్లో కేసులు కూడా నమోదు కావడం లేదు. కేసులు పెట్టినా హిందూ సంస్థలు ఆందోళనకు పూనుకోకపోతే అరెస్టులు కూడా లేవు. అరెస్ట్ చేసినప్పటికీ నామమాత్రపు కేసులు మాత్రమే పెడుతున్నారు. దానివల్ల వాళ్లు దర్జాగా మళ్లీ బయటకు రాగలుగుతున్నారు" అని ఆయన అన్నారు.

రామతీర్థం

రామతీర్థం నుంచి విజయవాడ వరకూ..

గడిచిన 10 రోజుల వ్యవధిలో విజయనగరం జిల్లా రామతీర్థం, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అన్నింటికీ మించి ఏకంగా విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌ని అనుకుని ఉన్న ఆలయాల్లో జరగిన ఘటనలతో రాజకీయ వేడి రాజుకుంది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ తర్వాత టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒకే రోజు రామతీర్థంలో పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది.

టీడీపీ నాయకులు తనపై హత్యాయత్నం చేశారంటూ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో టీడీపీకి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో పలువురుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని విజయనగరం డీఎస్పీ బీబీసీతో చెప్పారు.

రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూడా విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన కేసులో పోలీసుల విచారణ సాగుతోందని చెబుతున్నారు.

తాజాగా విజయవాడ బస్టాండ్ ఆవరణలో సీతాదేవి విగ్రహాన్ని ధ్వసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణ చేసి నిందితులను పట్టుకుంటామని అన్నారు.

జగన్

"గెరిల్లా వార్‌ఫేర్‌ని ఎదుర్కోవాలి"

ఏపీలో తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రచారం రాకుండా చేసేందుకే కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరుగుతున్న పోలీసుల డ్యూటీ మీట్ ని ప్రారంభించిన సమయంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"కులాలను, మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తుంటే ఎలాంటి నేరాల మీద దర్యాప్తు చేయాలన్నది పోలీసులు ఆలోచించాలి. ఇలాంటి కేసులకు అనుగుణంగా టెక్నాలజీని పెంచాలి. మైండ్ సెట్ దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలు రెచ్చగొడితే ఎవరికి లాభం? ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ధ్వంసం చేస్తే ఎవరికి ప్రయోజనం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి, తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎవరిని లక్స్యంగా చేసుకుని ఇలా చేస్తున్నారన్నది ప్రజలు కూడా ఆలోచించాలి’’ అని జగన్ అన్నారు.

''మంచి జరుగుతున్నప్పుడు దానికి ప్రచారం రాకూడదనే ఇలాంటి ధ్వంసం చేసే కార్యక్రమాలకు వెనకాడటం లేదు. 2019 నుంచి అదే పరిస్థితి. అన్ని ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాల సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మారుమూల, జనసంచారం లేని ప్రాంతాల్లో, అర్థరాత్రి పూట జరిగే కార్యక్రమాలతో చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది. వాటిని ఎదుర్కోవడానికి పోలీసులు తమను తాము ప్రేరేపించుకుంటూ రాజకీయంగా జరుగుతున్న గెరిల్లా వార్ ఫేర్‌ని కూడా మనం ఎదుర్కోవాలి. ప్రభుత్వానికి, పోలీసులకు కావాలని చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు

'సీఎం తప్పించుకుంటున్నారు’

ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై సీఎం స్పందన సక్రమంగా లేదని టీడీపీ అంటోంది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి బీబీసీతో అన్నారు.

"సంవత్సరంన్నర కాలంగా దేవాలయాలపై, హిందూ మతంపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూస్తుంటే, ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. దేవాలయాలకు రక్షణ కల్పించలేని అసమర్థ వ్యక్తిగా ఆయన మాటలతోనే తేలిపోయింది. టీడీపీ దగ్గర 136 సంఘటనలకు సంబంధించిన ఆధారాలున్నాయి. ఒక్కరినైనా అరెస్ట్ చేయించగలిగారా?’’ అని ఆయన ప్రశ్నించారు.

దేవాలయాలు

'జగన్ పద్ధతి మార్చుకోవాలి’

జగన్ పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ తీవ్రంగా స్పందిస్తుందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నట్టుగా జగన్ చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

''చర్చిపై రాళ్లు వేసిన ఘటనలో 40 మంది హిందువులను అరెస్ట్ చేశారు. వందల ఆలయాలు ధ్వంసం అవుతుంటే ఎవరిపై చర్యలు తీసుకున్నారు? ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జీవీఎల్ అన్నారు.

'ఆందోళన కలిగిస్తోంది’

ఏపీ రాజకీయాల్లో మత సంబంధిత అంశాలు ప్రధానమైనవిగా మారిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని సామాజికవేత్త పీవీ రామారావు అన్నారు.

"ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే దానికి అనుగుణంగా స్పందించడం అవసరం. పునరావృతం కాకుండా నివారించడం కీలకం. వరుసగా ఆలయాల్లో జరుగుతున్న దాడులు, విధ్వంసాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. కానీ ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసి సరిపెట్టుకోవడం సమంజసం కాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఇలాంటి పరిణామాలపై పోలీసులకు ప్రాథమిక అంచనాలు, ఆధారాలు కూడా ఉంటాయి. వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. తాత్సారం చేయడం శ్రేయస్కరం కాదు. సామాన్య ప్రజల్లో సందేహాలు పెంచే విధంగా ఉండకూడదు. పారదర్శకంగా వ్యవహరించాలి. రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నేతల తీరు మూలంగా ఉద్రేకాలు రాజుకునే ప్రమాదం ఉంది. అలాంటి వాటికి అవకాశం లేకుండా చేయాలి’’ అని రామారావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Temple politics in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X