అయోధ్య కేసులో కీలకంగా వ్యవహరించిన తెలుగు లాయర్లు వీరే..!
న్యూఢిల్లీ: నవంబర్ 9వ తేదీన అయోధ్య రామమందిరం - బాబ్రీమసీదు భూవివాదంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద భూమి రామ్‌లల్లా విరాజ్‌మన్‌కు చెందుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయితే ఈ కేసులో హిందూ సంఘాల తరపుప వాదించిన న్యాయవాదులకు గ్రౌండ్ లెవెల్ నుంచి సహకారం అందించింది తెలుగు రాష్ట్రాలకు చెందిన లాయర్లు కావడం విశేషం. ఇంతకీ ఈ చారిత్రాత్మక తీర్పులో భాగస్వామ్యమైన ఈ జూనియర్ లాయర్లు ఎవరు..? వారు ఎలాంటి సహకారం అందించారు..?
అయోధ్య తీర్పుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓవైసీ పై కేసు నమోదు చేయాలి: సుభాష్

కేసులో కీలకంగా వ్యవహరించిన తెలుగు లాయర్లు
అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదం కేసులో చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హిందూ పార్టీల తరపున వాదించారు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు పరాశరన్, సీఎస్ వైద్యనాథన్, పీఎస్ నరసింహ, మరియు రంజిత్ కుమార్‌లు. వీరు న్యాయస్థానం ముందు అన్ని అంశాలను ప్రస్తావిస్తూ అన్ని నివేదికలను పొందు పరిచి అయోధ్య రామమందిరం -బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రామ్‌లల్లాకే చెందుతుందని వాదించారు. వారి వాదనలకే సుప్రీంకోర్టు మొగ్గు చూపుతూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో మసీదుకు అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలంటూ తీర్పు వెల్లడించింది. ఇక ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు తెలుగురాష్ట్రాలకు చెందిన లాయర్లు.

ఒక బృందంగా ఏర్పడిన లాయర్లు
అయోధ్య భూవివాదం కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టగానే 2017లో ఈ కేసులో పిటిషనర్ల తరపున న్యాయవాదులు, హిందూ సంఘాలు ఒక టీమ్‌గా ఏర్పాడ్డారు. ఇక్కడే తమవంతు సాయంగా తెలుగు లాయర్లు కూడా కృషి చేశారు. ఈ కేసులో పనిచేసిన తెలుగు లాయర్లలో తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ శ్రీధర్ పోతరాజు, అఖిల భారతీయ అధివక్త పరిషత్‌లు కేసులో ఎంతో కీలకంగా మారిన సమాచారాన్ని అందించాయి. ఇక వీరిచ్చిన సమాచారంపై దివ్వెల భరత్ కుమార్, వాడ్రేవు పట్టాభిరామ్, తాడిమళ్ల భాస్కర గౌతమ్, గవర్రాజు ఉషశ్రీ , వీఎన్ఎల్ సింధూరలు రీసెర్చ్ చేశారు. కీలక సమాచారాన్ని సేకరించారు.

20వేల డాక్యుమెంట్లను ప్రిపేర్ చేసిన శ్రీధర్ పోతరాజు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తాను పదవీవిరమణ పొందేలోగా అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పు ఇవ్వాలని భావించిన నేపథ్యంలో వరుసగా 40 రోజుల పాటు వాదనలు విన్నారు. ఇక వరుసగా వాదనలు ఉండటంతో పనిభారం, ఎప్పటికప్పుడు సమాచార సేకరించడంలో ప్రక్రియను వేగవంతం చేసినట్లు న్యాయవాది శ్రీధర్ పోతరాజు చెప్పారు. పాతకేసుల్లో తీర్పులు, ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక, మ్యాపులు, ఇలా చాలా అంశాలను విశ్లేషించి 20వేలకు పైగా డాక్యుమెంట్లను ప్రిపేర్ చేసినట్లు చెప్పారు. వీటన్నిటీనీ డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. కేసులో వాదిస్తున్న సీనియర్లు వారికి కావాల్సిన సమాచారం అడగగానే వెంటనే తీసి ఇచ్చేవాళ్లమని ఈ ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చిందని పోతరాజు చెప్పారు.

దశాబ్దాలుగా ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులు సేకరణ
ఇదిలా ఉంటే అఖిల భారతీయ అధివక్త పరిషద్, జాతీయ ప్రధాన కార్యదర్శి, స్వతహాగా న్యాయవాది అయిన దివ్వెల భరత్ కుమార్ సీనియర్ న్యాయవాదుల మధ్య కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అయోధ్య వివాదం కొన్ని దశాబ్దాలుగా కొనాసాగుతున్నందున అప్పటి నుంచి అంటే 1850 నుంచి 1925 వరకు ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులను సేకరణ చేసే బాధ్యతను తాడిమళ్ల భాస్కర గౌతమ్ నిర్వహించారు. ఇక సీనియర్ న్యాయవాదుల వాదనలను మొత్తం ఒక రికార్డ్‌గా తయారు చేసే బాధ్యతను లాయర్ వాడ్రేవు పట్టాభిరామ్ తీసుకున్నారు.

హిందూ సంఘాల తరపున వాదించిన సీనియర్ లాయర్ నరసింహన్
ఇక సుప్రీంకోర్టులో హిందూ సంఘాల తరపున వాదనలు వినిపించిన మరో సీనియర్ లాయర్ పీఎస్ నరసింహ. ఈయన కూడా తెలుగువారే కావడం విశేషం. ఈయన గతంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు. బీసీసీఐ వివాదం సమయంలో సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. ఇక కీలకమైన అయోధ్య బాబ్రీ మసీదు కేసులో హిందుసంఘాల తరపున సీనియర్ కౌన్సిల్ నరసింహ తన వాదనలు వినిపించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!