• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?

By BBC News తెలుగు
|

దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు లేవు. ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర పాలిత ప్రాంతంగానీ ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోయినట్లు నివేదించలేదు. కోవిడ్ మృతుల వివరాలు దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు. కేవలం ప్రోటోకాల్‌ని అనుసరించి వివిధ రాష్ట్రాలు ఇచ్చిన గణాంకాలను మాత్రమే మేము వెల్లడించాం.

ఇది కేంద్ర ప్రభుత్వ వివరణకోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో రోడ్లపైన, ఆస్పత్రి మెట్ల మీద రోగులు మరణించారా లేదా అనే ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం తరుపున రాజ్యసభలో సమాధానం ఇచ్చిన సందర్భంలో ఈ వివరణ ఇచ్చారు.

ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ కూడా స్పందించారు.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన కరోనా రోగులు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

ఆక్సిజన్‌ సమస్యతోనే రుయా ఆస్పత్రిలో కోవిడ్ రోగుల మరణాలు

జూలై 20న కేంద్రం ఈ సమాధానం చెబితే సరిగ్గా 2 నెలల 10 రోజుల ముందు అంటే మే 10న తిరుపతి రుయా ఆస్పత్రిలో ఒకేసారి పెద్ద సంఖ్యలో కరోనా రోగులు చనిపోయారు.

ఈ ఘటనలో 11 మంది మరణించారని ఆనాడు ప్రభుత్వం మొదట ప్రకటించింది. దానికి ప్రధాన కారణం ఆక్సిజన్ కొరత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.

ఘటనాస్థలంలో నాటి చిత్తూరు జిల్లా కలెక్టర్ అదే విషయం నిర్ధారణ చేశారు. ఆస్పత్రి వైద్యుల నివేదికలోనూ ధృవీకరించారు. ఇటీవల ఏపీ హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా పేర్కొన్నారు.

అంతేకాకుండా మే 11న ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ రాసిన లేఖలో కూడా ఈ అంశం ప్రస్తావించారు. ఏపీలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్రం సహాయాన్ని ఆయన అభ్యర్థించారు.

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరిపడా లేక రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో తక్షణమే స్పందించాలని కోరుతూ, జాప్యం జరిగితే అలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం మాత్రం ఏమీ లేవంటోంది

ఆక్సిజన్ కొరతతో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణించిన వారి సంఖ్య తొలుత 11గా చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత దానిని 23గా ప్రకటించింది. బాధితులకు పరిహారం కూడా చెల్లించింది.

ఏపీ ముఖ్యమంత్రి నేరుగా ప్రధానికి లేఖ రాశారు. బాధితులకు పరిహారం చెల్లిస్తూ నివేదికలో ప్రస్తావించారు. ఏపీ హైకోర్టు అఫిడవిట్‌లో కూడా కాంట్రాక్టర్ తప్పిదం వల్ల సకాలంలో ఆక్సిజన్ ట్యాంకులు ఆస్పత్రికి చేరలేదని తెలిపారు.

అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క రాష్ట్రం నుంచి ఆక్సిజన్ కారణంగా సంభవించిన మరణాలను నివేదించలేదని పేర్కొంది.ఈ అంశంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. కేంద్రానికి నివేదించారా లేదా అనే అంశంపై స్పష్టత కోరినప్పటికీ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పందించలేదు. రుయా ఘటనపై కేంద్రానికి అదే రోజు ఏపీ ప్రభుత్వం తరుపున నివేదించామని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

ఆక్సిజన్ ఉంటే మా అమ్మ బతికేది

కేవలం తిరుపతి రుయా ఘటన మాత్రమే కాకుండా మే నెల 20వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆక్సిజన్ కొరత అనేక చోట్ల కనిపించింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోనూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. "మే 8న ఉదయానికి మా అమ్మకు శ్వాస సమస్య వచ్చింది. ఎంతో ఇబ్బంది పడింది. 108 వాహనానికి ఫోన్ చేస్తే ఓ గంటకి వచ్చింది. ఉదయం 7 గంటల సమయంలో కాకినాడ జీజీహెచ్‌కి తీసుకెళ్లాం.

