4రోజులపాటు 70 కి.మీలు నడిస్తే రూ.2వేల నోట్ చేతికిచ్చారు
మహోబా: పెద్ద నోట్ల రద్దుతో నకిలీ నోట్లు, నల్లకుబేరులకు చెక్ బెడదామనుకున్న కేంద్రప్రభుత్వ నిర్ణయం సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. దేశంలోని అనేకమంది సామాన్య ప్రజలు నోట్ల మార్పిడి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారుతోంది. విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్‌కు చెలామణిలో ఉన్న నోట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఓ వృద్ధరైతు ఒక్క రూ.2000 నోటును సంపాదించేందుకు ఏకంగా 70 కిలోమీటర్లు కాలికనడకన ప్రయాణం చేశాడు. బుందేల్‌ఖండ్‌కు చెందిన 65 ఏళ్ల బిహారీలాల్ నాలుగు ఎకరాల ఆసామి. అతని వాటర్ పంపు ఇంధనంతో నడిచేది కావడంతో అతనికి డీజిల్ కోసం డబ్బు అవసరమైంది. తన బ్యాంకు ఖాతాలోంచి రూ.20వేలు డ్రా చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు తమ ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు ఉదయం 7గంటలకు నడుచుకుంటూ బయలుదేరాడు.

బ్యాంకుకు వెళ్లి అక్కడ ఉన్న భారీ క్యూలో గంటలకొద్దీ నిలబడ్డా.. అతని వంతు వచ్చేసరికి బ్యాంకులో నగదు అయిపోయింది. దీంతో ఉసూరుమంటూ మళ్లీ నడుచుకుంటూనే ఇంటికొచ్చాడు. ఇలా అతని కష్టాలు ఒక్కరోజుకే పరిమితం కాలేదు. మూడు రోజులపాటు ఉదయాన్నే పది కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు నడుచుకుంటూ వెళ్లడం.. సాయంత్రానికి నిరాశతో మళ్లీ నడుచుకుంటూనే ఇంటిబాట పట్డడం చేశాడు. తన చేతికి ఒక్క నోటు కూడా రాలేదు.
అయినా, తన అవసరం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా నాలుగోరోజూ బ్యాంకుకు వెళ్లాడు. అదృష్టవశాత్తు బ్యాంకులో డబ్బులున్నా.. బిహారీలాల్ అడిగిన రూ.20వేలు ఇచ్చేందుకు అధికారులకు నిబంధనలు అడ్డొచ్చాయి. దీంతో వారు బిహారీలాల్ చేతిలో ఓ రెండువేల రూపాయల నోటును పెట్టి పంపించారు. రూ.2వేల నోటును అతికష్టమ్మీద చిల్లరగా మార్చుకున్న బిహారీలాల్.. వెయ్యి రూపాయలతో మోటారు పంపు కోసం డీజిల్ కొని, పంటకు నీరు పెట్టుకున్నాడు.
ఇది దేశంలోని ఒక్క రైతు బాధే. ఇలాంటి చాలా మంది రైతులే గాక, సామాన్య జనం కూడా పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సామాన్య ప్రజల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే మంచిది.