వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ను కాపాడుకోవాలని బ్రిటన్, ఆక్రమించుకోవాలని రష్యా.. చివరికి ఏం జరిగింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కారకోరం

లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో “మన నిఘా ఏజెన్సీల పాత్రను సమీక్షించాలని, చైనాతో ఉద్రిక్తతలు ముగిసిన తర్వాత దానిని చక్కదిద్దాలని” భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) అమరజీత్ బేడీ అన్నారు.

ఇప్పుడు భారత్, చైనా సైనికులు తలపడిన ఇదే పర్వత శ్రేణుల్లో, మొదటిసారి రెండు ప్రపంచ శక్తులు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ ప్రాంతం గురించి ఇంతకు ముందు బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్‌, రష్యా, ఒక పెద్ద పోరాటాన్ని చూశాయి.

మనిషి ధైర్యం, సామర్థ్యం, తెలివితేటలతో పాటూ, అతడికి అందుబాటులో ఉన్న సైన్స్, ఆధునిక పరికరాలు కూడా గూఢచర్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఈ శాస్త్రీయ అన్వేషణల యుగానికి ముందు ఆప్పట్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది.

అప్పుడు జరిగిన ఆ పోరాటం గురించి తెలుసుకోవాలంటే హిమాలయాల్లో కారాకోరం, హిందూకుష్, పామేర్ పర్వత శ్రేణుల్లోకి వెళ్లాలి. ఈ పోరాటం ఇప్పటికి 200 ఏళ్ల క్రితం జరిగింది.

19వ శతాబ్దం ప్రారంభంలో డాక్టర్ విలియం మూర్ క్రాఫ్ట్ అనే ఒక ఆంగ్లేయ పశువైద్యుడు టిబెట్ చేరుకున్నాడు. అతడికంటే ముందు అదే ప్రాంతం గుండా, 1715లో ఇద్దరు యూరోపియన్ పాస్టర్లు ప్రయాణించారని చెబుతారు. 1808లో బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన డాక్టర్ మూర్, ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికుల కోసం ఉన్నత జాతి గుర్రాలను వెతకాలనుకున్నారు. టిబెట్, దానికి ఉత్తరంగా అలాంటి గుర్రాలు ఉండవచ్చని ఆయనకు అనిపించింది.

హిమాలయాలను దాటి ఈ మంచుతో నిండిన పర్వతాల్లో తన రెండో, లేదా మూడో పర్యటనలో ఉన్న డాక్టర్ మూర్ క్రాఫ్ట్ ఒక టిబెట్ అధికారి ఇంట్లో ఉన్నారు. అయితే, ఆయనకు అక్కడ ప్రతిదీ కొత్తగా కనిపిస్తోంది. కానీ, అక్కడే ఉన్న రెండు యూరోపియన్ జాతి కుక్కలను చూసి ఆయన ఇబ్బందిపడ్డారు. అవి అతడి మిలిటరీ సంకేతాలను గుర్తించడంతో, అవి అక్కడ అంతకు ముందే సైనికుల దగ్గర ఉండేవని ఆయనకు అర్థమైంది. అయితే వారెవరు, ఆ కుక్కలు అక్కడికెలా వచ్చాయి అనే ఆలోచన, ఆయనకు ఏదో ముప్పు ముంచుకొస్తోందని అనిపించింది.

'ద గ్రేట్ గేమ్: ద స్ట్రగుల్ ఫర్ ఎంపైర్ ఇన్ సెంట్రల్ ఏషియా’ పుస్తకం రాసిన పీటర్ హాప్‌కిర్క్ అందులో అప్పటి విషయాలన్నీ రాశారు.

“రష్యా నుంచి ఎవరో అక్కడికి వచ్చారని మూర్ క్రాఫ్ట్‌ అనుకున్నాడు. ఊళ్లో వారిని అడిగితే, మాకు ఆ కుక్కలు ఒక రష్యా వ్యాపారి ఇచ్చాడని చెప్పారు. కానీ, ఆ రష్యా వ్యక్తి వ్యాపారి కాదని, వేరే ఎవరో అని అతడి మనసులో బలంగా అనిపించింది”

ది గ్రేట్ గేమ్

ద గ్రేట్ గేమ్

రష్యా పేరు వినగానే, ఆ దేశం ఎలాగోలా వాయవ్య ప్రాంతం నుంచి దాడులు చేసి భారత్‌ను బ్రిటన్ నుంచి లాక్కోవాలని చూస్తోందనే అనుమానాలు ఆయనకు నిజమేనేమో అనిపించాయి.

ఆ కుక్కతో వచ్చిన రష్యన్ ఎవరు, అతడు ఒంటరిగానే ఉన్నాడా, మూర్ క్రాఫ్ట్ ఆ ప్రాంతానికి నిజంగా గుర్రాల కోసమే వచ్చారా, రష్యా అంత దూరం తమ ఏజెంట్లను ఎందుకు పంపిస్తుంది, బ్రిటన్‌కు అంత కలవరం ఎందుకు? అన్నీ తెలుసుకోవాలంటే ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

రష్యా, బ్రిటన్ సామ్రాజ్యాల తరఫున ఈ పర్వతాల్లో ఒక మిషన్ మొదలయ్యే ముందే, ఏవైనా దాడులు జరగక ముందే వాటిని అడ్డుకోవాలంటే, విలియం మూర్ క్రాఫ్ట్, ఆయనకు కనిపించిన యూరోపియన్ జాతి కుక్క యజమాని లాంటి యువ రష్యా అధికారులు ఇచ్చే సందేశాలు చాలా కీలకం.

ఈ అధికారులు, ఏజెంట్లు తమ జీవితంలో ఎన్నో ఏళ్లపాటు హిమాలయాలు, కారాకోరం, పామేర్ లాంటి పర్వతశ్రేణుల్లో, చుట్టుపక్కల నిర్మానుష్య ప్రాంతాల్లో మారువేషంలో తిరిగేవారు.

“రష్యా, బ్రిటన్ సామ్రాజ్యాల మధ్య ఆసియాలో ఈ సంఘర్షణకు ఆనాటి ఒక బ్రిటిష్ గూఢచారి 'గ్రేట్ గేమ్’ అని పేరు పెట్టాడు. అతడు మధ్య ఆసియాలోని ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ గ్రేట్ గేమ్‌లో తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు” అని పీటర్ హాప్‌కిర్క్ తన పుస్తకంలో రాశాడు. ఆ యువ అధికారి ఎవరో మనకు తర్వాత తెలుస్తుంది.

రష్యాలో తరతరాలుగా మధ్య ఆసియా, అవతల ప్రాంతాల్లో అపార సంపద ఉందనే కథలు వ్యాపించాయి. అది ఒక బలమైన సామ్రాజ్యంగా మారిన తర్వాత, ఆ కథల వెనుక అసలు నిజం తెలుసుకోవడంతోపాటూ, ఆ ప్రాంతంలో వ్యాపార భాగస్వామిగా ఉండాలని కోరుకుంది.

మరోవైపు ఉత్తరాన ఎత్తైన పర్వతాలు ఉన్నప్పటికీ, రష్యా భారత్ వైపు రావడానికి కచ్చితంగా ప్రయత్నిస్తుందని భారత్‌లోని బ్రిటిష్ అధికారులు సందేహించేవారు.

“రాజకీయ ఆధిపత్యం కోసం మొదలైన ఈ రహస్య యుద్ధం మౌంట్ ఎవరెస్ట్ నుంచి మధ్య ఆసియాలోని ఎడారులు, పర్వత శ్రేణుల గుండా తూర్పున చైనా, తుర్కిస్తాన్, టిబెట్ వరకూ వ్యాపించి ఉండేది. ఈ గేమ్‌లో రష్యా లక్ష్యం లండన్. కోల్‌కతాలో ఉన్న బ్రిటిష్ అధికారులు, ఆసియాలో మొహరించిన రష్యా అధికారుల మనసుల్లో ఒకే ఒక విషయం ఉంది. అదే బ్రిటిష్ ఇండియా’’ అని పీటర్ హాప్ కిర్క్ తన పుస్తకంలో చెప్పారు.

టిబెట్

ఈ విశ్లేషణ తర్వాత కథ మరోసారి విలియం మూర్ క్రాఫ్ట్, ఆయన ప్రత్యర్థులైన రష్యా గూడచారుల దగ్గరకు వెళ్తుంది.

టిబెట్‌లో రష్యా సైనికులు ఉన్నారేమోనని విలియం మూర్‌కు సందేహం వచ్చాక, 1825లో తను చనిపోయేవరకూ మధ్య ఆసియాలో రష్యా ఉద్దేశం గురించి ఆయన తన అధికారులకు లేఖలు రాస్తూనే ఉన్నారు.

1819లో మూర్ క్రాఫ్ట్ మధ్య ఆసియా నుంచి బుఖారా వరకూ రెండు వేల మైళ్లు ప్రయాణం చేయడానికి అనుమతి లభించింది. కానీ, ఆ దారిలో ఆయన పట్టుబడితే, రష్యా నుంచి ఏదైనా వ్యతిరేకత వ్యక్తం అయితే, మూర్‌తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బ్రిటన్ ప్రభుత్వం చెప్పవచ్చు.

తర్వాత, మూర్‌కు మరో కష్టం వచ్చిపడింది. బుఖారా వరకూ వెళ్లే దారి అఫ్గానిస్తాన్ గుండా వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ అంతర్యుద్ధం తీవ్రంగా ఉంది.

దాంతో, ఆయన అఫ్గానిస్తాన్ చుట్టూ తిరిగి చైనా, తుర్కిస్తాన్‌ మీదుగా బుఖారా వెళ్లాలని నిర్ణయించాడు. అలా వెళ్లాలంటే ఆయన మొదట లద్దాఖ్‌లో లేహ్ చేరుకోవడం తప్పనిసరి అని హాప్‌కిర్క్ చెప్పారు.

1820 సెప్టెంబర్‌లో లేహ్ చేరుకున్న ఆయన, ఆ ప్రాంతానికి చేరుకున్న మొదటి బ్రిటిషర్ అయ్యాడు. మూర్ అక్కడకు రాగానే, కారాకోరం అవతల యార్‌కంద్‌లో ఉన్న చైనా పాలకులతో సంప్రదింపుల కోసం ప్రయత్నించాడు. కానీ అదంత సులభం కాదని ఆయనకు త్వరగానే తెలిసొచ్చింది.

యార్‌కంద్.. లేహ్ నుంచి 300 మైళ్ల దూరంలో ఉంది. ఆ దారిలో ప్రపంచంలో అత్యంత కఠినమైన పర్వతాలు దాటాలి. దానికి చాలా నెలలు పడుతుంది. అక్కడ కొన్ని తరాలుగా స్థానికులు వ్యాపారాలు చేస్తున్నారు. ఆ దారిపై గుత్తాధిపత్యం సాధించారు. ఈస్టిండియా కంపెనీ అక్కడికి రావడం వారికి అసలు ఇష్టం లేదు.

మూర్ క్రాఫ్ట్ వారిలో కొంతమందిని ఈస్టిండియా కంపెనీ ఏజెంట్లుగా మార్చడానికి ప్రయత్నించాడు. కానీ వారు దానికి ఒప్పుకోలేదు. ఆ దారిలో కంపెనీ ఏజెంట్లు వెళ్లడానికి అనుమతి ఇస్తే తమ సైన్యంతో వస్తామని చైనా ప్రజలను బెదిరించింది.

లేహ్

లేహ్‌లో కూడా రష్యా ఏజెంట్లు

మూర్ క్రాప్ట్ అక్కడ కాసేపు ఉన్నారో, లేదో.. అప్పటివరకూ ఆయనకు ఉన్న అనుమానాలు బలపడ్డాయి. ఆ ప్రాంతంలో అప్పటికే ఒక రష్యా ఏజెంట్ అడుగు పెట్టాడు.