అప్పటికే చాలా ప్రైవేటు ఆస్పత్రుల కోసం ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడా ఆక్సిజన్ బెడ్ దొరకలేదు. జీజీహెచ్‌కి తీసుకెళ్లిన తర్వాత ఎంపీ వంగా గీతతో సూపరింటెండెంట్‌కి ఫోన్ చేయించాం.

ఆక్సిజన్ బెడ్, వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేస్తారని ఆశించాం. కానీ ఆస్పత్రికి వెళ్లేసరికి బెడ్స్ ఖాళీ లేకపోవడంతో మరో మహిళకు వైద్యం అందిస్తున్న బెడ్‌పై మా అమ్మని పడుకోబెట్టారు.

కానీ ఆక్సిజన్ మాత్రం అందలేదు. కొంతసేపు చూశాం. అయినా ఎవరూ స్పందించలేదు. కేకలు వేశాం. డాక్టర్ వచ్చారు. అప్పటికే మా అమ్మకు సమస్య తీవ్రమయిపోయింది. 12 గంటల సమయంలో ఆమె చనిపోయింది.

ఆక్సిజన్ సకాలంలో అందించి ఉంటే మా అమ్మ బతికేది. అది లేకపోవడం వల్లనే ఆమె చనిపోయింది. కోవిడ్ వల్ల చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు" అంటూ తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన అడబాల రాజబాబు.

అడబాల రాజబాబు తల్లి అడబాల సూర్యవతి (57) కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించారు. అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ అందించడం ఏప్రిల్ చివరి నుంచి మే నెలలో మొదటి రెండు వారాల పాటు చాలా పెద్ద సమస్య అయ్యింది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ లేకపోవడంతో రోగులను చేర్చుకోలేని స్థితి వచ్చింది.కేవలం కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.రాష్ట్రమంతా ఇలాంటి మృతులు అనేక మంది ఉన్నట్టు పలువురు బాధితులు మీడియా సాక్షిగా వాపోయారు. తమ బంధువులకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని పలుమార్లు ప్రభుత్వ కాల్ సెంటర్లకు, వివిధ స్థాయిల్లో అధికారులకు ఫిర్యాదులు చేసిన ఘటనలు కోకొల్లలు.ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాంటి అనుభవాలున్నప్పటికీ దేశమంతా ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన వారే లేరని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించడం పలువురుని విస్మయపరుస్తోంది. పైగా రాష్ట్రాలు తమకు నివేదించలేదని పేర్కొనడం మరో చర్చనీయాంశంగా మారింది.

ఆక్సిజన్

ఆక్సిజన్ కోసం ఆరు ఆసుపత్రులు తిరిగాం… ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ చనిపోలేదనడం పచ్చి అబద్ధం

తన భార్యకు ఆక్సిజన్ కోసం ఒక్క రాత్రి ఆరు ఆసుపత్రులు తిరిగారు హైదరాబాద్‌కి చెందిన ముంజులూరి శ్రీనివాస రావు. వెస్ట్ మారేడుపల్లిలో ఉండే ఆయన దాదాపు హైదరాబాద్ నగరం మొత్తం ఆక్సిజన్ కోసం తిరిగారు. ''అప్పటికే మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మామగారు టిమ్స్‌లో చేరారు. కానీ అక్కడ ఫుడ్ సరిగా లేదు. భోజనం కాదు కదా మంచినీళ్లు కూడా సరిగా అందక టిమ్స్ నుంచి వచ్చేశారు. ఆయనకు ఇంట్లోనే ఆక్సిజన్ ఏర్పాటు చేశాం. డిపాజిట్, అసలు ధర కలిపి 800 రూపాయల సిలెండర్ పది వేలకు కొన్నాం'' అంటూ ఆక్సిజన్‌తో తన మొదటి సమస్య చెప్పారు శ్రీనివాస రావు.

తరువాత ఆయన మామగారు చనిపోయారు. కానీ ఈ విషాదం అక్కడితో ముగియలేదు.

ఆ తరువాత ఆయన భార్య వంతు వచ్చింది. ఆ రోజు మే 4వ తేదీ. ఆయన భార్య ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంటే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏఎస్ రావు నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల తరువాత ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ప్రారంభమైంది. ఆక్సిజన్ సమస్య లేని మంచి వైద్యం అందించే ఆసుపత్రి కోసం వారు ప్రయత్నాలు ప్రారంభించారు.అది మే 6వ తేదీ సాయంత్రం 6.30 గంటలు. అంబులెన్సులో తన భార్యను ఎక్కించి, తాను, కుమారుడు కారులో వెనుకే ఫాలో అవుతూ సోమాజిగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే ఆ ఆసుపత్రి వారితో ఫోనులో మాట్లాడారు ఆయన. తీరా వెళ్లాక ఆ ఆసుపత్రి వారు చేర్చుకోవడానికి నిరాకరించారు.''నేను వాళ్లను బతిమాలాను. నా పోరు పడలేక వాళ్లు నాకు ఒక చోటు చూపించారు. అక్కడ దాదాపు వంద ఖాళీ సిలెండర్లు ఉన్నాయి'' అని శ్రీనివాస రావు చెప్పారు. అక్కడి నుంచి అల్వాల్‌లో మరో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా ఆక్సిజన్ లేదన్నారు. అటు నుంచి గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ''గాంధీ ఆసుపత్రికి వెళ్లి చూస్తే అక్కడ క్యూలైన్లో 30 అంబులెన్సులు ఉన్నాయి. వాళ్లందరూ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ దాదాపు మూడున్నర గంటలు ఎదురు చూశాం. ఇక లాభం లేదనుకుని, ఎల్బీ నగర్‌లో వేరే ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ కాసేపు ఎదురు చూశాం. వారు పేషెంట్ కండిషన్ చూసి, ఆమెకు 22 లీటర్ల ఆక్సిజన్ కావాలని, తాము అంత అందించలేమని చెప్పేశారు. అక్కడి నుంచి చైతన్యపురిలో వేరే ఆసుపత్రిలో అడ్మిషన్ దొరికింది. సాయంత్రం ఆరున్నరకు బయల్దేరిన మాకు తెల్లవారుఝామను 4.30కి అడ్మిషన్ దొరికింది'' అని ఆయన చెప్పారు.

తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి తిరిగివస్తోన్న క్రమంలో శ్రీనివాసరావు కారుకు ప్రమాదం జరిగింది. కారు బాగా దెబ్బతిన్నప్పటికీ వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఆయన భార్య లక్ష్మీ కిరణ్‌కి 46 సంవత్సరాలు. ఆ రోజు రాత్రి ఆమెకు చాలా సేపు ఆక్సిజన్ అందకపోవడం ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆమె ఆ ఆక్సిజన్ లోటు నుంచి కోలుకోలేకపోయింది. మే 8న ఉదయం పదిన్నరకు ఆమె కన్నుమూశారు.''ఆసుపత్రి వారు నాకు ఫోన్ చేశారు. కడసారి చూపునకు రమ్మన్నారు. మేం వెళ్లాం. ఆ పరిస్థితుల్లో ఆమెను చూసి నాకేమీ అర్థం కాలేదు. భయం, బాధ, నిస్సహాయత ఆవరించేశాయి. అన్నేళ్లు నాతో ఉన్న భార్య మరణశయ్యపై ఉంది. తను మమ్మల్ని దగ్గరకు తీసుకోవాలనుకుంది. సాధ్యపడలేదు. మా కళ్లముందే…'' అంటూ ఆ నాటి పరిస్థితి వివరించారు శ్రీనివాసరావు.''మేం పన్నులు కడుతున్నాం. వైద్యం కోసం పది లక్షల వరకు ఖర్చు పెట్టాం. పలుకుబడి లేని మామూలు వ్యక్తికి ఆక్సిజన్ అదించలేకపోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. సామాన్యులకు ఆరోగ్యం అందించలేని పరిస్థితి గురించి ఎవరికి చెప్పాలి?'' అని ఆయన ప్రశ్నించారు.

