నాడు వాజ్‌పేయ్- నేడు సోనియా-మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేసిన ఇద్దరు..
దేశం ఎదుర్కొంటున్న ఓ కీలక సమస్యపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రానికి ఓ అరుదైన సూచన చేశారు. అధికారపక్షంపై సహజంగా ఇతరత్రా విమర్శలతో విరుచుకుపడే విపక్ష కాంగ్రెస్‌కు నేతృత్వం వహిస్తున్న సోనియా నేరుగా ప్రధాని మోడీకే చేసిన ఆ సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ కూడా మరో సందర్భంలో తన పార్టీకే చెందిన అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి ఇదే విధమైన సూచన చేశారు. దీంతో వాజ్‌పేయ్‌ని మరిపిస్తూ సోనియా చేసిన సూచనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అప్పుడు వాజ్‌పేయ్- ఇప్పుడు సోనియా
రాజనీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్ రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నోటి వెంట వచ్చే ప్రతీ మాటకు అంతరార్ధం ఉండేదని అప్పట్లో చెప్పుకునే వారు. సుదీర్ఘ కాలం విపక్ష నేతగా ఉన్నప్పటికీ అధికార పక్షంపై రాజకీయ విమర్శలకు ఆయన దూరంగా ఉండేవారు. విధాన పరంగానే విమర్శలు చేసేవారు. అయితే 2000 సంవత్సరంలో గుజరాత్‌తో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి ఆయన అప్పట్లో సీఎంగా ఉన్న ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీకి ఓ సూచన చేశారు. సరిగ్గా ఇది జరిగిన 21 ఏళ్లకు ఇప్పుడు విపక్ష కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ కూడా అదే సూచన చేశారు. సందర్భాలు మారాయి, సమస్యలు మారాయి కానీ ఇద్దరు చేసిన కామెంట్ మాత్రం ఒక్కటే.

మోడీకి రాజధర్మం గుర్తు చేసిన వాజ్‌పేయ్
2000 సంవత్సరంలో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబుపేలుడు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. విపక్షాలు, మీడియా అన్నీ ఏకమై ఆయన ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రోత్సహించారని ఆధారాలతో సహా ఆరోపణలు చేశాయి. ఆ ఆరోపణలు తర్వాత నిజం కాదని తేలాయి. కానీ అప్పట్లో ఇలా తీవ్ర విమర్శలకు కేంద్ర బిందువుగా మారిపోయిన మోడీని ప్రధానిగా ఉన్న వాజ్‌పేయ్ కూడా వెనకేసుకు రాలేదు. రాజధర్మం పాటించాలంటూ మోడీకి సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. దీంతో అప్పట్లో వాజ్‌పేయ్ కామెంట్స్ విపక్షాలకు కూడా బలంగా మారాయి.

మోడీకి రాజధర్మం గుర్తు చేసిన సోనియా
ప్రస్తుతం దేశంలో విచ్చలవిడిగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరల తగ్గింపు విషయంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిన్న విమర్శలు చేశారు. ఇదే క్రమంలో ఆమె మోడీకి రాజధర్మాన్ని కూడా గుర్తు చేశారు. యూపీఏ హయాంతో పోలిస్తే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సగానికి తగ్గినా దేశీయంగా పెట్రో ధరలు తగ్గించకపోవడం దోపిడీ కిందకే వస్తుందని ఆరోపించారు. ప్రజల కష్టాలతో లాభాలు దండుకుంటారా అని మోడీని సోనియా ప్రశ్నించారు. రాజధర్మాన్ని పాటించి ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ద్వారా పెట్రో ధరలు తగ్గించాలని మోడీని కోరారు.

రాజధర్మంపై మోడీ మాత్రం
గతంలో గోద్రా అల్లర్ల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ సారధిగా ఉంటూ రాజధర్మం పాటించడం లేదని వాజ్‌పేయ్‌తో అక్షింతలు వేయించుకున్నా, ఇప్పుడు పెట్రో ధరల పెంపును పట్టించుకోకుండా రాజధర్మం ఉల్లంఘిస్తున్నారంటూ సోనియాతో విమర్శలు ఎదుర్కొన్నా ప్రధాని మోడీ మాత్రం వీటిపై స్పందించేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అప్పట్లో వాజ్‌పేయ్ రాజధర్మం వ్యాఖ్యలపైనా ఇప్పటివరకూ మాట్లాడదని మోడీ ఇప్పుడు సోనియా సూచనపైనా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా పెట్రో ధరల పెరుగుదల నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం తగ్గీంచేందుకు మోడీ సర్కారుకు ఏమాత్రం ఆసక్తి లేదని తెలుస్తోంది.