ఆ రష్యా ఏజెంట్ పేరు ఆగా మెహదీ అని మూర్ క్రాఫ్ట్ కు తెలిసింది. నిజానికి అతడు రష్యా స్పెషల్ ఏజెంట్. అతడు సెయింట్ పీటర్స్ బర్గ్(దాదాపు 4500 కిలోమీటర్ల దూరం నుంచి) నుంచి తన పై అధికారుల కోసం కీలక వ్యాపార, రాజకీయ మిషన్‌ను పూర్తి చేయడానికి అక్కడికి చేరుకున్నాడు.

మెహదీ అలియాస్ మహక్తీ రాఫిలోవ్

“ఆగా మెహదీ ఒక మమూలు కూలీలా ఆ ప్రాంతంలో పనులు చేయడం ప్రారంభించాడు. కొన్ని రోజుల్లోనే అతడు మొత్తం ఆసియాలో కశ్మీరీ శాలువాల ప్రముఖ వ్యాపారి అయిపోయాడు. ఆ శాలువాల వ్యాపారం చేస్తూనే సెయింట్ పీటర్స్ బర్గ్ వరకూ చేరుకున్నాడు” అని పీటర్ హాప్‌కిర్క్ ద గ్రేట్ గేమ్‌లో రాసాడు.

మెహిదీ కశ్మీరీ శాలువాలు రష్యా పాలకుడు జార్ అలెగ్జాండర్‌ను ఆకట్టుకున్నాయి. దాంతో ఆయన ఆ వ్యాపారిని కలవాలనుకున్నారు.

తిరిగి వెళ్లి లద్దాఖ్, కశ్మీరీలతో వ్యాపార సంబంధాలు కొనసాగించాలని ఆగా మెహిదీని జార్ అలెగ్జాండర్ ఆదేశించారు. ఆయన అందులో విజయవంతం అయ్యారు. తర్వాత ఆ ప్రాంతంలో రష్యా వస్తువులు కూడా కనిపించడం మొదలైంది.

మెహిదీ మళ్లీ సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్లగానే, జార్ ఆయనకు ఒక బంగారు పతకంతోపాటూ రష్యా పేరు కూడా ఇచ్చారు- అదే మెహక్తీ రఫిలోవ్

మహారాజా రణ్‌జీత్ సింగ్

మహారాజా రణజీత్ సింగ్‌కు రష్యా సందేశం

కానీ తర్వాత ఆగా మెహదీ అలియాస్ మహక్తీ రఫిలోవ్‌ను రష్యా ఒక కొత్త రాజకీయ మిషన్‌పై తిప్పి పంపించింది. ఈసారీ ఆయన లక్ష్యం లద్దాఖ్, కశ్మీర్‌కు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ మహారాజు రణజీత్ సింగ్ సభకు చేరుకోవడం.

“మహారాజా రణజీత్ సింగ్‌తో స్నేహ సంబంధాలు పెంచుకోవాలని ఆయనను ఆదేశించారు. మెహిదీ దగ్గర జార్ లేఖ ఉంది. అందులో రష్యా తరఫున వ్యాపారులతో రణజీత్ సింగ్ వ్యాపారం చేయాలనే కోరికను వెల్లడించారు. రష్యాకు రావాలని ఆయనకు స్వాగతం పలికారు” అని హాప్‌కిర్క్ చెప్పారు.

“బ్రిటిష్ డాక్టర్ మూర్ క్రాఫ్ట్ కు వెంటనే ఆ విషయం తెలిసింది. ఆయన ఆ వివరాలన్నీ 1100 మైళ్ల దూరంలో ఉన్న తన అధికారులకు రాశారు. కానీ ఆగా మెహదీ చనిపోవడంతో ఆ కథ ముగిసిపోతుంది. ఆయన ఎందుకు చనిపోయారో ఇప్పటికీ స్పష్టంగా తెలీదు” అని ద గ్రేట్ గేమ్‌లో రాశారు.

అయితే లండన్లోని తన స్నేహితుడికి లేఖ రాసిన మూర్, రఫిలోవ్ ఇంకొంత కాలం బతికుంటే యూరప్‌లో కొన్ని దేశాలు ఆశ్చర్యపోయేలా ఆసియాలో పరిస్థితి ఉండేదని అన్నారని హాప్‌కిర్క్ చెప్పారు.

ఆగా మెహదీ రష్యా సామ్రాజ్యానికి సేవలు చేశారు. అలాగే ఒక రష్యా ఆర్మీ అధికారి కూడా భారత్, అఫ్గానిస్తాన్ వరకూ చేరుకునే మార్గాలను వెతికే ఆపరేషన్లో భాగం అయ్యారు.

కశ్మీరీ శాలువా

టర్కీ వ్యక్తి వేషంలో ఖైవా వెళ్లిన రష్యా అధికారి

1819లో జార్జియాలోని రష్యా ఆర్మీ ప్రధాన కార్యాలయంలో 24 ఏళ్ల రష్యా సైనికాధికారి నికోలాయ్ మరావీ ఈవ్ ఒక మిషన్ కోసం బయల్దేరాడు. చాలామంది దానిని ఆత్మహత్య చేసుకోవడం లాంటిదేనని అనుకున్నారు.

ఆ మిషన్‌ కోసం ఒక టర్కీ వ్యక్తిలా వేషం మార్చుకున్న మరావీ, తూర్పులో నిర్మానుష్య మైదానాలు, సముద్రాలు దాటి 800 మైళ్ల దూరంలో ఉన్న ఖేవా వరకూ వెళ్లాలి.

దారిలో వచ్చే ఎడారిలో ఎవరైనా అతడిని దోచుకోవచ్చు, బానిసగా బంధించవచ్చు. కానీ, భవిష్యత్తులో రష్యా దాడులకు తగిన పరిస్థితులను సృష్టించడం అతడి లక్ష్యం. తమ బ్రిటిష్ ప్రత్యర్థుల్లాగే ఆయా ప్రాంతాల్లో భౌగోళిక, రక్షణ సామర్థ్యాల గురించి సమాచారం సేకరించి, ఆ ప్రాంతంలో సంపద గురించి వ్యాపించిన కథల వెనుక నిజాలను బయటపెట్టాలనుకున్నాడు.

దీనితోపాటూ బానిసలుగా భారీ సంఖ్యలో అమ్ముడైన రష్యన్లు ఏమయ్యారో కూడా అతడు తెలుసుకోవాలని అనుకున్నాడు.

ఆ సమయంలో ఆయన తన పాలకులకు అందిన సమాచారం మధ్య ఆసియాలోని ముస్లిం పాలకులపై రష్యన్లు భవిష్యత్తులో సైనిక దాడులు చేయడానికి ఉపయోగపడ్డాయి.

'ద గ్రేట్ గేమ్‌’లో విఫలమైనా, ఎవరికైనా పట్టుబడినా తనతో ఎలాంటి సంబంధాలు లేవని రష్యా పాలకులు చెబుతారని ఆయనకు తెలుసు.

బ్రిటిష్ డాక్టర్ విలియం మూర్ ఉత్తర పర్వత శ్రేణుల్లో యాక్టివ్‌గా ఉంటే, కొంతమంది బ్రిటిష్ అధికారులు దక్షిణ అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్‌లో రెక్కీలో బిజీగా ఉన్నారు.

టిబెట్

వేల మైళ్లు ప్రయాణించిన బ్రిటిష్ ఏజెంట్లు

ద గ్రేట్ గేమ్ పుస్తకంలో.. ఐదో బాంబే నెటో ఇన్ఫాంట్రీ కెప్టెన్ చార్ల్స్ క్రిస్టీ, లెఫ్టినెంట్ హెన్రీ పోటింగర్ 1810లో గూఢచర్య మిషన్‌పై మారువేషంలో బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్ మీదుగా ఇరాన్ వెళ్లారు. ఆ ప్రాంతంలో వారు అంతకు ముందెప్పుడూ యూరోపియన్లను చూసుండకపోవడం వారికి కలిసొచ్చింది.

పోటింగర్ బొంబాయి నుంచి వెళ్లిన నాలుగు నెలలకు హెరాత్‌ చేరుకుంటే, ఆయన సహచరుడు పొటింగర్ లక్ష్యానికి 900 మైళ్ల దూరంలో పర్షియాలో ఉన్నాడు. వారు వెళ్లే దారిలో రెండు పెద్ద ఎడారులు ఉన్నాయి. ఆ ప్రయాణానికి వారికి మూడు నెలలు పట్టింది.

పశ్చిమం నుంచి భారత్‌పై దాడులు జరుగుతాయనే భయంతో ఉన్న బ్రిటిష్ పాలకులకు హెరాత్ చాలా కీలకం. ఆ నగరం పశ్చిమం నుంచి భారత్ వచ్చిన విజేతల మార్గంగా నిలిచింది. అక్కడి నుంచి ఏ సైన్యం అయినా ఖైబర్ లేదా బోలాన్ పాస్ ద్వారా భారత్‌లోకి చేరుకోవచ్చు.

పెద్ద ఎడారి, కఠినమైన పర్వతాల మధ్య ఉన్న హెరాత్ నగరం ఒక సారవంతమైన లోయలో ఉంది. అక్కడ ఒక సైన్యం మొత్తానికీ నీళ్లు, ఆహారం అందించవచ్చని చెబుతారు. కానీ, దానిని ధ్రువీకరించడం క్రిస్టీ పని.

క్రిస్టీ బొంబాయి నుంచి బయల్దేరిన నాలుగు నెలల తర్వాత ఆ నగరంలోకి ప్రవేశించాడు. ముస్లిం మత పెద్ద వేషం వదిలి ఒక వ్యాపారిలా మారాడు. గుర్రాలు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తున్నాడు. ఆయన రాసిన పత్రాల్లో అదే ఉంది.

క్రిస్టీ ఒక నెల అక్కడే గడిపాడు. నగరం అంతా నిశితంగా పరిశీలించాడు. హాప్‌కిర్క్ ద గ్రేట్ గేమ్‌లో దాని గురించి రాశాడు. బలూచిస్తాన్ నుంచి వెళ్లాక క్రిస్టీ 2250 మైళ్లు పర్యటించాడు. మరోవైపు పొటింగర్ 2400 మైళ్లకు పైగా ప్రయాణించినట్లు చెప్పాడు.

ఇద్దరూ ప్రయాణిస్తున్న దారిలో వచ్చే ప్రతి గ్రామం, బస్తీల వివరాలు నోట్ చేసుకునేవారు. బావులు, చెరువుల గురించి, సురక్షితంగా అనిపించిన ప్రాంతాల గురించి రాసుకునేవారు. దారిలో తమకు కనిపించిన తెగలు, వారి పరిస్థితుల గురించి కూడా నమోదు చేసుకునేవారు.

నెపోలియన్

భారత్‌పై దాడి చేయాలని నెపోలియన్ ఐడియా

“భారత్‌లోని సంపదపై వ్యామోహం, ఎన్నోసార్లు ఆక్రమణదారులను ఇక్కడికి లాక్కొచ్చింది. ఆ ప్రాంతంలో ప్రజలు చివరికి ఆ దాడులకు అలవాటు పడిపోయేలా చేసింది” అని 'హిమాలయన్ బాటిల్ గ్రౌండ్’ అనే పుస్తకంలో చరిత్రకారుడు రాశాడు.

బ్రిటన్ భారత్‌కు వాయవ్యంగా తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ, సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న సమయంలో అది పశ్చిమ తుర్కిస్తాన్ పాలకుల వైపు వెళ్తూ రష్యా సామ్రాజ్యాన్ని ఎదుర్కుందని రాశారు.

