• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్ - బిహార్ కార్మికులు: 'అయిదు రూపాయల వడ్డీకి అప్పు చేసి విమానంలో వెళ్తున్నా'

By BBC News తెలుగు
|

బిహార్ కార్మికుడు

శ్రీనగర్ వెళ్లేందుకు టోనీ శేఖ్‌ బిహార్‌లోని పట్నా విమానాశ్రయానికి వచ్చారు. ఆయన వయసు 32 ఏళ్లు. టోనీది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో ఇళ్లను అందంగా తయారుచేసే పని.

పట్నా విమానాశ్రయంలోనే టోనీ నాకు కలిశారు. అప్పుడు సమయం ఇంచుమించుగా రాత్రి తొమ్మిది గంటలు. టోనీ తన విమానం కోసం వేచి చూస్తూ ఉన్నారు.

పట్నా నుంచి శ్రీనగర్ వెళ్లేందుకు రూ. 6000 పెట్టి ఆయన విమాన టికెట్ కొనుక్కున్నారు. టోనీ శేఖ్‌ది బిహార్‌లోని సుపోల్ జిల్లాలో ఉన్న బరముతరా గ్రామం. అక్కడి నుంచి పట్నా విమానాశ్రయం వరకూ వచ్చేందుకు ఆయనకు రూ.300 ఖర్చయ్యాయి. శ్రీనగర్‌కు విమానంలో వెళ్లేందుకు తాను అప్పు చేయాల్సి వచ్చిందని టోనీ శేఖ్ చెప్పారు.

''రూ.10వేలు అప్పు తీసుకున్నా. వందకు రూ.5 వడ్డీ. నెలా నెలా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వడ్డీ వ్యాపారి మా ఇంట్లోవాళ్లను కొడతారు. ఇక్కడ పని దొరకక, వెళ్లడం తప్పనిసరైంది. రైళ్లు లేవు. అందుకే విమానంలో వెళ్తున్నా’’ అని ఆయన చెప్పారు.

టోనీకి ఇద్దరు పిల్లలు.

బిహార్ కార్మికులు

పట్నా విమానాశ్రయంలో టోనీలాగే విమానాల కోసం వేచిచూస్తున్న కార్మికులు ఇంకా చాలా మంది ఉన్నారు.

పట్నా విమానాశ్రయం పార్కింగ్‌లో మే 23 మధ్యాహ్నం ఓ చెట్టు కింద వేచి చూస్తూ ఉన్న కార్మికులు వందల్లో నాకు కనిపించారు.

బిహార్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు వారిలో చాలా మంది ఉన్నారు. కొందరు ప్రయాణ సమయానికి 15-16 గంటల ముందే విమానాశ్రయానికి వచ్చారు.

కొందరు ఎండలో ఎదురుచూస్తూ ఉన్నారు. కొందరు పడుకున్నారు. కొందరు మొబైల్ ఫోన్లను చూస్తున్నారు. కొందరు మాస్క్‌లు పెట్టుకున్నారు, కానీ భౌతిక దూరం పాటించడం లేదు.

చాలా మందికి అదే తొలి విమాన ప్రయాణం.

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా విమానం ఎక్కాల్సి వస్తోందని చాలా మంది చెప్పారు. అయితే, విమానం ఎక్కాలన్న కల నెరవేరుతోందన్న సంతోషం కూడా కొందరిలో ఉంది.

బిహార్ కార్మికులు

పని ఉండే నెలలు కోల్పోయారు

జమ్మూలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే మహమ్మద్ జుమ్మన్‌ కాస్త సంకోచిస్తూ నాతో మాట్లాడారు.

''ఇంట్లోవాళ్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పారు. విమానంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సి ఉంటుందని ఓ తెలిసిన అబ్బాయి చెప్పాడు. ఏదో యూనిఫామ్ లాంటిది ఇస్తారని అన్నాడు’’ అని ఆయన అన్నారు.

శ్రీనగర్, హైదరాబాద్, లేహ్-లద్ధాఖ్, జమ్మూ, దిల్లీ సహా దేశంలోని చాలా ప్రాంతాలకు ఇక్కడి నుంచి కార్మికులు వెళ్తున్నారు. కొందరు అప్పులు చేసి టికెట్లు కొనుక్కుంటే, కొందరికి వారు పనిచేస్తున్న సంస్థలు టికెట్లు కొనిచ్చాయి.

శ్రీనగర్, జమ్మూ, లేహ్, లద్దాఖ్ వెళ్లే కార్మికులు మే నుంచి నవంబర్ నెలల మధ్యలో వెళ్తారు. ఆ తర్వాత చలి పెరుగుతుంది. అప్పుడు తిరిగి తమ గ్రామాలకు చేరుకుంటారు.

అయితే, ఈసారి లాక్‌డౌన్ వల్ల కార్మికులు పని ఉండే నెలలను కోల్పోవాల్సి వచ్చింది.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో జులై 1 నుంచి ఆగస్టు 12 వరకూ సాధారణ రైళ్లన్నింటినీ రైల్వేశాఖ రద్దు చేసింది. స్పెషల్ రాజధాని, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలు మాత్రం కొనసాగుతున్నాయి.

అప్పులపాలవుతున్న కార్మికులు

బాంకా జిల్లాకు చెందిన శిబూ రాయ్, ఆయన కుమారుడు కంచన్ కుమార్ ఇంకొందరు కలిసి పదివేల రూపాయలకు ఓ వాహనం మాట్లాడుకుని, పట్నా విమానాశ్రయానికి వచ్చారు.

వారు లెహ్ లద్దాఖ్ వెళ్తున్నారు. వాళ్ల విమాన టికెట్ల ఖర్చును వారి సంస్థే భరిస్తోంది.

''మాకు అక్కడ రూ.14 వేల జీతం ఇస్తారు. ఊరిలో వ్యవసాయ పనులు అయిపోయాయి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం’’ అని కంచన్ అన్నారు.

ముజఫ్ఫర్‌పుర్‌కు చెందిన నీలేశ్ కుమార్, తూర్పు చంపారన్‌కు చెందిన మహమ్మద్ కమ్రాన్ గార్డులుగా పనిచేసేందుకు హైదరాబాద్ వెళ్తున్నారు. వాళ్లకివే తొలి ఉద్యోగాలు. వారికి విమాన టికెట్లను వారి సంస్థే కొని ఇచ్చింది.

మహమ్మద్ సలీం, మహమ్మద్ ఉకైత్ అప్పు చేసి విమాన టికెట్లు కొన్నారు.

సలీం వందకు ఐదు రూపాయల వడ్డీకి, మహమ్మద్ పది రూపాయాల వడ్డీకి ఈ అప్పులు చేశారు.

''ఎన్నికలు వస్తే, ఓటర్ జాబితా కోసం ప్రభుత్వం ఇంటింటికీ సిబ్బందిని పంపిస్తుంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఎలా ఉన్నారని కనీసం మమ్మల్ని ఎవరైనా అడిగారా? ప్రభుత్వం తీరు ఇదేనా?’’ అని ఉకైత్ ప్రశ్నించారు.

''ఒకటో తారీఖకు ఈద్ ఉంది. నిజానికి మేం కుటుంబంతో ఉండాలి. ఏవైనా కొనుక్కోవాలి. కానీ, అవన్నీ ఎక్కడ జరుగుతాయి. మేమే అప్పులు చేసి, వెళ్తున్నాం. అప్పు కట్టకపోతే, ఇంట్లోవాళ్లను ఆ వ్యాపారాలు కొడతారు’’ అని సలీం అన్నారు.

బిహార్ కార్మికుడు

'ఇప్పటివరకూ రేషన్ షాపులో పప్పు తీసుకోలేదు’

లాల్ కుమార్ రాయ్ ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నారు. ఆయనది సుపౌల్ జిల్లా.

''ఇక్కడ పని దొరకడం లేదు. అనంత్‌నాగ్‌లో పీఓపీ పనిచేస్తా. రూ.600 కూలీ వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం రేషన్ ఇస్తున్నామని చెబుతోంది. బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అది కూడా తక్కువ తూకం వేసి ఇస్తున్నారు. ఇప్పటివరకూ మేం రేషన్ షాపులో పప్పు తీసుకున్నది లేదు’’ అని లాల్ కుమార్ చెప్పారు.

''విమానంలో వెళ్లాల్సి రావడంతో వృథా ఖర్చు అవుతోంది. ఇక్కడ పని ఉండదు. కూర్చొని ఏం చేస్తాం. బయటకు వెళ్తే, పది రూపాయాలైనా దొరుకుతాయి. అందుకే అప్పు చేసైనా, వెళ్తున్నాం. కానీ, మా ఇంట్లో నుంచి నేను ఒక్కడినే వెళ్తున్నా. నా కుమారులు ఈసారి ఇక్కడే ఉండిపోయారు’’ అని మహమ్మద్ వాసిల్ చెప్పారు.

మరోవైపు కరోనా సంక్షోభం నేపథ్యంలో స్థానికులకు ఉపాధి కల్పనకు బిహార్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చిందని రాష్ట్ర ప్రజా సంబంధాల విభాగం కార్యదర్శి అనుపమ్ కుమార్ అన్నారు.

ఇప్పటివరకూ 11.42 కోట్ల పని దినాలు కల్పించేలా 5.55 లక్షల కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలో 91 శాతం ఉన్న వెనుకబడ్డ కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నట్లు చెప్పారు.

పట్నా విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో కార్మికులు కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం ప్రభుత్వం చెబుతున్న విషయాలకు విరుద్ధమైన పరిస్థితి ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This Bihari migrant worker takes handloan to reach Srinagar by flight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X