• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ స్వామీజీలందరూ.. తేడాసింగ్ లే! వేషాలే వేరు.. మోసాలు ఒకటే!

By Ramesh Babu
|
  Baba Halchal : Don't Trust Fake Babas

  న్యూఢిల్లీ: నిజానికి స్వామీజీ అంటే సర్వసంగ పరిత్యాగి అని అర్థం. అంటే సర్వ సుఖాలు వదిలి, దేవుళ్లను కొలుస్తూ నలుగురిని సక్రమమైన మార్గంలో నడిపేవారు. అలాంటి వీళ్లకు కోటాను కోట్ల ఆస్తులు, ఏసీ కార్లు, బంగళాలు ఎందుకు? వాళ్లను దర్శించుకోవటానికి ఒక రేటు, వాళ్ల పాదాలు తాకటానికి ఇంకో రేటు. మరి వీళ్లేమైనా సమాజ సేవ చేస్తారా? అంటే.. అబ్బే అదేం ఉండదు. వాళ్లకు తెలిసిందల్లా కాషాయం కట్టడం.. మోసం చెయ్యడం.. అంతే!

  ఈ బాబాలు చేసేవి మహిమలు కాదని, వట్టి మ్యాజిక్కు మాత్రమేనని జనవిజ్ఞాన వేదిక, ప్రజా సంఘాలు నెత్తీ నోరు కొట్టుకుని చెప్పినా, రుజువులు చూపించినా కూడా మన జనం మారనే మారరు. మన దేశంలో జనం ఇలా మూఢనమ్మకాలతో కొట్టుకుచస్తున్నారు కాబట్టే రోజుకో బాబా పుట్టుకొస్తూనే ఉన్నాడు.

  ఈ బాబాల్లో ఇప్పటికి దొరికిన దొంగలు కొందరే.. దొరకని వాళ్లు ఇంకా ఎందరో! అయితే ఎవరికీ హాని చేయకుండా, ఎవరినీ మోసం చేయకుండా.. అందరికి మంచి చేసే బాబాలు కొందరు ఉండొచ్చుగాక! వారికి తెలిసిన ఆరోగ్య సూత్రాలు, రామాయణం, బాగవతం భోదిస్తుండొచ్చుగాక! ఇప్పటికైతే దొరికిన దొంగల గురించి, వాళ్ల పాపాల చిట్టా గురించి ఒకసారి చూద్దాం!

  గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌...

  గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌...

  గుర్మీత్ సింగ్ ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి భూస్వామి. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. గుర్మీత్‌ 7 సంవతర్సాల వయసులో పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమంలో చేరాడు. 1990లో ఆశ్ర‌మ బాధ్య‌త‌లు స్వీక‌రించాడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. ఆయ‌న భార్య హర్జీత్ కౌర్.. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు.

  2002లోనే బాబా గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు ఇతడ్ని దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25, 2017న తీర్పునిచ్చింది. ఈ బాబా లీల‌లు మాటల్లో చెప్పేకంటే సినిమాగా తీస్తే పెద్ద హిట్టవుతుంది. త‌న శిష్యుల్లో దాదాపు 90% మందిపై హ‌త్యాచారానికి పాల్పడిన‌ట్లు స్వయంగా బాబా బాడీగార్డు బియాంత్ సింగ్ వెల్లడించాడు. హ‌త్య‌ చేసి న‌దిలో ప‌డేయ‌డం, గుట్టుచప్పుడు కాకుండా ఆశ్ర‌మంలోనే కాల్చేయ‌డం అక్క‌డ కామ‌న్‌. 700 ఎకరాల సువిశాలమైన డేరా హెడ్ క్వార్ట‌ర్స్ లో పితాజి గుఫాను నిర్మించుకుని అక్క‌డే తన రాసలీలు కొన‌సాగించేవాడ‌ట‌. ఈయన గుఫాలోకి మ‌గ‌వాళ్ల‌కు అనుమ‌తి ఉండదట. కేవ‌లం మహిళా భక్తులు మాత్రమే అదీ రొటేషన్ పద్ధతిలో ఆయన రహస్య మందిరంలోకి వెళ్లేవారట. 200 మందికి పైగా ఉన్న ఈ మహిళా భక్తుల జాడ ఆ తర్వాత తెలియకుండా పోయిందట‌.

  పితాజీ మాఫీ... అంటే అస‌లు అర్థం పితాజీ నిన్ను క్ష‌మించాడు అని. కానీ.. మ‌నోడు కొంచెం తేడా క‌దా.. పితాజీ మాఫీ అనే మాటకు అక్క‌డి వాళ్ల‌కు మరో కొత్త అర్ధాన్ని అల‌వాటు చేశాడు. మ‌నోడి ఆశ్ర‌మంలో మాత్రం పితాజీ మాఫీ అంటే క్ష‌మించ‌డం అనే అర్థం కాదు. మ‌రేంటి? అంటే.. రేప్ చేయ‌డం. మ‌హిళ‌ల‌ను లైంగికంగా లొంగదీసుకునేందుకు తాను దేవుడి అవ‌తార‌మ‌ని.. దైవాంశ‌ సంభూతుడినంటూ గుర్మీత్ వాళ్ల‌కు చెబుతాడ‌ట‌. ఆయ‌న ఆశ్ర‌మంలోకి కొత్త‌గా వ‌చ్చిన మ‌హిళా భ‌క్తురాలిని పాత భ‌క్తురాళ్లు అడిగే ప్ర‌శ్న ‘పితాజీ మాఫీ అయ్యిందా' అని... అంటే అక్క‌డ మ‌నోడి మాఫీ ఎంత‌గా పాపుల‌రో అర్థం చేసుకోవ‌చ్చు.

  మ‌నోడి క‌న్ను ప‌డ్డ భూమి త‌న సొంతం చేసుకునేందు ఎంత‌కైనా తెగించేవాడ‌ట‌.. 20 ల‌క్ష‌ల విలువైన భూమికి మన డేరా బాబా ఇచ్చేది 1 నుండి 2 ల‌క్ష‌ల రూపాయ‌లేన‌ట‌.. మ‌నోడికి ముందు చూపు చాలా ఎక్కువేనండోయ్‌... తీర్పు విషయంలో తేడా వస్తే మాత్రం హింసను ప్రేరేపించమని, రెచ్చిపొమ్మని తన అనుచరులను పురమాయించి, అల్లర్లు చేయ‌డానికి రోజుకు రూ.1000 ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు ఈ గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా.

  స్వామి నిత్యానంద...

  స్వామి నిత్యానంద...

  తమిళనాడులోని తిరుణ్ణామలైకు చెందిన స్వామి నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. తన దగ్గరకు వచ్చే భక్తురాళ్లకు మాయ మాటలు చెప్పి లొంగ దీసుకునేవాడు. ఎవరైనా లొంగకపోతే బలవంతంగా అత్యాచారం చేసేవాడు. స్వామి ప్రియ శిష్యుడు అయిన డ్రైవర్ లెనిన్ ఈయన బండారం బయటపెట్టాడు. నిత్యానంద ఒక స్త్రీలోలుడని, భక్తి పేరుతో తన వద్దకొచ్చే భక్తురాళ్లతో తన కామవాంచ తీర్చుకునే వాడని తెలిపాడు. సినీ నటి రంజితతో లైంగిక కార్యకలాపాలు నెరుపుతూ ఉన్న రాసలీల వీడియో బయట పెట్టింది కూడా లెనినే. ఈ క్రమంలో పోలీసులు స్వామి నిత్యానందపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిత్యానంద బెంగుళూరు శివారులోని రాంనగర్ కోర్టులో లొంగిపోయాడు. తరువాత రిమాండ్ కి తరలించడం, ఓ ఎన్నారై అత్యచారం కేసు పెట్టడం, పురుషత్వ పరీక్షలు చేయడం అందరికీ తెలిసిందే. నిత్యం ఆనందంలో మునిగితేలే ఈ నిత్యానంద స్వామి తనను తాను రక్త బీజాసుర దేవుడిగా, హిందువుల అవతార పురుషుడిగా అభివర్ణించుకుంటూ ఉంటాడు. పాపం ఈయనకు చేసిన పురుషత్వ పరీక్షలో కూడా ఫలితం ఈయనకే వ్యతిరేకంగానే వచ్చింది.