ఈ రెండు బలమైన శక్తులు ఢీకొనకుండా ఆపడం కష్టంగా కనిపిస్తోంది. ఒకరిపై ఇంకొకరికి ఉన్న సందేహాలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి.

“1807లో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ బోనపార్టీ, రష్యా జార్ అలెగ్జాండర్ వన్‌తో కలిసి భారత్‌పై దాడి చేయబోతున్నాడనే సమాచారం అందగానే లండన్‌లో ప్రమాద ఘంటికలు మోగాయి. అయితే ఆ రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆ ప్రణాళిక ముందుకు వెళ్లలేదు” అని హాప్‌కిర్క్ రాశాడు.

టిబెట్

రష్యా మొఘల్ సామ్రాజ్య స్థాపన హామీ

“పీటర్ ద గ్రేట్ మొదటి రష్యా జార్. ఆయన కన్ను భారత్‌పై పడింది. అప్పట్లో మధ్య ఆసియాలో ఆక్సస్ నదికి అవతల భారీ బంగారు నిధి ఉందని ఆయనకు వార్తలు అందేవి. మధ్య ఆసియా రాజ్యాల అవతల భారతదేశంలో అపార సంపద ఉందని ఆయనకు రష్యా యాత్రికలు చెప్పారు” అని ద గ్రేట్ గేమ్ పుస్తకంలో రాశారు.

ఆయన తన కాలంలోనే కాస్పియన్ సముద్రం అవతల సంబంధాలు పెంపొందించాలని ఒక మిషన్ కూడా ప్రారంభించాడు, కానీ అందులో విఫలం అయ్యాడు.

'జార్ పీటర్ ద గ్రేట్’ మరణం తర్వాత కొంతకాలానికి 1725లో రష్యాలో ఒక కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయన చనిపోయే ముందు ఒక వీలునామా రాశారని, తన తర్వాత వచ్చే పాలకుడు రష్యాను ప్రపంచంలో అజేయ శక్తిగా నిలపాలని అందులో కోరాడని చెప్పుకున్నారు.

చరిత్రకారుల అంచనాల ప్రకారం ఆ కలను నిజం చేయడానికి రెండే దారులు ఉన్నాయి. భారత్, కాన్‌స్టాంట్‌నోపుల్(ఇప్పటి ఇస్తాంబుల్)ను తమ అధీనంలోకి తెచ్చుకోవడం.

జార్ వీలునామా ప్రకారం ఆయన తన తర్వాత వచ్చే పాలకులు ఈ రెండింటినీ స్వాధీనం చేసుకోనంతవరకూ రష్యాను బలమైన శక్తిగా నిలపాలనుకునే తన కల నెరవేరదని ఆయన చెప్పారు.

పీటర్ ద గ్రేట్ తర్వాత దాదాపు 40 ఏళ్లకు 'కాథరీన్ ది గ్రేట్’ పాలన మొదలైంది. ఈస్టిండియా కంపెనీ కాలు మోపిన భారత్‌పై ఆమెకు కూడా ఆసక్తి మొదలైంది.

“1791లో తన పాలనాకాలం చివరి నాటికి కేథరీన్ భారత్ మీద ఆసక్తి చూపించారని చెబుతారు. బహుశా ఆమెకు ఒక ఫ్రెంచ్ వ్యక్తి ఆ సలహా ఇచ్చారని భావించారు. బుఖారా, కాబూల్ మార్గంలో ముందుకెళ్లి భారత్‌లో మళ్లీ ముస్లిం సామ్రాజ్యం స్థాపించాలని రష్యా భావించింది. అయితే కేథరీన్ ది గ్రేట్ అలా చేయకుండా ఒక అధికారి ఆమెను అడ్డుకున్నారు” అని ద గ్రేట్ గేమ్ పుస్తకంలో రాశారు.

తర్వాత శతాబ్దంలో భారత్‌పై వరుస దాడులకు రష్యా రూపొందించిన ప్రణాళికలకు అది తొలి అడుగు.

మొఘల్ సామ్రాజ్యం

'ద గ్రేట్ గేమ్' ప్రారంభం

19వ శతాబ్దంలో రష్యా భారత్‌పై దాడి చేసే ప్రమాదం ఉందని ఆంగ్లేయులు బలంగా నమ్మేవారని చరిత్రకారులు చెప్పారు.

“దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రష్యా రోజుకు సగటున 55 చదరపు మైళ్లు నుంచి, ఏడాదికి 20 వేల చదరపు మైళ్లు తూర్పుగా ముందుకొస్తోంది. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి రష్యా, బ్రిటిష్ సామ్రాజ్యం మధ్య రెండు వేల మైళ్ల దూరమే ఉంది. శతాబ్దం చివరికల్లా అది కొన్ని వందల మైళ్లకు తగ్గిపోయింది. పామేర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాటి మధ్య దూరం 20 మైళ్లే ఉంది” అని హాప్‌కిర్క్ రాశాడు.

చరిత్రకారుల వివరాల ప్రకారం “19వ శతాబ్దం మధ్యనాటికి సిల్క్ రూట్‌లోని చారిత్రక నగరాలు ఒక్కొక్కటిగా రష్యా వశం అవుతూ వచ్చాయి. 1865లో తాష్‌కంద్(ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కెంట్) కూడా రష్యా చేజిక్కింది. తర్వాత మూడేళ్లలో సమర్‌కంద్, బుఖారాలు కూడా జార్ సామ్రాజ్యంలో కలిసిపోయాయి”.

ఎత్తైన హిందూకుష్, పామేర్ పర్వతాలు రష్యా దాడుల నుంచి తమను సురక్షితంగా కాపాడుతాయని ఆంగ్లేయులు అనుకున్నారు. కానీ, వారికి అవే అతిపెద్ద సమస్యగా మారాయి.

'హిమాలయన్ బాటిల్ గ్రౌండ్-సీనో ఇండియా రైవల్వరీ ఇన్ లద్దాఖ్’ పుస్తకంలో “ఈ పర్వత శ్రేణుల్లో తిరుగుతున్న బ్రిటిష్ ఏజెంట్లు అంతా బాగానే ఉందని, మన సామ్రాజ్యానికి ఢోకా లేదని పంపిన రిపోర్టులు ఆంగ్లేయ పాలకుల్లో నమ్మకం కలిగించాయి. కఠినమైన పర్వతాల్లో భారత్‌లోకి చొరబడేలా రష్యాకు ఏవైనా దారులు ఉన్నాయేమో అని బ్రిటిష్ ఏజెంట్లు వెతికేవారు” అని రాశారు.

వారిలో ఒకరైన థామస్ గార్డెన్ అనే అధికారి 1873లో ఆమేర్ పర్వత శ్రేణుల్లో ఉన్నారు. “తూర్పు పాకిస్తాన్, లద్దాఖ్ మధ్య ఉన్న ఎత్తైన పర్వతాలు శత్రు సైన్యాలను ఎవరినీ ఆ వైపు రానివ్వవు. కానీ పామేర్, గిల్గిత్, చిత్రాల్ పాస్‌ల గురించి అప్పుడే ఏదీ చెప్పలేం” అని రాశాడు.

సర్ హెన్రీ రాలిసన్ అనే అధికారి కూడా 1876లో ఇలాంటి రిపోర్టే ఇచ్చారు అని హిమాలయన్ బాటిల్ గ్రౌండ్ పుస్తకంలో రాశారు.

“నాకు ఈ మార్గంలో రష్యాతో యుద్ధం వచ్చే ప్రమాదం అస్సలు కనిపించడం లేదు. ఏ సైన్యం అయినా కారకోరం నుంచి పంజాబ్ వరకూ వ్యాపించిన ఈ పర్వత దారుల్లో వచ్చే ప్రయత్నం ఎప్పటికీ చేయదు, అక్కడ 15 నుంచి 19 వేల అడుగుల ఎత్తున్న పర్వతాలు సైన్యాలకు అడ్డుగా ఉన్నాయి” అని చెప్పారు.

భారత్ వాయవ్య ప్రాంతం అత్యంత కఠినమైనది. అందుకే ఈ ప్రాంతంలో రెండు పెద్ద సామ్రాజ్యాలు తలపడే అవకాశాలు చాలా తక్కువ అన్నారు.

కానీ 1885లో రష్యా మధ్య ఆసియాలో దాడులు చేయడంతో, అది కశ్మీర్ మార్గంలో ముందుకు వచ్చి దాడులకు దిగవచ్చని బ్రిటన్ అప్రమత్తమైందని చరిత్రకారులు చెప్పారు.

తర్వాత ఎల్‌గ్రేన్ డురెండ్ 1888లో హంజా నుంచి తిరిగి లాహోర్ వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. తను గిల్గిత్ నుంచి వస్తున్నప్పుడు ఒక రష్యా అధికారి హంజాలో కనిపించాడని స్థానికులు చెబితే విన్నానని చెప్పారు. అతడు చెప్పింది ముమ్మాటికీ నిజం.

ఆ రష్యా అధికారి పేరు కెప్టెన్ గ్రోమిచోస్కీ. అతడు పామేర్ పర్వత శ్రేణులు, తూర్పు తుర్కిస్తాన్ మధ్య తమ సైన్యం కోసం మార్గాలు వెతకడంలో విజయవంతం అయ్యాడు.

గిల్గిత్

డురెండ్ చెప్పిన అసలు ఆట మొదలైంది

హంజా ప్రాంతంలో రష్యా నిఘా అధికారులు గుర్తించిన పర్వత మార్గాల్లో దోపిడి దొంగలు వచ్చేవారు.

రష్యా కెప్టెన్ గ్రోమిచోస్కీ హంజాకి రావడం, అక్కడి పాలకులు ఆయన వల్ల రష్యాకు దగ్గరయ్యే అవకాశం ఉండడంతో బ్రిటన్‌లో కంగారు మొదలైంది. దాంతోపాటూ ఇంకో పెద్ద సమస్య వచ్చిపడింది. హంజాలో ఒక రహస్య పర్వత మార్గం ఉంది. అక్కడి నుంచి లేహ్ యార్‌కంద్ మార్గంలో దాడులు జరిగే అవకాశం ఉంది.

“ఎన్నో ఏళ్ల నుంచీ దోపిడి దొంగలు ఆ రహస్య మార్గం నుంచి వచ్చి లేహ్, యార్‌కంద్ మధ్య వెళ్లే వ్యాపారులను దోచుకునేవారు. మళ్లీ ఆ రహస్య మార్గంలోకి వెళ్లి మాయమైపోయేవారు” అని హాప్‌కిర్క్ తన 'ద గ్రేట్ గేమ్‌’లో రాశారు.

ఇది ఆసియాలో బ్రిటిష్ పాలకులకు షాక్ ఇచ్చింది. వారికి అక్కడ నుంచి జరిగే భారీ వాణిజ్యం అంతం అవుతుందేమో అనిపించింది. భారత్ భద్రత గురించి జాగ్రత్తలు తీసుకునే అధికారులు, దొంగలు ఉపయోగించే ఆ దారిలో రేపు రష్యా సైన్యం కూడా రావచ్చని, తమపై దాడి చేయవచ్చని భావించారు.

కలకత్తాలో బ్రిటన్ పాలకులు ఆ రహస్య మార్గాన్ని గుర్తించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను కెప్టెన్ యంగ్‌హజ్బండ్‌కు అప్పగించారు. అంతకు ముందు చైనా నుంచి భారత్ వరకూ ఒక కొత్తదారిలో 1200 మైళ్ల దూరం ప్రయాణించిన అతడికి అప్పటికే చాలా పేరుంది.

