చిన్నారులకు నాజిల్ వ్యాక్సిన్ ఉత్తమం; రానున్న రోజుల్లో బయో టెర్రరిజం ముప్పు : ఎయిమ్స్ డైరెక్టర్
చిన్నారులకు ఇచ్చేందుకు నాజిల్ వ్యాక్సిన్ ఉత్తమమని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 16 వ వార్షికోత్సవం లో పాల్గొన్న ఆయన వ్యాక్సినేషన్ పై పలు సందేహాలకు సమాధానమిచ్చారు.
రానున్న రోజుల్లో బయో టెర్రరిజం ముప్పు పొంచి ఉందని దేశం అందుకు తగ్గట్టు అనేక వైరస్ లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.

చిన్నారులకు వ్యాక్సిన్ లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఎయిమ్స్ డైరెక్టర్
చిన్నారులకు ముక్కు ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్లు ఇవ్వడం సులభంగా ఉంటుందని, కరోనా లక్షణాలు చిన్నారుల్లో తక్కువగా ఉంటాయని, కానీ వారి ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని, అందువల్ల వారికి కూడా కొవిడ్-19 వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎయిడ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరముందన్నారు.

చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ లు ఆమోదం పొందలేదు .. కొనసాగుతున్న ప్రయోగాలు
చిన్నారులపై ఇప్పటివరకూ కోవిడ్-19 వ్యాక్సిన్ల ప్రయోగం చేయలేదని, చిన్న పిల్లలకు టీకాలు ఆమోదించబడలేదని పేర్కొన్న ఆయన ప్రస్తుతం పిల్లలకు వ్యాక్సిన్ ల పై ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ యొక్క నాజిల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ కోసం నిపుణుల ప్యానెల్ సిఫార్సు చేసిందన్నారు.
పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం ప్రారంభిస్తే, వారికి కరోనా సంక్రమించే అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వారు ఈ వ్యాధిని ఇంటికి తీసుకెళ్ళి వారి తల్లిదండ్రులకు లేదా ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.

స్ప్రే రూపంలో భారత్ బయోటెక్ నాజిల్ వ్యాక్సిన్ .. ఆమోదం పొందితే ఇవ్వొచ్చు
పిల్లలకు టీకాలు తరువాత రావచ్చు కానీ ప్రస్తుతం భారత్ బయోటెక్ నాసికా వ్యాక్సిన్ ఆమోదం కోసం ప్రయత్నిస్తోందన్నారు . ఇది స్ప్రే రూపంలో ఉంటుంది కాబట్టి ఇవ్వడం సులభం అంటూ పేర్కొన్నారు. నాజిల్ వ్యాక్సిన్ ద్వారా అరగంటలో మొత్తం తరగతికి టీకాలు వేయవచ్చు. కాబట్టి, ఆ (నాసికా వ్యాక్సిన్) ఆమోదించబడితే కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మరింత సులభం అవుతుంది, "అని ఆయన అన్నారు.
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడిన ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాక్సినేషన్ పై ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

రానున్న రోజుల్లో బయో టెర్రరిజం ముప్పు.. అప్రమత్తంగా ఉండటం అవసరం
ఏవైనా సందేహాలు ఉంటే వైద్యాదికారులతో అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో బయో టెర్రరిజం ముప్పు పొంచి ఉందని భారత్ వంటి దేశాలు ఇటువంటి వైరస్ లను ఎదుర్కొనేందుకు దీటుగా సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు.
ఇక కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వ్యక్తులు ఆ తర్వాత నాలుగైదు వారాల తర్వాత టీకాలు వేయించుకోవాలన్నారు . అనారోగ్య సమస్యలు , మందులు వాడుతున్న వారు తమ అనారోగ్యం గురించి తప్పక వైద్యులకు చెప్పాకే వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు .