థరూర్ వర్సెస్ టిక్‌టాక్ : ఆరోపణలు అసంబద్ధమని కౌంటర్
న్యూఢిల్లీ : సమాచారాన్ని సేకరించి, చైనాకు టిక్‌టాక్ అందిస్తోందనే కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఆరోపణలన్నీ అవాస్తవమని తోసిపుచ్చింది. టిక్‌టాక్‌లో వినియోగదారుల గోప్యత ప్రాధాన్యం ఇస్తామని, భద్రతకు పెద్దపీట వేస్తామని తేల్చిచెప్పింది.
ఇదీ విషయం ..
దేశంలో టిక్‌టాక్ యూజర్లు ఎక్కువే. దాదాపు 200 మిలియన్ వినియోగదారులు టిక్‌టాక్ యాప్ వాడుతున్నారు. ఇది చైనాకు చెందిన బైట్ డ్యాన్స్‌కు చెందిన కంపెనీ. అయితే దేశంలోని యూజర్ల సమాచారాన్ని టిక్‌టాక్ సేకరించి, చైనాకు అందిస్తోందని శశిథరూర్ సోమవారం ఆరోపించారు. జీరో అవర్‌లో ఆయన టిక్‌టాక్ యాప్‌పై వ్యాఖ్యలు చేశారు. టిక్ టాక్ నుంచి చైనా టెలికాం ద్వారా సమాచారం అందినట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయని గుర్తుచేశారు థరూర్. చిన్నారులకు సంబంధించి చట్టవిరుద్ధంగా సమాచారం సేకరించినందుకు అమెరికా నియంత్రణ సంస్థలు టిక్‌టాక్‌పై 5.7 మిలియన్ డాలర్ల జరిమానా విధించాయనే విషయాన్ని గుర్తుచేశారు.

సత్యదూరం ..
సోమవారం లోక్‌సభలో శశిథరూర్ తీవ్ర ఆరోపణలతో టిక్‌టాక్ స్పందించింది. తాము వినియోగదారుల గోప్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. టిక్ టాక్ వినియోగంలో ఉన్న ప్రాంతాల్లోని చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పింది. అంతేకాదు తమ నుంచి సమాచారాన్ని సేకరించే వెసులుబాటు చైనా ప్రభుత్వానికి లేదని గుర్తుచేసింది. చైనా టెలికాంకు టిక్‌టాక్‌తో ఎలాంటి భాగస్వామ్యం లేదని స్పష్టంచేసింది. అమెరికా, సింగపూర్‌లోని ఇన్ఫర్మేషన్ సెంటర్లో భారత వినియోగదారుల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నామని తెలిపింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!