ట్రాఫిక్ లో చిక్కుకున్న సోదరి, రాఖీ కట్టడానికి రాలేదని సోదరుడి ఆత్మహత్య !
తన సోదరి రాఖీ కట్టడానికి రాలేదని జీవితంపై విరక్తి చెందిన అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో ని ఆగ్రా నగరంలో జరిగింది.
ఆగ్రా: తన సోదరి రాఖీ కట్టడానికి రాలేదని జీవితంపై విరక్తి చెందిన అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో ని ఆగ్రా నగరంలో జరిగింది. ఆగ్రాలోని రామ్ బాఫ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సోను అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
సోనుకు భావన అనే సోదరి ఉంది. సోను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాఖీ పండగ సందర్బంగా తన ఇంటికి రావాలని సోను తన సోదరి భావనకు చెప్పాడు. భావనకూడా తాను వచ్చి రాఖీ కడుతానని అన్న సోనుకు చెప్పింది.
రాత్రి వరకు భావన కోసం ఎదురు చూసిన సోను చివరికి తన సోదరి రాలేదని జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటికే సోదరుడి ఇంటికి బయలుదేరిన భావన ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. చివరికి చేతిలో రాఖీ పట్టుకుని ఇంటికి చేరుకున్న భావన తన సోదరుడు సోను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు.