farmers protest union minister proposal farmers postpone రైతుల నిరసన కేంద్ర మంత్రి ప్రతిపాదన రైతులు వాయిదా
రైతుల ఆందోళనకు మూడు నెలలు పూర్తి .. మరో మారు రైతుల ముందు చర్చల ప్రతిపాదన పెట్టిన తోమర్
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన మూడు నెలలు పూర్తయింది. మూడు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ బోర్డర్లో, ఢిల్లీలో రైతులు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిగినప్పటికీ చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు ఆందోళన విరమించేది లేదని, వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తామని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే ఇక మూడు నెలలుగా రైతుల సాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా కిసాన్ కాంగ్రెస్ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇంటిని ముట్టడించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ యూనిట్ కార్యకర్తలు కేంద్ర మంత్రి తోమర్ కార్యాలయానికి వెళ్లడానికి ముందు ఢిల్లీలో ఉదయం 11:30 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యేలా ప్రణాళిక వేసినట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
గత ఏడాది సెప్టెంబర్లో పార్లమెంటు అమలు చేసిన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రాజధాని పలు సరిహద్దుల్లో రైతులు ప్రారంభించిన ఆందోళన నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.

నవంబర్ 26 నుండి నిరసనకారులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు .
మరోపక్క రైతులతో చర్చల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలు అమలు ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తున్నట్లు తాము చేసిన ప్రతిపాదనపై అన్నదాతలు ముందుగా స్పందించాలని ఆయన సూచించారు . నరేంద్ర సింగ్ తోమర్ చర్చలకు పిలుపునిస్తున్నా, ఏడాదిన్నర పాటు వ్యవసాయ చట్టాలను వాయిదా వేయడానికి రైతులు అంగీకరించటం లేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మాత్రమే రైతులు డిమాండ్ చేస్తున్నారు.