దేశంలో మతపరమైన వివక్ష ఎవరిపైనా లేదు : అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మోడీ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఎవరిపైనా మతపరమైన వివక్ష లేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు . అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మినీ ఇండియా అని , ఈ యూనివర్సిటీ దేశానికే ఆదర్శం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మతంతో సంబంధం లేకుండా, వారి రాజ్యాంగ హక్కులు మరియు వారి భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వగల మార్గంలో దేశం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
మత సైద్ధాంతిక పరమైన అంశాలను పక్కనపెట్టి దేశాభివృద్ధికి అందరం కలిసి కృషి చెయ్యాలన్నారు మోడీ .

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగించిన పిఎం మోడీ
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగించిన పిఎం మోడీ, పేదల కోసం తమ ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు ఎటువంటి మతపరమైన పక్షపాతం లేకుండా చేరుతున్నాయని వ్యాఖ్యానించారు. దేశం యొక్క పురోగతి మరియు అభివృద్ధి విషయానికి వస్తే, సైద్ధాంతిక వ్యత్యాసాలను పక్కన పెట్టడం చాలా ముఖ్యం అని ఆయన బలంగా చెప్పారు. దేశం ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా అభివృద్ధి ప్రయోజనాలను పొందే మార్గం వైపు పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

దేశంలో మతాలకతీతంగా ప్రతి వ్యక్తి సమాన అవకాశాలు పొందుతున్నారన్న మోడీ
దేశంలో మతాలకతీతంగా ప్రతి వ్యక్తి సమాన అవకాశాలు పొందుతున్నారని, సమాన గౌరవం పొందుతూ తమ కలల్ని నిజం చేసుకున్నారంటూ ప్రధాని పేర్కొన్నారు. మతం కారణంగా ఎవరూ వెనుకబడని విధంగా భారత దేశం ముందుకు వెళుతుందన్నారు. మనం ఏ మతంలో జన్మించినా, మన ఆకాంక్షలను జాతీయ లక్ష్యాలతో ఎలా మిళితం చేయాలో చూడటం ముఖ్యం అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. సమాజంలో సైద్ధాంతిక విభజనలు ఉండవచ్చు కానీ దేశ అభివృద్ధి విషయానికి వస్తే మిగతావన్నీ ద్వితీయమైనవని పేర్కొన్నారు.

సైద్ధాంతిక విబేధాలున్నా దేశ ప్రగతి కోసం అంతా కలిసి పని చెయ్యాలి
దేశం విషయానికి వస్తే, సైద్ధాంతిక భేదాల గురించి ఎటువంటి ప్రశ్న లేదని చెప్పారు. అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులను దేశానికి అందించిన కారణంగా ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఈ యూనివర్సిటీ నుంచి స్వాతంత్రం కోసం పనిచేసిన వారికి సైద్ధాంతిక భేదాలు ఉన్నాయి, కాని వారు దానిని స్వేచ్ఛ కోసం పక్కన పెట్టారు. స్వేచ్ఛ వారిని దేశం కోసం ఐక్యపరచినట్లుగా పేర్కొన్నారు.

దేశాభివృద్ధిపై మతాలకు అతీతంగా దృష్టి సారించాల్సిన సమయం
అలాగే ఇప్పుడు మనమందరం కూడా కలిసికట్టుగా కొత్త భారతదేశం కోసం సైద్ధాంతిక విభేదాలు పక్కన పెట్టి పని చేయాలన్నారు. రాజకీయ విధానం ద్వారా దేశ ప్రగతిని చూడరాదని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. భారతదేశంపై దృష్టి సారించినప్పుడు, అటువంటి సైద్ధాంతిక విభేదాలపై దృష్టి తగ్గుతుందని మోడీ చెప్పారు. రాజకీయాలు , సమాజం వేచి ఉంటాయి కానీ దేశ అభివృద్ధి వేచి ఉండదు. కాబట్టి దేశ అభివృద్ధి పై దృష్టి సారించాల్సిన సమయమని ప్రధాని నరేంద్ర మోడీ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.