కంగనాకు వై సెక్యూరిటీ: కేంద్రం సంచలనం: పాక్ ఆక్రమిత ముంబై కామెంట్స్.. రౌత్ థ్రెట్
న్యూఢిల్లీః బాలీవుడ్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటి కంగనా రనౌత్. ఇదివరకు కాస్టింగ్ కౌచ్ విషయంలో ముక్కుసూటిగా మాట్లాడారు. స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత.. నెపోటిజంపై కుండబద్దలు కొట్టారు. సుశాంత్‌సింగ్ కేసు దర్యాప్తు, పోలీసుల వైఖరి, మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబై.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తలపిస్తోందందటూ కంగన చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రభుత్వంలో సెగలు పుట్టించాయి.
ముంబైలో నివసించే హక్కు ఆమెకు లేదంటూ శివసేన నాయకులు విరుచుకుపడుతున్నారు. ఆమెను ముంబైలో అడుగు పెట్టనివ్వబోమంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, కంగనా రనౌత్ మధ్య ఓ మినీ యుద్ధమే నడుస్తోంది. మహారాష్ట్రీయులు, ముంబైకర్ల మనోభావాలను కంగనా గాయపరిచారంటూ.. సంజయ్ రౌత్ ఆమెపై ఘాటు విమర్శలు గుప్పించారు. ముంబై మహానగరాన్ని ఆమె కించపరిచారని అన్నారు. కంగనాను హరామ్ఖోర్గా అభివర్ణించారు.
ఆమె క్షమాపణ చెబితే తప్ప
ఆమె క్షమాపణ చెబితే తప్ప.. ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. ముంబైకి వస్తే దాడులు తప్పవనే హెచ్చరికలను సంజయ్ రౌత్ పరోక్షంగా పంపించారు. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కంగనా రనౌత్‌కు ఏకంగా `వై` సెక్యూరిటీ భధ్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వై సెక్యూరిటీ కేటగిరి కింద.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేటాయించిన సాయుధులైన ఇద్దరు భధ్రతా సిబ్బంది అనుక్షణం ఆమె వెంటే ఉంటారు.
అదే సమయంలో- కంగనా రనౌత్
అదే సమయంలో- కంగనా రనౌత్ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కూడా ఆమెకు భద్రత కల్పించింది. హిమాచల్ ప్రదేశ్ వెలుపల కూడా ఆమెకు భద్రత కల్పించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర దాటి బయటికి వెళ్లాల్సిన సమయంలోనూ హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆమెకు భద్రత కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. తన కుమార్తెకు ప్రాణభయం ఉందంటూ కంగనా రనౌత్ తండ్రి ఆదివారం హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ను కలిశారు. భద్రత కల్పించాలంటూ విజ్ఙప్తి చేశారు. ఆ మరుసటి రోజే ఆమెకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది.

అమిత్‌షాకు థ్యాంక్స్
తనకు వై సెక్యూరిటీ కల్పించినట్లు వస్తోన్న వార్తలపై కంగనా రనౌత్ స్పందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఆమె కృతజ్ఙతలు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. అమిత్ షా కావాలనుకుంటే.. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తనను కొద్దిరోజుల తరువాత ముంబైకి వెళ్లమని సూచించే వారని, అలా కాకుండా.. వై సెక్యూరిటీ భధ్రతను కల్పించడం సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. ఓ ఆడపిల్లకు రక్షణ కల్పించాలనే విజ్ఙతను ఆయన ప్రదర్శించారని చెప్పారు. మహిళల ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడేలా చర్యలు తీసుకున్నారని అన్నారు.

9న ముంబైకి కంగనా.
ఈ పరిణామాల మధ్య కంగనా రనౌత్.. బుధవారం ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఉంటున్నారు. తాను రెండు రోజుల్లో ముంబైకి వస్తున్నానంటూ సంజయ్ రౌత్‌కు సవాల్ విసిరారు. ఆమెను అడ్డుకుంటామని, క్షమాపణ చెప్పిన తరువాతే అడుగు పెట్టనిస్తామంటూ సంజయ్ రౌత్ సైతం ప్రతి సవాల్ చేశారు. దీనితో కంగనా రనౌత్..ముంబై రాకపై ఉత్కంఠత నెలకొంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కేంద్రం వై సెక్యూరిటీ కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.