
తాలిబన్లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు-తీవ్రవాదుల పైచేయి తాత్కాలికమే
ఆప్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తమ పౌరుల్ని అక్కడి నుంచి తరలించేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే కోవలో భారత్ కూడా తన పౌరుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాలిబన్ల హవాతో గతంలో ఆప్ఘనిస్తాన్ లో భారత్ పెట్టిన పెట్టుబడులన్నీ వృథాగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇావాళ తాలిబన్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తీవ్రవాదం పునాదులపై సామ్రాజ్యాలు నిర్మించాలనుకునే విచ్చిన్న శక్తులు ఓ సమయం వరకూ పైచేయి సాధించవచ్చు, కానీ వారి ఉనికి శాశ్వతం కాబోదంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వ్యాఖ్యానించారు. మానవత్వాన్ని వీరు ఎంతో కాలం అణిచి ఉంచలేరని మోడీ తెలిపారు. మరోవైపు భారత విదేశాంగశాఖ ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కూడా వెల్లడించారు. తాలిబన్లతో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమన్నారు.

ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న తాలిబన్లు ప్రతీ ఇంటినీ గాలిస్తూ అమెరికాకూ, ఇతర దేశాలకు సహకరిస్తున్న వారి జాడను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా విడుదల చేసిన ఓ తాజా పరిశోధనా పత్రం వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అయితే పాశ్చాత్య దేశాలకు సహకరిస్తున్న వారిని కనిపెట్టేందుకు పౌరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నామన్న విమర్శల్ని తాలిబన్లు కొట్టిపారేస్తున్నారు.
పౌరుల ఇళ్ల సమీపంలోకి వెళ్లొద్దని తమ వారికి ఆంక్షలు విధించినట్లు చెప్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా దేశంలో పౌరులందరినీ క్షమించేస్తున్నట్లు ప్రకటించిన తాలిబన్లు.. మహిళలను సైతం ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అయితే తాలిబన్లను నమ్మేందుకు భారత్ మాత్రం ఇష్టపడటం లేదు.