  బాబా రాంపాల్...

  బాబా రాంపాల్...

  1951, సెప్టెంబర్ 1న ఓ ధనాన అనే మారుమూల గ్రామంలో రాంపాల్ జన్మించారు. వీరిది ఓ సాధారణ రైతు కటుంబం. 1995 వరకు హర్యానా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీరుగా పనిచేశాడు. ఆ తరువాత కొంతకాలానికి బాబాగా అవతారమెత్తాడు. సత్య లోక్ అనే ఆశ్రమం స్థాపించాడు. ఈయనకు ప్రైవేట్ ఆర్మీ కూడా ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఈయన పూర్తి వ్యతిరేకం. వారిని పూజించకూడదని భక్తులకు చెప్పే రాంపాల్.. కవి కబీర్‌ను దేవుడిగా అభివర్ణించేవారు. తనను తాను కబీర్ అవతారంగా చెప్పుకొనేవారు. ఆయన రోజూ పాలతోనే స్నానం చేసేవారని.. ఆ పాలతో పాయసం తయారుచేసి భక్తులకు పంచేవారని స్థానికులు చెబుతుంటారు. సద్గురు రాంపాల్ జీ మహరాజ్‌గా చెలామణి అయ్యే రాంపాల్.. వంద కోట్ల ఆస్తులను కూడగట్టారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఒక దశలో రాంపాల్‌కు చెందిన ప్రైవేటు ఆర్మీ పోలీసులపైనే కాల్పులకు తెగబడింది. చివరకు పోలీసులు బాబా రాంపాల్ ను అరెస్ట్ చేశారు. భక్తులనుద్దేశించి ప్రసంగించేటప్పుడు రాంపాల్ కూర్చునే పీఠం కింద ఒక సొరంగం ఉంది. సత్యలోక్ ఆశ్రమంలో పెద్ద సంఖ్యలో అల్మారాలు ఉన్నాయి. వాటిని తెరిచిచూసిన పోలీసులు వాటిలో భారీసంఖ్యలో ఆయుధాలు దర్శనమివ్వడంతో బిత్తరపోయారు. ఈ రెండు అల్మారాల్లో 32 రివాల్వర్లు, 315 రైఫిల్స్, 12 పెద్ద తుపాకులు దొరికాయి. దీంతో మిగతా అల్మారాల్లోనూ భారీ సంఖ్యలో ఆయుధాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆశ్రమంలో రాంపాల్ ఉపయోగించే సిమ్మింగ్‌పూల్, మసాజ్ పరుపులు, ఫ్లాట్‌స్క్రీన్ టీవీలు, అధునాతన జిమ్, భారీ ఎయిర్ కండిషనర్లు వంటి విలాసాలు ఎన్నో ఇప్పటికే వెలుగుచూశాయి. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో మరి.

  ఆశారాం బాపు...

  ఆశారాం బాపు...

  అహ్మదాబాద్ లోని సబర్మతీ నది తీరాన యోగా, ఆథ్యాత్మికతకు పేరుగాంచింది ఆశారాం బాపు ఆశ్రమం. ఈ స్వామీజి దగ్గరకు వచ్చిన భక్తులకు పురాణా, ఇతిహాసాల గురించిన ప్రవచనాలు చెప్పడంలో దిట్ట. ఆ ఆశ్రమంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోవటంతో పోలీసులు కేస్ ఫైల్ చేశారు. 4 జూలై 2008వ తేదీన కనిపించకుండా పోయిన విద్యార్థులు జూలై 5 తేదీన శవాలై కనిపించారు. ఈ ఘటనలో ఆశారాం బాపు హస్తమున్నట్లు కేసు నమోదైంది. చేతబడి చేయడం వల్ల విద్యార్థులు మరణించినట్లు స్థానికులు ఆరోపించటంతో ఆశారాం బాపును నిందితునిగా పరిగణించారు. ఇదే కాకుండా వ్యభిచారం కేసు కూడా తోడవ్వడంతో ఈ బాబాజీ జైలు గోడలకే పరిమితమయ్యాడు. ఈయనే కాదు ఈయన కొడుకు కూడా తండ్రి బాటలో తూ.చ తప్పకుండా నడుచుకున్నాడు మరి. వీళ్లే కాదు, ఈ ఆశ్రమంలో పనిచేసే వాళ్లు కూడా పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

  నారాయణ్ సాయి...

