తమిళనాడు కొత్త గవర్నర్ గా మహిళ !
చెన్నై: తమిళనాడు గవర్నర్ గా ఒక మహిళను నియమించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిసింది. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కొత్త గవర్నర్ నియామకంపై తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తమిళనాడుకు ఒక మహిళను గవర్నర్ గా నియమించాలని కేంద్రం ఆలోచించడంతో ఆనందిబెన్, నజ్మా హెఫ్తుల్లా పేర్లు తెరమీదకు వచ్చాయి. తమిళనాడు గవర్నర్ గా నియమించడానికి ఆనంది బెన్, నజ్మా హెఫ్తుల్లా పేర్లు తెరమీదకు రావడంతో రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ఆగస్టు 31వ తేదితో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవి కాలం ముగిసింది. తరువాత రోశయ్యను మళ్లీ కొనసాగిస్తారని, కొత్తవారిని నియమిస్తారని వార్తలు వినిపించాయి. కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శంకరమూర్తి పేరు తెర మీదకు వచ్చింది.
అయితే ఇరు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల పంపిణి విషయంలో వివాదం తీవ్రస్థాయిలో ముదరడంతో శంకరమూర్తిని నియమిస్తే సమస్యలు ఎదురౌతాయని కొందరు బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. తరువాత ఆయన పేరు తెరమరుగైయ్యింది.

తరువాత మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావును ఇన్ చార్జ్ గవర్నర్ గా నియమించారు.
సెప్టెంబర్ లో విద్యాసాగర్ రావు చెన్నై చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 22వ తేదిన తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం విద్యాసాగర్ రావు తమిళనాడుకు కీలకం అయ్యారు. తమిళనాడు ప్రభుత్వ పాలన స్థంభించిందని ప్రతిపక్షాలు ఆరోపించడం, కొత్త గవర్నర్ ను నియమించాలని డిమాండ్లు మొదలవ్వడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ ను నియమించాలని నిర్ణయించింది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెఫ్తుల్లా పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇప్పటికే మణిపూర్ గవర్నర్ గా ఉన్న నజ్మా హెఫ్తుల్లాను తమిళనాడుకు బదిలి చేస్తారని వార్తలు వస్తున్నాయి.
అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ ను తమిళనాడు గవర్నర్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం పెద్దలు అంటున్నారు. మొత్తం మీద తమిళనాడుకు సమర్థవంతమైన మహిళా గవర్నర్ ను నియమించాలని కేంద్రం ఓ నిర్ణయం తీసుకుందని సమాచారం.