బుఖారా

బ్రిటిష్ సైనికాధికారి రష్యా కెప్టెన్ మ్యాప్‌లో ఏం చూశారు

యంగ్‌హజ్బండ్ 1889 ఆగస్టు 8న కశ్మీరీ, గూర్ఖా జవాన్ల బృందంతో లేహ్ నుంచి కారాకోరం పాస్ ద్వారా చాలా దూరంలో ఉన్న షహీదుల్లా గ్రామం వైపు బయల్దేరాడు.

12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ గ్రామంలో ఎక్కువగా వ్యాపారులే ఉండేవారు. వారు తరచూ లేహ్ యార్‌కంద్ మార్గంలో ప్రయాణించేవారు. అతడు ఆ రహస్య మార్గం(షంషాల్ పాస్) గురించి ఆ వ్యాపారుల దగ్గర వివరాలు రాబట్టాలనుకున్నాడు.

వారు ఆ గ్రామం దగ్గరికి చేరుకోడానికి 15 రోజులు పట్టింది. భారత్, షింగ్యాంగ్ మధ్య వ్యాపారానికి అనుకూలంగా లేని చైనా దోపిడి దొంగల గురించి చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదని వ్యాపారులు వారికి చెప్పారు. దానివల్ల తమ తేయాకు వ్యాపారంపై ప్రభావం పడుతుందని వారు భావించారని తెలిపారు.

గ్రామస్థుల నుంచి షంషాల్ పాస్ వివరాలు తెలుసుకున్న యంగ్‌హజ్బెండ్ ఆ మార్గం గురించి తెలుసుకోడానికి బయల్దేరాడు. 41 రోజుల తర్వాత కఠిన దారుల్లో ప్రయాణించి దొంగల స్థావరం ఉన్న ఒక కోట దగ్గరికి చేరుకున్నాడు. దొంగలు అక్కడ నుంచే రహస్య మార్గం(షంషాల్ పాస్)పై నిఘా పెట్టేవాళ్లు.

ఎవరో చెప్పడం వల్లే ఆ దొగలు లేహ్ యార్‌కంద్ మార్గంలో వెళ్లేవారిని దోచుకునేవారని ఆయనకు ఆ కోటలో ఉన్న వారితో మాట్లాడాక తెలిసింది.

అదే సమయంలో రష్యా కెప్టెన్ గ్రోమిచోస్కీ ఆ ప్రాంతానికి తిరిగొచ్చాడని కెప్టెన్ యంగ్‌హజ్బెండ్‌కు తెలిసింది. అతడిని కలవాలని యంగ్ చాలా ఆసక్తిగా ఉన్నాడు.

కెప్టెన్ యంగ్‌హజ్బెండ్ తర్వాత అతడితో జరిగిన సమావేశం గురించి రాశారు. రష్యా ఆతిథ్యంలో ఆ రోజు రాత్రి మంచి భోజనం చేశానని, ఫుల్‌గా వోడ్కా తాగానని చెప్పాడు.

అక్కడ రష్యా అధికారి తన మ్యాప్‌లో పర్వత శ్రేణుల్లో పామేర్‌లో ఒక దారిని ఎర్రరంగుతో గుర్తించి ఉండడాన్ని బ్రిటిష్ కెప్టెన్ యంగ్‌హజ్బెండ్ చూశాడు. రష్యా, అప్గానిస్తాన్, చైనా, బ్రిటిష్ భారత్ కలిసన దగ్గర నిర్మానుష్య ప్రాంతాల గురించి రష్యాకు బాగా తెలుసనే విషయం అతడికి స్పష్టమైంది.

రష్యా సైన్యంలో అధికారులు, సైనికులు భారత్‌పై ఎప్పుడెప్పుడు దాడికి ఆదేశాలు ఇస్తారా అని ఎదురుచూస్తున్నట్లు గ్రోమిచోస్కీ తనకు స్పష్టంగా చెప్పినట్లు యంగ్ హజ్బెండ్ తన లేఖల్లో రాశాడు.

రెండు బలమైన సామ్రాజ్యాల అధికారులు మంచు కప్పిన ఆ ఎత్తైన పర్వతాలపై తమ ప్రభుత్వాల విధానాలను సమర్థించుకున్నారు. ఒకరి ఉద్దేశాలను మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మాటల్లోనే అవతలి వారి నుంచి వివరాలు రాబట్టాలని చూశారు. మూడు రోజులు కలిసి గడిపిన తర్వాత తమ నిఘా మిషన్‌ కోసం వెళ్లిపోయారు.

కానీ ఈ ఇద్దరి మధ్య అది ఆఖరి భేటీ కాదు. ఏళ్ల తర్వాత యంగ్‌హజ్బెండ్‌కు తన పాత శత్రువు నుంచి లేఖ అందింది.

“గ్రోమిచోస్కీ ఆ లేఖలో తను జనరల్ పదవి వరకూ ఎలా చేరుకున్నది, 1917 విప్లవం తర్వాత అన్నీ లాక్కుని తనను ఎలా సైబీరియాలో జైల్లో పెట్టింది రాశాడు. అక్కడి నుంచి పారిపోయిన అతడు పోలెండ్‌లో తన కుటుంబం దగ్గరికి చేరుకున్నాడు” అని హాప్‌కిర్క్ రాశాడు.

గ్రోమిచోస్కీ ఆ లేఖతోపాటూ తన ఆపరేషన్ల గురించి రాసిన ఒక పుస్తకం కూడా యంగ్‌హజ్బెండ్‌కు పంపించాడు.

రష్యా, బ్రిటన్, చైనా ఆడిన ఈ గ్రేట్ గేమ్‌లో ఎంతోమంది అధికారులు, సైనికులు, ఏజెంట్లు ఉన్నారు. చాలామంది దీనికోసం తమ ప్రాణాలు కూడా కోల్పోయారు.