  నారాయణ్ సాయి...

  పైన చెప్పుకున్న ఆశారాం బాపు పుత్ర రత్నమే ఈ నారాయణ్ సాయి. తండ్రికి తగ్గ తనయుడు. 5000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న నారాయణ్ సాయి అనేక రకాల కేసులలో నిదితుడు. ఇంకా వివిధ దేశాలకు చెందిన 8 మంది మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలున్నాయి. 2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని సూరత్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు కూడా చేసింది. న్యూఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లో నారాయణ సాయి అతడి స్నేహితులతో ఉండగా న్యూఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయి తమపై అత్యాచారం చేశారని గుజరాత్ కు చెందిన ఇద్దరు సోదరిమణులు స్థానిక పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో నారాయణ సాయిని వెంటనే అరెస్ట్ చేయాలని నవంబర్ 24న పోలీసులను గుజరాత్ హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

  ఇచ్చాధారి సంత్ స్వామి భీమానందజీ మహరాజ్ చిత్రకూట్ వాలే...

  ఇచ్చాధారి సంత్ స్వామి భీమానందజీ మహరాజ్ చిత్రకూట్ వాలే...

  తనను తాను సాయిబాబా అవతారంగా పరిచయం చేసుకుని.. నేడు కటకటాలు లెక్క పెడుతున్న కరన్ కుమార్ ద్వివేది 1988లో నెలకు రూ.6 వేల వేతనంపై ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసేవాడు. తరువాత కొన్ని రోజులకు లజపత్ నగర్ లోని మసాజ్ పార్లర్ లో పని చేయడం మొదలెట్టాడు. హఠాత్తుగా 1997లో ఈయన పేరు ప్రపంచానికి తెలిసింది. అదీ వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు దొరికిపోయిన కేసు వల్ల. జైలు నుండి విడుదలయిన తరువాత అసలు నిజం గ్రహించాడు. బతకడానికి సులువైన మార్గం అనిపించడంతో బాబా అవతారం ఎత్తాడు. చివరికి పాపాలు పండి 2010 ఫిబ్రవరి 26వ తేదీన ఆరుగురు మహిళలతో పోలీసులకు చిక్కాడు. ఈయన చేయని వ్యాపారాలు లేవని చెప్పొచ్చు. ఒక్క వ్యభిచార వ్యాపారం మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, వడ్డీ వ్యాపారం కూడా చేశాడు. ఈ బాబాకి లాస్ వెగాస్ చారిటబుల్ ఆర్గనైజేషన్ నుండి పెద్ద మొత్తంలో విరాళాలు అందినట్టు పోలీసు ల విచారణలో తేలింది.

  స్వామి ప్రేమానంద...

  స్వామి ప్రేమానంద...

  తమిళనాడులోని తిరుచ్చిరపల్లి ఆశ్రమం నిర్వహిస్తూ తన భక్తుల కోర్కెలు నెరవేరుస్తూ ఉండే స్వామి ప్రేమానంద.. ఆ పేరుకు తగ్గట్టే చాలా ప్రేమపరుడు. తన వద్దకు వచ్చే భక్తులకు మాయమాటలు చెప్పి లోబరుచుకునేవాడు. శ్రీలంకకు చెందిన రవి అనే యువకుడి హత్యలో స్వామి ప్రేమానంద ప్రధాన నిందితుడు. ఈయన 13 మందిని అత్యచారం చేసి చంపిన కేసులో ముద్దాయిగా నిరూపించబడ్డాడు. ఈయనకు సహకరించిన మరో ఆరుగురికి కూడా కారాగార వాసం దక్కింది. 1997లో పుడుకొట్టై సెషన్ కోర్టు స్వామి ప్రేమానందకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2002లో సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేసింది. 21 ఫిబ్రవరి 2011లో ఈయన అనారోగ్యంతో మరణించాడు.