ఆక్సిజన్

కేవలం శ్రీనివాసరావు ఒక్కరే కాదు. కరోనా రెండో వేవ్ సమయంలో దేశంలో ఎందరో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్నారు. కరోనా చికిత్స ఇవ్వగలిగి, శరీరం స్పందించి కూడా కేవలం ఆక్సిజన్ దొరక్క మరణించిన వారు చాలా మంది ఉన్నారని వైద్యులు స్వయంగా బీబీసీకి చెప్పారు.హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ బీబీసీతో తన అనుభవాలు పంచుకున్నారు. ఆయన ఒక స్పెషాలిటీ సర్జన్. ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నందున తన వివరాలు బయటపెట్టవద్దని కోరారు. జనరల్ మెడిసిన్, పల్మనాలజీ రెండూ కాకపోయినా, కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఆయన్ను కూడా డ్యూటీలో వేశారు. ''ఆక్సిజన్ కొరత స్పష్టంగా ఉంది. మీరు ఆక్సిజన్ తెచ్చుకోగలిగితే, మీరు సొంతంగా ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోగలిగితే మిగతా ట్రీట్‌మెంట్ అంతా మేం ఇస్తామని ఎందరికో చెప్పాం. నేను చికిత్స అందించిన వారిలో కూడా ముగ్గురు చనిపోయారు. వారి మరణానికి ఆక్సిజన్ తగినంత అందుబాటులో లేకపోవడం కూడా కారణమే. ఆక్సిజన్ సిలెండర్ దొరికితే ఆసుపత్రికి కూడా రానక్కర్లేదు. ఇంట్లోనే పెట్టుకోండి అని చికిత్స అందించిన సందర్భాలూ ఉన్నాయి'' అంటూ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆ డాక్టర్. ''మౌలాలికి చెందిన ఒక పెద్దాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఆయనకు ఆక్సిజన్ సమస్య వచ్చింది. ప్రైవేటుగా బ్లాక్‌లో ఆక్సిజన్ కొనడానికి కూడా వారి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. వారికి ఆక్సిజన్ అందించలేకపోయారు. ప్రాణం కాపాడలేకపోయాం. ఆ కేసు నాకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించింది'' అని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా పెద్దగా అందుబాటులో లేవు. ఏ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ బెడ్ ఖాళీలేదు. బ్లాక్‌లో కొందామన్నా ప్రైవేటు ఆక్సిజన్ సరఫరాదార్లు స్టాక్ లేదని చెప్పేవారు'' అంటూ చెప్పుకొచ్చారు.కానీ ఆక్సిజన్ తీవ్ర కొరత ఉందని, ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయని తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగా ఒప్పుకోలేదు.

ఆక్సిజన్ కొరత లేదనడం ఆశ్చర్యమే"కరోనా సెకండ్ వేవ్‌లో దేశమంతా ఆక్సిజన్ కొరత ఉందన్నది కాదనలేని వాస్తవం. డబ్ల్యూ‌హెచ్‌ఓ సహా వివిధ దేశాలు కూడా ఈ సమస్య మీద స్పందించాయి. దేశంలో కూడా పారిశ్రామిక సంస్థల నుంచి లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశారు.

తొలుత ఇంత ముప్పు ఊహించకపోవడంతో అనేక చోట్ల సమస్య ఏర్పడింది. పెద్ద సంఖ్యలోనే ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా కేంద్రం మాత్రం ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ మరణించలేదని పార్లమెంట్‌లో చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఆక్సిజన్ సరఫరా కోసం గ్రీన్ చానెళ్ల ఏర్పాటు, చివరకు ఎయిర్ లిఫ్టింగ్ కూడా జరిగిన సంగతిని మరచిపోయారా.. ఒక్క ఆక్సిజన్ సిలెండర్ దొరికితే చాలు అన్నట్టుగా వేచి చూడాల్సిన స్థితిని అనుభవించాం. కానీ ఆ ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటన్నది అర్థం కావడం లేదు" అంటూ కరోనా రోగులకు చికిత్స అందించిన విజయవాడకు చెందిన డాక్టర్ ఎం చంద్రశేఖర్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The center where no one died due to lack of oxygen, and how did the deaths occur at Ruia Hospital?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X