వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ తీర్పు ఇలా కీలకమే!: ‘హస్తం’ గెలిస్తే ముందస్తు లేదంటే తృతీయ ఫ్రంట్‌

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అందరి దృష్టి కన్నడ నేలవైపు మళ్లింది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ల జయాపజయాలు ఈ ఏడాది చివర్లో జరుగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలపైనా.. ఆ పై వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలపైనా ప్రభావం చూపనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగానే 2019 లోక్‌సభ ఎన్నికలలో కూటములు, వ్యూహాలు రూపుదిద్దుకోనున్నాయి.
ఒకవేళ కర్ణాటకలో ఓటమి పాలైతే బీజేపీ ముందస్తుగా లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏరకంగా చూసినా కన్నడిగుల తీర్పు రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్ని గణనీయంగా ప్రభావితం చేయనున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉప ఎన్నికల నైరాశ్యాన్ని తిప్పికొట్టాల్సిన పరిస్థితి బీజేపీది

ఉప ఎన్నికల నైరాశ్యాన్ని తిప్పికొట్టాల్సిన పరిస్థితి బీజేపీది

దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగిలిన ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక. ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా కమలనాథుల జైత్రయాత్రను అడ్డుకుని ఈ ఎన్నికల నుంచి తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో పడిపోయిన బీజేపీ శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు కర్ణాటకలో విజయం సాధించి తీరాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమి పాలైతే ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కన్నడిగుల సంప్రదాయంపైనే కమలనాథుల ఆశలు

కన్నడిగుల సంప్రదాయంపైనే కమలనాథుల ఆశలు

కన్నడ ప్రజానీకం మూడు దశాబ్దాలలో ఏ పార్టీకి రెండోసారి మళ్లీ అధికారాన్ని అప్పగించలేదు. 1989 నుంచి వరుసగా ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ సంప్రదాయం తమకు కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తున్నది. కానీ ఈ చరిత్రను తిరగరాస్తానని సిద్దరామయ్య ధీమావ్యక్తం చేస్తున్నారు. సిద్దరామయ్య సర్కార్ పట్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని ఇటీవల కొన్ని స్వతంత్ర సంస్థలు నిర్వహించిన సర్వేలలో వెల్లడైంది.

కింగ్ మేకర్ పాత్ర కోసం జేడీఎస్ ఆశలిలా!

కింగ్ మేకర్ పాత్ర కోసం జేడీఎస్ ఆశలిలా!

ఇంతకాలం తమ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పపై ఆధారపడిన బీజేపీ గత మూడు నెలల నుంచి తమ కేంద్ర నాయకత్వాన్ని, జాతీయ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. ఇక మూడో పక్షంగా ఉన్న జనతాదళ్ (ఎస్) మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తాము కింగ్‌మేకర్లు కావచ్చని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఆశిస్తున్నారు. 11 ఏండ్లుగా అధికారానికి దూరంగా జేడీ(ఎస్) ఈసారి కూడా ప్రాధాన్యంగల పాత్రను పోషించలేకపోతే ఇక తెరమరుగు కావాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ఫలితాలు అటు బీజేపీకి, కాంగ్రెస్‌కే కాక పలు పార్టీల రాజకీయ వైఖరులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

2008లో యెడ్యూరప్ప సారథ్యంలో బీజేపీ ఇలా గెలుపు

2008లో యెడ్యూరప్ప సారథ్యంలో బీజేపీ ఇలా గెలుపు

యెడ్యూరప్పను జేడీ(ఎస్) మోసం చేసిందన్న సానుభూతితో 2008లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని చూపి 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండి కొట్టే ఎత్తుగడలో భాగంగా ఇటీవల ఆయన లింగాయత్‌లు, వీరశైవులకు మతపరమైన మైనారిటీ హోదాను ప్రకటించారు. తన ప్రజాకర్షక పథకాల ద్వారా సిద్దరామయ్య దళితులు, బీసీలు, మైనారిటీలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వచ్చినా, వాటితో సిద్దరామయ్యకు సంబంధం ఉన్నట్టు నిరూపించలేక పోయిన బీజేపీ ఈ ఎన్నికలను సిద్దరామయ్య, మోదీకి మధ్య పోరుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది.

లోక్ సభ ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటు యత్నాలు సజీవం

లోక్ సభ ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటు యత్నాలు సజీవం

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటే ఆ విజయం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలదొక్కుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.గత లోక్‌సభ ఎన్నికల్లో 44 స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ 2019 నాటికి బలం పుంజుకోవడానికి ఈ ఫలితాలను ఆసరాగా చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయడం ద్వారానే బీజేపీతో తలపడవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇటీవల యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నిర్వహించిన విందు భేటీకి 20 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. కర్ణాటకలో విజయంతో ఈ మహాకూటమికి నాయకత్వం వహించే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ పొందవచ్చు.

కన్నడనేలపై గెలిస్తే మున్ముందు కాంగ్రెస్ సీఎం అభ్యర్థులను ప్రకటించే చాన్స్

కన్నడనేలపై గెలిస్తే మున్ముందు కాంగ్రెస్ సీఎం అభ్యర్థులను ప్రకటించే చాన్స్

ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల రాజకీయ చతురతను ఎదురొడ్డి నిలిచిన ధీరుడుగా సిద్దరామయ్య పేరొందుతారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ముందుగానే ప్రకటించవచ్చు. కర్ణాటకలో ఎన్నికలను లౌకికవాదానికి, మతోన్మాదానికి మధ్య పోరుగా మార్చేసిన కాంగ్రెస్ సానుకూల ఫలితాలు వస్తే వచ్చే అన్ని ఎన్నికల్లోనూ అదే నినాదాన్ని కొనసాగించవచ్చు.

మోదీ చరిస్మా తగ్గలేదని కమలనాథులు రుజువు చేసుకోవాల్సిన తరుణమిలా

మోదీ చరిస్మా తగ్గలేదని కమలనాథులు రుజువు చేసుకోవాల్సిన తరుణమిలా

ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీ తీవ్రఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాబల్యం తగ్గలేదని కమలనాథులు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలో గెలిస్తే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మూడు పెద్ద రాష్ర్టాలలో తాము ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్నామని చెప్పుకోవచ్చు. తమ రాజకీయ ఎత్తుగడలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పి నరేంద్ర మోదీ - అమిత్‌షా ద్వయం విమర్శకుల నోళ్లు మూయించవచ్చు.

కాంగ్రెసేతర మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ఇలా దారి

కాంగ్రెసేతర మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ఇలా దారి

బీజేపీ గెలుపొందితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వ సామర్థ్యంపై తిరిగి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే, 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెసేతర మూడోఫ్రంట్ ఏర్పాటుకు మరింత ప్రేరణ లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మమతా దీదీ, అసదుద్దీన్ ఇలా కేసీఆర్‌కు సపోర్ట్

మమతా దీదీ, అసదుద్దీన్ ఇలా కేసీఆర్‌కు సపోర్ట్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం వివిధ రాజకీయ పక్షాల నుంచి మద్దతు లభిస్తున్నది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్‌కు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓడి, బీజేపీ గెలిస్తే.. కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో ఫ్రంట్ ఏర్పాటుకు మరిన్ని పార్టీలు ముందుకురావచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ తప్పనిసరిగా జత కట్టవచ్చు.

కశ్మీర్‌లో బీటలు వారుతున్న పీడీపీ - బీజేపీ కూటమి

కశ్మీర్‌లో బీటలు వారుతున్న పీడీపీ - బీజేపీ కూటమి

మిత్రపక్షంగానే ఉంటూనే అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్న శివసేన మహారాష్ట్రలో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని ఇప్పటికే ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో అధికార పీడీపీ-బీజేపీ కూటమి బీటలు వారుతున్నది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే శివసేన, పీడీపీ వైఖరిలో మార్పు రావచ్చు. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, తమిళనాడులో రజినీకాంత్ పార్టీతో జతకట్టి సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
The Karnataka elections, to be held on May 12 with counting on May 15, will serve as the stepping stone for the 2019 Lok Sabha elections. The outcome will especially galvanise the BJP and the Congress and could have a significant impact on assembly polls due in Rajasthan, Madhya Pradesh, Chhattisgarh and Mizoram later this year. What happens in Karnataka will also set the ball rolling for future alliances and strategies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X