  స్వామి సదాచారి...

  స్వామి సదాచారి...

  దేశంలోని ప్రముఖులచేత, చాలా మంది రాజకీయనాకులచేత పూజలందుకున్న ఘనత ఈయన సొంతం. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే స్వామి సదాచారి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యాగాలు చేసేవాడు. మంత్ర తంత్రాలతో ప్రభుత్వాలను నిలబెట్టగలిగే శక్తులు తనకున్నట్లు చెప్పుకుంటూ ఈయన పలువురు రాజకీయ నాయకులను ప్రలోభాలకు గురిచేసినట్లు వినికిడి. చివరికి ఈ స్వామి సదాచారి కూడా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడనే కేసులో అరెస్టయ్యాడు.

  ఈ భూమ్మీద మనకు తెలిసినది కొంతే.. తెలియనిది ఎంతో! భగవంతుడు ఉన్నాడా? లేడా? అన్న ప్రశ్నకంటే.. ఉన్నాడని నమ్మే వాళ్లు, లేడని బల్లగుద్ది వాదించే వాళ్లూ పుడుతూనే ఉన్నారు.. చస్తూనే ఉన్నారు. మనిషి జీవన క్రమంలో కొన్ని కట్టుబాట్లు, నమ్మకాలు కల్పించుకున్నాడు. వాటి ద్వారా కొన్ని హద్దులు నిర్ణయించుకుని ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది భగవంతుడికి నచ్చుతుంది, ఇది నచ్చదు అంటూ.. నిర్ణయించుకున్నాడు. అయితే ఈ కట్టుబాట్లు, నమ్మకాలు మనిషిని మంచి మార్గంలో పెట్టడానికే అన్న విషయం మరవరాదు. ఏ మతమైనా ఎదుటి వారికి చెడు చేయమని చెప్పదు. దైవం అంటేనే నమ్మకం. అల్లరి చేస్తే దేవుడికి కోపమొస్తదని భయపెడుతుంది అమ్మ. అంటే దేవుడున్నాడనేగా మన నమ్మకం. ఆ భయం వల్ల అల్లరి మానేస్తాడు పిల్లవాడు. భయం, నమ్మకం వీటి మధ్యనే ఉంది దైవం యొక్క అస్థిత్వం.

  అయితే సామాన్య జనాలకు ఉన్న ఈ నమ్మకాన్ని మాత్రం కొందరు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారన్నది అక్షర సత్యం. బతకడానికి చేతకాని, చేవ లేని, మోసగాళ్లు కొందరు బాబాలమంటూ తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. దీంట్లో కూడా ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రతేకత. ఒకడేమో తంతాడు, ఇంకొకడు నోట్లోంచి లింగం తీస్తాడు, మరొకడు తన చేయి తాకితే చాలు సర్వ రోగాలు నశిస్తాయంటాడు, ఇంకొకడు మహిళలతో సకల మర్యాదలు చేయించుకుంటాడు. పొద్దుకూకగానే సకల భోగాలు అనుభవిస్తూ, రాసలీలలకు తెరతీసే ఎందరో బాబాలు తిరిగి పొద్దు పొడవగానే టీవీ ఛానళ్లలో ప్రత్యక్షమై నీతిసూత్రాలు వల్లెవేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బాబాల వేషాలకు అంతూ పొంతూ ఉండదు.

  English summary
  In India, number of Saints, Swamijis are emerging day by day and lot of them are committing crimes and going jail. Recently Dera Sacha Sauda Gurmeet Ram Rahim Singh went to jail in two rape cases. Before this, Swamy Nityananda, Baba Rampal, Asharam Bapu, Narayan Sai, Sant Swamy Bheemanandaji Maharaj Chitrakoot Wale, Swamy Premananda, Swamy Sadachari are went to jail.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X