ఒకే రోజు.. ఒకే జిల్లాలో.. ఒకే కారణంతో ముగ్గురు మృతి.. భయం గుప్పిట్లో ప్రజలు !
ఉత్తరప్రదేశ్‌లో ఒకే రోజు.. ఒకే జిల్లాలో.. ఒకే కారణంతో ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా.. స్థానిక ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజేష్‌స్థాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటు కారణంగా ఒక్కరోజే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
చనిపోయిన వారి వివరాలు..
చంద్రేష్ పాల్ (40)..
ఫరీద్‌పూర్ హెతారియా గ్రామానికి చెందిన చంద్రేష్ పాల్ ఢిల్లీలోని రోహిణిలో నివసిస్తూ టెలికాం విభాగంలో SDOగా పనిచేస్తున్నారు. ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. గుండెపోటు ఆయన మృతికి కారణమని తేలింది. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించారు. చంద్రేష్‌కు భార్య అర్చన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రెండేళ్ల కూతురు ఉన్నారు.

దీపు కుమార్ (30)..
అల్లిపూర్ బార్జీ గ్రామానికి చెందిన దీపు కుమార్ అయోధ్యలో కూలీగా పని చేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో అనూహ్యంగా అనారోగ్యం పాలై కన్నుమూశారు. దీపు తండ్రి 15 సంవత్సరాల క్రితం మరణించగా.. ఇప్పుడు దీపు కూడా మరణించడంతో అతని తల్లి ఈ వార్తను తట్టుకోలేక స్పృహ తప్పిపోయారు. మరణించిన వ్యక్తికి భార్య వందన, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. దీపు ఆకస్మిక మరణం కారణంగా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
అనుజ్ కుమార్ (24)..
బంకట బుజుర్గ్ గ్రామానికి చెందిన అనుజ్ కుమార్, ఓ పెళ్లి ఊరేగింపులో పాల్గొనేందుకు పొరుగు జిల్లా అజంగఢ్‌లోని హుసాపూర్ వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుజ్‌కు భార్య మాల్తి, తల్లి అనిత, ఒక్క సంవత్సరపు కుమారుడు శ్రీషభ్ ఉన్నారు.
అయితే ఈ మూడు ఘటనలు ఒకే రోజు జరగడం యాదృచ్చికమా ? లెక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు గుండె సంబంధిత సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ వయసులోనే గుండెపోటు కారణంగా మరణాలు నమోదవుతుండడం ఆందోళనకరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications