Sudha Bharadwaj: 35 మంది కోసం కట్టిన బ్యారక్‌లో 75 మందితో జైలు జీవితం
ముంబై: సుధా భరద్వాజ్.. సామాజిక ఉద్యమకర్తలకు పరిచయం అక్కర్లేని పేరు. భీమా-కోరేగావ్ కేసులో అరెస్ట్ అయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఆమె కారాగారశిక్షను అనుభవించారు. కొద్దిరోజుల కిందటే బెయిల్‌పై విడుదల అయ్యారు. పుణెలోని ఎరవాడ జైలులో ఎక్కువ కాలం జైలు జీవితాన్ని గడిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో పోలీసులు సుధా భరద్వాజ్, వరవర రావు, స్టాన్ స్వామి మరికొందరిని అరెస్ట్ చేశారు. స్టాన్ స్వామి మరణించారు.

బెయిల్‌పై విడుదల..
మూడేళ్ల కారాగార శిక్షను అనుభవించిన తరువాత సుధా భరద్వాజ్ బెయిల్‌పై విడుదల అయ్యారు. ముంబైని విడిచి వెళ్లకూడదంటూ న్యాయస్థానం ఆమెకు షరతును విధించింది. దీనితో ఆమె ముంబైలో గడుపుతున్నారు. ఈ సందర్భంగా బీబీసీ ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జైలు జీవితం గురించి వివరించారు. తాను ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్నీ వెల్లడించారు. 2018 అక్టోబర్ 28వ తేదీన పోలీసులు తనను అరెస్ట్ చేశారని, ఫోన్, ల్యాప్‌టాప్, కొన్ని సీడీలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

చపాతీలు, పప్పు..
జైలు సిబ్బంది ప్రతి రోజూ రెండు చపాతీలు, పప్పును ఆహారంగా ఇచ్చేవారని సుధా భరద్వాజ్ పేర్కొన్నారు. అదనంగా ఆహారాన్ని తీసుకోవాలనుకుంటే.. దానికి జైలు క్యాంటీన్లో కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఖైదీల కోసం వారి కుటుంబ సభ్యులు ప్రతి నెలా గరిష్ఠంగా 4,500 రూపాయల వరకు జైలు అకౌంట్లో డిపాజిట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. అగరబత్తీలు, డోర్ మ్యాట్స్‌ను ఖైదీలు తయారు చేసే వారని, ఆవరణలో కూరగాయలను పండించే వారని వివరించారు.

35 మంది కోసం కట్టిన బ్యారక్‌లో..
ఎరవాడ తరువాత తనను ముంబైలోని బైకుల్లా కారాగారానికి తరలించినట్లు సుధా భరద్వాజ్ చెప్పారు. యరవాడతో పోల్చుకుంటే.. బైకుల్లా జైలులో ఖైదీల సంఖ్య అధికంగా ఉండేదని పేర్కొన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలు పెద్ద సంఖ్యలో ఉండేవారని చెప్పుకొచ్చారు. ఒకదశలో తనతో పాటు విమెన్స్ బ్యారక్‌లో 75 మంది ఉండేవారని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఈ విమెన్స్ వింగ్‌ను 35 మంది కోసమే కట్టారని, అలాంటి చోట 75 మందిని ఉంచారని అన్నారు.

సెక్స్ వర్క్..
సెకెండ్ వేవ్ సమయంలో తనతో పాటు జైలు ఉన్న 55 మంది మహిళా ఖైదీల్లో 13 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని సుధా భరద్వాజ్ చెప్పుకొచ్చారు. జైలు అధికారులు బ్యారక్‌లోనే క్వారంటైన్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. ఆ సమయంలో తాను కూడా జ్వరం, డయేరియాతో బాధపడ్డానని చెప్పారు. మనుషులు, అవయవాల అక్రమ రవాణా, సెక్స్ వర్క్ వంటి కేసుల్లో అరెస్టయిన ఖైదీలు బైకుల్లా కారాగారంలో పెద్ద సంఖ్యలో కనిపించారని అన్నారు.

డిఫాల్ట్ బెయిల్ మంజూరు..
అమెరికాలోని మస్సాచుసెట్స్‌లో జన్మించారు సుధా భరద్వాజ్. తల్లిదండ్రులతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో దళితులు, గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. గతంలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పలుమార్లు విచారణకు వచ్చినా న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. 2018 భీమా కోరేగావ్ హింస కేసులో సుధా భరద్వాజ్‌తో పాటు వరవరరావు, సోమసేన్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరా అరెస్టయ్యారు.