అయోమయంలో సీబీఐ అధికారులు: డికే రవి కేసు
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే రవి అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే డికే. రవి కుటుంబ సభ్యులను విచారణ చేసిన సీబీఐ అధికారులు పలు విషయాలు సేకరించారు.
డికే. రవి మృతదేహాన్ని బయటకు తీసి రీ పోస్టుమార్టుం చెయ్యాలా? వద్దా అని డైలమాలో పడ్డారు. రవి కుటుంబ సభ్యులను సంప్రదించి రీ పోస్టుమార్టం విషయంపై చర్చించారు. అయితే తుది నిర్ణయం తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి ఉండేది!

ఉద్యోగం విషయంలో చాల ఎక్కువ ఒత్తిడి ఉండేదని అనేక సందర్బాలలో రవి కుటుంబ సభ్యులకు చెప్పాడని సీబీఐ అధికారులు తెలుసుకున్నారు. అయితే రవి మరణానికి ఎవరు కారణం, ఎవరి ఒత్తిడి ఎక్కువగా ఉండేది అని రవి కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పలేదని తెలిసింది.
రికార్డులు పరిశీలన!
రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 15 ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించారని తెలిసింది. రవి హత్యకు గురైనాడా ? ఆత్మహత్య చేసుకున్నాడా ? అని వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుకోణాలో దర్యాప్తు చేశారు.
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి, రవి తల్లిదండ్రులు, ఆయన మామ, కారు డ్రైవర్ ను విచారణ చేశారు. రవి మొబైల్ నుండి వెళ్లిన మేసేజ్ లు పరిశీలించారు. గతంలో కేసు దర్యాప్తు చేసిన సీఓడి అధికారులు రవి ఆత్మహత్య చేసుకున్నారని ఎఫ్ఐఆర్ తయారు చేశారు. ఏ ఆధారాలతో మీరు రవి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ తయారు చేశారంటూ వారి నుండి సీబీఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.