బుఖారాలో ఇద్దరు బ్రిటిష్ అధికారుల మృతి

కల్నల్ చార్ల్స్ స్టోడార్ట్, కెప్టెన్ ఆర్థర్ కొనోలీ బుఖారాలో చనిపోయారని హాప్‌కిర్క్ ద గ్రేట్ గేమ్‌లో చెప్పాడు. అది 1842లో జరిగింది.

“ఇద్దరు అధికారులు బ్రిటన్‌లో తమ ఇంటికి దాదాపు నాలుగు వేల మైళ్ల దూరంలో ఎన్నో నెలలపాటు స్థానిక పాలకుల బందీగా ఉన్నారు. రెండు సామ్రాజ్యాల మధ్య పోరాటంలో భాగం అయినందుకు మూల్యం చెల్లించుకున్నారు. అందుకే దీనికి 'ద గ్రేట్ గేమ్’ అనే పేరు పెట్టారు.

ఆ రోజుల్లో ఈస్టిండియా కంపెనీ రష్యాకు వ్యతిరేకంగా తమతో జట్టు కట్టమని బుఖారాను అడగడానికి వారిని పంపింది అని చరిత్రకారులు చెప్పారు.

“అదే కల్నల్ చార్ల్స్ స్టోడార్ట్ మొదటిసారి దానికి 'గ్రేట్ గేమ్’ అనే పేరు పెట్టారు. చాలా ఏళ్ల తర్వాత (రుడ్‌యార్డ్) కిప్లింగ్ తన కిమ్ నవలతో దానిని ఫేమస్ చేశాడు” అని హాప్‌కిర్క్ రాశాడు.

'ద గ్రేట్ గేమ్’ ఎలా అంతమైంది

1905 డిసెంబర్‌లో బ్రిటన్‌లో సర్ హెన్రీ కాంప్‌బెల్ బానర్‌మెన్ నేతృత్వంలో కొత్త కేబినెట్ ఏర్పడింది.

“రష్యా, బ్రిటన్ ప్రభుత్వాలు రెండూ ఇప్పుడు ఆసియాపై శాశ్వత పరిష్కారాన్ని కోరుకున్నాయి. దానికోసం ఇటీవల కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాలు చాలా సమయం, చాలా వనరులు ఖర్చు చేస్తూ వచ్చాయి” అని హాప్‌కిర్క్ ద గ్రేట్ గేమ్‌లో చెప్పాడు.

నెలలపాటు నడిచిన ఈ చర్చలు కేవలం మూడు దేశాలు, అంటే టిబెట్, అఫ్గానిస్తాన్, ఇరాన్ కేంద్రంగా జరిగాయి. భారత రక్షణ కోసం ఆ మూడూ చాలా కీలకమైన దేశాలు.

ఎన్నో అభిప్రాయ బేధాలు వచ్చిన తర్వాత చివరికి 1907లో బ్రిటన్ విదేశాంగ మంత్రి సర్ ఎడ్వర్డ్ గ్రే, రష్యా విదేశాంగ మంత్రి కౌంట్ అలెగ్జాండర్ అజోలుస్కీ మధ్య ఒక ఒప్పందం జరిగింది.

“గ్రేట్ గేమ్ శరవేగంగా ముగిసే దిశగా వెళ్లింది. బ్రిటన్ ఇప్పుడు జర్మనీ గురించి కంగారు పడుతోంది” అని హాప్‌కిర్క్ రాశారు.

ఆగస్టు 31న సెయింట్ పీటర్స్ బర్గ్ లో రష్యా-బ్రిటన్ చాలా రహస్యంగా ఒక చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు టిబెట్‌లో జోక్యం చేసుకోవు. దానితోపాటూ ఏ అంశాన్నైనా చైనా ద్వారానే నిర్ణయం తీసుకోవాలని భావించాయి.

“రష్యా అఫ్గానిస్తాన్‌పై బ్రిటన్ అధికారాన్ని అంగీకరించింది. రెండు దేశాలూ అక్కడికి తమ ఏజెంట్లను పంపించకూడదని నిర్ణయించాయి”

“మధ్య ఆసియాలో జార్ పాలనను వ్యతిరేకించబోమని బ్రిటన్ హామీ ఇచ్చింది. ఇరాన్ విషయంలో ఈ నిర్ణయం ప్రకారం దేశ స్వతంత్రంతోపాటూ దాని ఉత్తర, మధ్య భాగాల్లో రష్యా ప్రభావాన్ని అంగీకరించింది. ఇక ఇరాన్‌కు దక్షిణంగా బ్రిటన్ ప్రభావాన్ని రష్యా అంగీకరించింది” అని హాప్‌కిర్క్ రాశాడు.

“రష్యా, బ్రిటన్ మధ్య ఈ ఒప్పందంపై రెండు దేశాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇరాన్, అఫ్గానిస్తాన్ కూడా వాటి సలహాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి” అని చెప్పారు.

చివరికి రష్యా నుంచి దాడుల భయం తొలగిపోయింది. ఇదంతా జరగడానికి దాదాపు ఒక శతాబ్దం పట్టింది. ఆలోపు రెండు వైపులా ఎంతోమంది మెరికల్లాంటి అధికారులు, సైనికులు చనిపోయారు. కానీ, చివరికి ఈ వివాదం దౌత్యం ద్వారా పరిష్కారం అయ్యింది.

“1914లో రష్యా, బ్రిటన్ ఆసియా, ఐరోపాలో జర్మనీ, టర్కీకి వ్యతిరేకంగా యుద్ధంలో ఒక్కటిగా కలిశాయి. కానీ, తర్వాత 1917 అక్టోబర్‌లో రష్యా విప్లవం వచ్చింది. కొత్త ప్రభుత్వం 1907లో కుదుర్చుకున్న ఈ ఒప్పందాలన్నీ రద్దు చేసింది. ఆ తర్వాత 'గ్రేట్ గేమ్’ కొత్త రూపంలో మరోసారి తెరపైకి వచ్చింది” అంటారు హాప్‌కిర్క్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Britain tries to safeguard India while Russia plans to get a hold on India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X